సీఎంవో లెటర్ ఉంటేనే ప్రైవేటు కాలేజీల షిఫ్టింగ్

సీఎంవో లెటర్ ఉంటేనే ప్రైవేటు కాలేజీల షిఫ్టింగ్
  • అధికార పార్టీ ఎంపీకి చెందిన ఆరు కాలేజీల తరలింపునకు ఏర్పాట్లు 
  • ఈ ఏడాది నాన్​లోకల్ షిఫ్టింగ్​కు నోటిఫికేషన్ ఇవ్వని ఇంటర్ బోర్డు 
  • అప్లై చేయకున్నా సీఎంవో సిఫార్సులతో తరలింపులు
  • ఇంటర్ బోర్డు నిబంధనలు బేఖాతరు 

హైదరాబాద్, వెలుగు : ఇంటర్ బోర్డులో  నిబంధనలను గాలికి వదిలేశారు. నిన్నటి వరకూ కాలేజీల షిఫ్టింగ్​కు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు మాత్రమే సిఫారసులు చేయగా, తాజాగా సీఎంఓ కూడా ఆ జాబితాలోకి చేరింది. ఈ ఏడాది ప్రైవేటు కాలేజీల నాన్​ లోకల్ షిఫ్టింగ్​కు ఇంటర్ బోర్డు నోటిఫికేషన్ ఇవ్వకున్నా, పలు కాలేజీలను వివిధ ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అధికార పార్టీ ఎంపీకి చెందిన ఆరు కాలేజీలను షిఫ్టింగ్​ చేయాలంటూ సీఎంవో నుంచి ఆదేశాలు రావడంతో ఇంటర్ బోర్డులో చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రంలో అవసరానికి మించి ప్రైవేటు, కార్పొరేట్ ఇంటర్ కాలేజీలు ఉన్నాయన్న కారణంతో రాష్ట్రం ఏర్పడిన తర్వాత కొత్త కాలేజీలకు సర్కారు అనుమతి ఇవ్వడం లేదు. దీంతో కొత్తగా కాలేజీలు ఏర్పాటు చేసుకోవాలనే ఆలోచన ఉన్న వారంతా, ప్రస్తుతం ఉన్న కాలేజీలనే కొనుగోలు చేసి పేర్లు మార్చుకుంటున్నారు. వారికి అనువుగా ఉన్న ప్రాంతాలను ఎంచుకుని పొలిటికల్ లీడర్ల సిఫారసులతో పెట్టుకుంటున్నారు. అయితే సర్కారు నిబంధనల ప్రకారం మండల పరిధిలోనే కాలేజీ మార్చుకోవాలంటే ఇంటర్ బోర్డు సెక్రటరీ అనుమతి సరిపోతుంది. కానీ ఒక మండలం నుంచి మరో మండలానికి, ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు మారాలంటే తప్పనిసరిగా సర్కారు పర్మిషన్ తీసుకోవాలి. నిరుడి దాకా విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పర్మిషన్ ఉంటేనే నాన్​షిఫ్టింగ్​కు దరఖాస్తు చేసుకునేవారు. 2021–22లో  షిఫ్టింగ్, కాలేజీ పేరు మార్పు, మేనేజ్మెంట్ మార్పునకు 257 కాలేజీలు దరఖాస్తు చేసుకున్నాయి. వీటిలో నాన్​లోకల్ షిఫ్టింగ్​కాలేజీలూ ఉన్నాయి. వారంతా ఫీజు కట్టడంతో ముగ్గురు సభ్యుల కమిటీ కూడా షిఫ్టింగ్​కు పర్మిషన్ ఇవ్వొచ్చని రిపోర్టు ఇచ్చాయి. అయినా పలు కాలేజీలకు సర్కారు ఇంకా పర్మిషన్ ఇవ్వలేదు. గతేడాదే విద్యా శాఖ మంత్రితో పాటు మహబూబ్​ నగర్, కరీంనగర్​ జిల్లాలకు చెందిన మంత్రుల సిఫార్సులతో పలు కాలేజీలు ఇతర ప్రాంతాలకు షిఫ్ట్ అయ్యాయి. మహబూబ్ నగర్​ లో ఓ కాలేజీ తరలింపు నిబంధనలకు విరుద్ధమని ఇంటర్ బోర్డు రిపోర్టు ఇచ్చినా పట్టించుకోకుండా షిఫ్టింగ్ చేయాలని సర్కారు జీవో ఇచ్చింది. ఇదే పరిస్థితి ఈ ఏడాదీ కన్పిస్తోంది. 

ఆరు కాలేజీలను షిఫ్ట్ చేయాలని సీఎంవో ఆదేశం..

గతంలో ఓ మేనేజ్మెంట్ పరిధిలోని 27 ప్రైవేటు కాలేజీలను ఎంపీ, ఎమ్మెల్సీ పదవికి పోటీచేసి ఓడిపోయిన టీఆర్ఎస్​నేత హోల్ సేల్​గా కొనుగోలు చేసినట్లు తెలిసింది. వాటన్నింటిని డిమాండ్ ఉన్న ప్రాంతాలకు తరలించేందుకు గతేడాది నుంచి చర్యలు చేపట్టారు. దీంట్లో భాగంగానే ఈ ఏడాది సీఎంఓ నుంచే ఆదేశాలు ఇప్పించినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది జూన్ లోనే ఆరు కాలేజీలను ఇతర ప్రాంతాలకు తరలించేందుకు పర్మిషన్ ఇవ్వాలని సీఎం కేసీఆర్​కు శ్రీరాజేశ్వర ఎడ్యుకేషనల్ ట్రస్ట్ లేఖ రాసింది. వారిచ్చిన రిక్వెస్ట్ ను పరిశీలించి వెంటనే చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారని  సీఎం సెక్రటరీ రాజశేఖర్​రెడ్డి ఈ నెల 24న విద్యా శాఖ సెక్రటరీకి లేఖ రాశారు. మల్లికార్జున జూనియర్ కాలేజీ నకెరెకల్ నుంచి నల్గొండకు, చైతన్య కాలేజీ మహబూబాబాద్ నుంచి ఖమ్మంకు, శ్రీచక్ర జూనియర్ కాలేజీ ముప్కాల్​ నుంచి నిజామాబాద్​కు, ఎస్ఆర్​ జూనియర్ కాలేజీ హయత్​నగర్​ నుంచి ఇబ్రహీంపట్నంకు, గాయత్రి జూనియర్ కాలేజీ కుత్బుల్లాపూర్ నుంచి గండిమైసమ్మ ఏరియాకు, గాయత్రి జూనియర్ కాలేజీ హయత్​ నగర్​ నుంచి సంతోష్​ నగర్​కు షిఫ్టింగ్​కు పర్మిషన్ కోరగా, వాటన్నింటికీ అనుమతులిచ్చేందుకు రంగం సిద్ధమైంది. హడావుడిగా వాటిని తరలించేందుకు ఇంటర్ బోర్డు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే మోడల్ స్కూల్స్, కేజీబీవీలు, గురుకులాల అప్​గ్రేడ్​తో చిన్న కాలేజీల్లో అడ్మిషన్లు తగ్గాయి. అలాంటి కాలేజీలను ఇతర ప్రాంతాల్లో పెట్టేందుకు నానా తిప్పలు పెట్టే అధికారులు..సీఎంఓ నుంచి ఆదేశాలు రావడంతో వాటి షిఫ్టింగ్​కు ఏర్పాట్లు చేస్తుండటం ఇంటర్ బోర్డులో చర్చనీయాంశంగా మారింది.