- తరలివచ్చిన రెండు వేల మంది పూర్వ విద్యార్థులు
భైంసా, వెలుగు: నిర్మల్ జిల్లా భైంసాలోని కిసాన్గల్లీలో ఉన్న శ్రీ సరస్వతీ శిశు మందిర్ స్కూల్లో అపూర్వ సమ్మేళనం జరిగింది. ఇప్పటివరకు అక్కడ చదువుకున్న 50 బ్యాచ్‌ల పూర్వ విద్యార్థులు ఆదివారం ఒకే వేదికపై కలిశారు. తమకు విద్యాబుద్ధులు నేర్పిన స్కూల్లో ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసుకొని అంతా ఒకచోట చేరి సందడిగా గడిపారు. శిశు మందిర్ స్కూల్1969లో ఏర్పడగా అప్పటి నుంచి 2020 వరకు దాదాపు 51 బ్యాచ్‌ల విద్యార్థులు ఇక్కడి చదివి వ్యాపార, ఉద్యోగ, ఇతరత్ర పనుల్లో స్థిరపడ్డారు.
ఈ స్కూల్‌కు అనుబందంగా గుజిరిగల్లీ, సుభధ్రవాటికలో శిశు మందిరాలు కొనసాగుతున్నాయి. కాగా ఆదివారం కిసాన్‌గల్లీ స్కూల్లో పాఠశాలలో ఏర్పాటు చేసిన అపూర్వ సమ్మేళనానికి రెండు వేల మందికి పైగా పూర్వ విద్యార్థులు, వారికి విద్యాబుద్ధులు నేర్పిన గురువులు తరలివచ్చారు. నాటి జ్ఞాపకాలను నెమరేసుకున్నారు. నాడు చదువుచెప్పిన గురువులను కలుసుకొని వారి బాగోగులు అడిగి తెలుసుకున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు స్కూల్లో సందడి చేశారు.
