షిఫ్ట్ టైం అయిపోయాక కూడా పనిచేసే వారికి వార్నింగ్

షిఫ్ట్ టైం అయిపోయాక కూడా పనిచేసే వారికి వార్నింగ్

మీరు మీ ఆఫీస్ పని గంటలు అయిపోయాక కూడా పని చేస్తుంటే.. మీ షిఫ్ట్ టైం అయిపోయింది ఇక ఇంటికెళ్లండి అని మీ కంప్యూటర్ ఎప్పుడైనా చెప్పిందా..? అసలు ఇలా మెసేజ్ ఇచ్చే కంపెనీలు కూడా ఉంటాయా..? అన్పిస్తుంది కదా. వినడానికి ఆశ్చర్యంగానే ఉన్నా.. ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో ఈ పద్ధతే అమలవుతోంది. అదెక్కడ అంటే ఇండోర్ కి చెందిన సాఫ్ట్ గ్రిడ్ కంప్యూటర్స్. కొన్ని సార్లు ఆఫీస్ అవర్స్ ముగిసినా.. వర్క్ పెండింగ్ లేదా ఏదో ఆలోచిస్తూ అక్కడే కూర్చుండిపోతాం. అలా కేటాయించిన టైం కన్నా ఎక్కువ సమయం ఆఫీస్ లోనే గడిపేస్తూ ఉంటాం. అలాంటి సమయాల్లో ఈ కంపెనీ ఉద్యోగుల డెస్క్ టాప్ స్ర్కీన్ పై ఓ మెసేజ్ వచ్చేలా ఏర్పాటు చేసింది. ఈ కంపెనీలో షిఫ్ట్ టైం అయిపోగానే “మీ షిఫ్ట్ ముగిసింది. దయచేసి ఇంటికి వెళ్లండి" అనే ఓ మెసేజ్ డెస్క్ టాప్ పై కనిపిస్తుంది. ఈ విషయాన్ని ఆ కంపెనీ హెచ్‌ఆర్ స్పెషలిస్ట్ తన్వీ ఖండేల్వాల్ లింక్డ్ ఇన్ లో షేర్ చేశారు. “హెచ్చరిక!!! మీ షిఫ్ట్ సమయం ముగిసింది.. ఆఫీస్ సిస్టమ్ 10 నిమిషాల్లో షట్ డౌన్ అవుతుంది... దయచేసి ఇంటికి వెళ్లండి"  అని తమ ఉద్యోగులకు మెసేజ్ వచ్చేలా ఏర్పాటు చేశామన్నారు. తమ కంపెనీ గంటల తరబడి పని చేయనివ్వదని వెల్లడించారు. దాని వల్ల ఉద్యోగులు ఒత్తిడి లేకుండా మరింత ఉత్సాహంతో పని చేస్తారన్నారు. దాంతో పాటు తమ కంపెనీలో ఉద్యోగుల డెస్క్ టాప్ పై వచ్చే మెసేజ్ తో కూడిన పిక్ ను కూడా ఆమె షేర్ చేశారు. 

ఈ పోస్ట్ పై నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు. ఇది తమ ఆఫీసేనని, ఇది నిజమేనంటూ ఓ యూజర్ కామెంట్ చేయగా.. ఈ రోజుల్లో ఇలాంటి నిర్ణయం చాలా మంచిదని మరొకరు పేర్కొన్నారు. ఇది చాలా అద్భుతమని, ఆఫీస్ అయిపోయాక కంపెనీకి సంబంధించి తమకు ఎలాంటి కాల్స్, మెయిల్స్ కూడా రావని మరొక ఎంప్లాయి కామెంట్ చేశారు