- మరో నెల రోజుల్లో ప్రారంభం కానున్న మేడారం మహాజాతర
- ముందస్తు మొక్కులు చెల్లించుకునేందుకు ఇప్పటికే తరలివస్తున్న భక్తులు
- జాతర టైంలో లక్షలాది వాహనాలు వచ్చే అవకాశం
- బ్లాక్ స్పాట్ల వద్ద రక్షణ చర్యలు చేపట్టాలంటున్న భక్తులు
ఇది హనుమకొండ జిల్లా వడ్డేపల్లి ఉనికిచర్ల రూట్‌లో నిరూప్‌నగర్ తండా సమీపంలోని మూలమలుపు. గత మూడేండ్లలో ఇక్కడ 15 ప్రమాదాలు జరుగగా.. ఎనిమిది మంది చనిపోయారు. తాజాగా ఈ నెల 23న టిప్పర్ ఢీకొట్టిన ప్రమాదంలో దేవన్నపేటకు చెందిన యువకుడు చనిపోగా.. మరునాడు జరిగిన మరో ప్రమాదంలో యువకుడు గాయపడ్డాడు.
ములుగు/హనుమకొండ, వెలుగు : వరంగల్ కమిషనరేట్, ములుగు జిల్లాల పరిధిలో తరచూ జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు కలవరానికి గురి చేస్తున్నాయి. హైవేలపై డెడ్‌కర్వ్‌లు, రోడ్డు నిర్మాణ లోపాలతో తరచూ ప్రమాదాలు జరిగే ప్రాంతాలను ఇప్పటికే బ్లాక్ స్పాట్స్‌గా గుర్తించారు. కానీ అక్కడ ఎలాంటి రక్షణ చర్యలు చేపట్టకపోవడంతో వాహనదారులు ప్రమాదాలకు గురవుతూ ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు.
వచ్చే నెల 28 నుంచి మేడారం జాతర ప్రారంభం కానుండగా.. ఇప్పటికే భక్తుల రాక మొదలైంది. మహాజాతర టైంలో వరంగల్, ములుగు జిల్లాలోని రోడ్లపై లక్షల సంఖ్యలో వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. బ్లాక్ స్పాట్స్ వద్ద తగిన రక్షణ చర్యలు చేపట్టకపోతే మేడారం వచ్చే వాహనదారులకు ఇబ్బందులు తప్పవన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
ములుగు జిల్లాలో...
హన్మకొండ నుంచి భూపాలపట్నం వెళ్లే 163 జాతీయ రహదారిపై ములుగు జిల్లా పరిధిలో కొన్ని డేంజర్ స్పాట్లను గుర్తించారు. ప్రతీసారి జాతర టైంలో ఈ ప్రదేశాల్లోనే ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ములుగు మండలం ఇంచర్ల ఎర్రిగట్టమ్మ, ములుగు సమీపంలోని గట్టమ్మతల్లి ఆలయం మూలమలుపు వద్ద, జంగాలపల్లి క్రాస్‌రోడ్డు, జాకారం సమీపంలోని అబ్బాపూర్ క్రాస్ రోడ్డు, మల్లంపల్లి మండలం మహ్మద్‌గౌస్ పల్లి మూలమలుపు ప్రమాదాలకు నిలయాలుగా మారుతున్నాయి.
ఈ స్పాట్లలో గతంలో జరిగిన ప్రమాదాల్లో పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. అలాగే వెంకటాపూర్ మండలం జవహర్‌నగర్, రామాంజపూర్, ఎల్లారెడ్డిపల్లి గ్రామాల్లోనూ ప్రమాదకర ప్రదేశాలు ఉన్నాయి. జంగాలపల్లి నుంచి జవహర్‌నగర్ వరకు రోడ్డు రిపేర్లు జరుగుతున్నాయి. గోవిందరావుపేట, తాడ్వాయి, ఏటూరునాగారం, మంగపేట మండలాల్లోని పలు ప్రమాదకర మూలమలుపులు ప్రమాదాలకు నిలయాలుగా మారాయి.
వాజేడు మండలం జగన్నాథపురం వై జంక్షన్ మేజర్ యాక్సిడెంట్ స్పాట్‌గా మారింది. వెంకటాపురం వెళ్లే బీటీ రోడ్డు, జాతీయ రహదారికి కలిసే ప్రాంతంలో ఎక్కువ ప్రమాదాలు జరిగాయి. వెంకటాపురం మండలంలో సుమారు 20 కిలోమీటర్ల బీటీ రోడ్డు గుంతలమయంగా మారడంతో వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు.
యాక్సిడెంట్లకు కేరాఫ్‌గా మారిన వరంగల్ రోడ్లు
వరంగల్ నగర పరిధిలోని కరుణాపురం నుంచి దామెర క్రాస్ వరకు నిర్మించిన రింగ్ రోడ్డు యాక్సిడెంట్లకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. సుమారు 19 కిలోమీటర్లు ఉన్న ఈ రోడ్డు పొడవునా నిత్యం ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. ఏడాది కాలంలోనే ఈ రోడ్డుపై 76 యాక్సిడెంట్లు జరిగి 37 మంది చనిపోగా.. 80 మంది గాయపడ్డారు. మరో వైపు ఎన్‌హెచ్ 563పై హసన్‌పర్తి నుంచి ఎల్కతుర్తి శివారు వరకు సుమారు 9 డెడ్‌కర్వ్స్ ఉండగా.. వాటి వద్ద తరచూ ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి.
ఇక గ్రేటర్ పరిధిలోని చింతగట్టు ఎస్సారెస్పీ బ్రిడ్జి ఇరుకుగా మారడంతో యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. వరంగల్ కమిషనరేట్ పరిధిలోని పలు రోడ్లపై తరచూ ప్రమాదాలు జరుగుతున్నా పోలీసులు, ఆర్‌అండ్‌బీ, మున్సిపల్ ఆఫీసర్లు కనీస రక్షణ చర్యలు చేపట్టడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. గ్రేటర్ వరంగల్ పరిధిలోని రాంపూర్ క్రాస్, టేకులగూడెం క్రాస్, దేవన్నపేట క్రాస్, వంగపహాడ్ క్రాస్, నిరూప్‌నగర్ తండా క్రాస్, కాజీపేట జంక్షన్ నుంచి ఫాతిమా జంక్షన్, వడ్డేపల్లి క్రాస్ నుంచి జులైవాడ, నక్కలగుట్ట జంక్షన్, మర్కజీ స్కూల్ సెంటర్ నుంచి అలంకార్ సెంటర్, పెద్దమ్మగడ్డ జంక్షన్, హంటర్ రోడ్డు రాజ్ హోటల్ నుంచి సీఎస్ఆర్ గార్డెన్, భీమారం నుంచి రామారం, హసన్‌పర్తి పెద్ద చెరువు, ఎల్లాపూర్ బ్రిడ్జి, అనంతసాగర్ క్రాస్, ములుగురోడ్డు నుంచి హనుమాన్ జంక్షన్, ఆరెపల్లి , గ్రేటర్ సిటీలో గోపాలస్వామి టెంపుల్, పోచమ్మమైదాన్, ఫోర్ట్ రోడ్డు జంక్షన్, ఆర్టీవో ఆఫీస్ జంక్షన్‌లో ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నట్లు గుర్తించారు.
వరంగల్ కమిషనరేట్ పరిధిలో రోజుకు సగటున నాలుగు యాక్సిడెంట్లు జరుగుతుండగా, రోజుకో మరణం నమోదవుతోంది. జనవరి 28 నుంచి మేడారం మహాజాతర ప్రారంభం కానుండడంతో ప్రమాదాలు జరగకముందే తగిన చర్యలు చేపట్టాలని వాహనదారులు
కోరుతున్నారు.
డ్రైవర్లకు అవగాహన అవసరం
రెండేండ్లకోసారి జరిగే మేడారం మహాజాతరకు లక్షలాది మంది భక్తులు ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ వాహనాల్లో తరలివస్తుంటారు. హనుమకొండ నుంచి వచ్చే వారు ములుగు, గోవిందరావుపేట మండలం పస్రా మీదుగా, భద్రాచలం వైపు నుంచి వచ్చే వారు మంగపేట, ఏటూరునాగారం, తాడ్వాయి మీదుగా, భూపాలపల్లి వైపు నుంచి వచ్చే భక్తులు బయ్యక్కపేట, కాటారం మీదుగా వచ్చే వారు కాల్వపల్లి మీదుగా మేడారం చేరుకుంటారు.
ప్రతీ జాతర టైంలో ప్రమాదాల నివారణకు ఆఫీసర్లు చర్యలు తీసుకుంటున్నప్పటికీ... డ్రైవర్లలో అవగాహన లేమి కారణంగా ఏదో ఒక చోట ప్రమాదం జరుగుతూనే ఉంది. ప్రైవేట్ వాహనాల్లో వచ్చే డ్రైవర్లకు ఈ రూట్ కొత్త కావడంతో ప్రమాదాల బారిన పడుతున్నారని పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రమాదాల నివారణ కోసం డ్రైవర్లకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు మూలమలుపుల వద్ద రక్షణ చర్యలు చేపట్టాలని, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని పలువురు సూచిస్తున్నారు.
