పంజాబ్​లో శివసేన లీడర్ హత్య

పంజాబ్​లో శివసేన లీడర్ హత్య

అమృత్​సర్​: శివసేన లీడర్ దారుణ హత్యకు గురయ్యారు. రోడ్డుపై నిరసన తెలుపుతుండగా దుండగులు ఆయనను కాల్చి చంపారు. ఈ ఘటన శుక్రవారం పంజాబ్​లోని అమృత్​సర్​లో జరిగింది. శివసేన(టక్సాలీ) ప్రెసిడెంట్ సుధీర్ సూరి.. సిటీలోని మజీతా రోడ్డులో ఉన్న గోపాల్ మందిర్​లోని కొన్ని పాత విగ్రహాలను బయట చెత్త కుప్పలో పడేయడంపై ఆలయ కమిటీ మెంబర్లతో గొడవ పడ్డారు. దీనిపై ఫేస్ బుక్ లైవ్ పెట్టారు. అనంతరం తన అనుచరులతో కలిసి ఆలయం వద్ద నిరసనకు దిగారు. ఈ టైమ్ లో కొంతమంది దుండగులు కారులో అక్కడికి వచ్చారు. ఓ వ్యక్తి తన దగ్గరున్న పిస్తోల్​తో సూరిపై కాల్పులు జరిపాడు. మొత్తం ఐదు రౌండ్ల కాల్పులు జరపగా, రెండు బుల్లెట్లు సూరికి తగిలాయి. ఆస్పత్రికి తీసుకెళ్లేలోపే చనిపోయారు. నిందితుడు సందీప్ సింగ్​ను అరెస్టు చేశామని సిటీ పోలీస్ కమిషనర్ అరుణ్ పాల్ సింగ్ చెప్పారు. అతడి దగ్గరి నుంచి పిస్తోల్ స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. మరో ముగ్గురితో కలిసి సందీప్ ఘటనా స్థలానికి వచ్చాడని, అయితే వాళ్లు పారిపోయారని వెల్లడించారు. ప్రజలు శాంతియుతంగాఉండాలని, మతపరమైన నిరసనలకు పిలుపునివ్వొద్దని విజ్ఞప్తి చేశారు.

పోలీస్ సెక్యూరిటీ ఉండగా అటాక్..

విద్వేషపూరిత ప్రసంగాలకు సంబంధించి సుధీర్ సూరిపై ఐదు కేసులు ఉన్నాయి. సిక్కు సంస్థలు, ఖలిస్థాన్ మద్దతుదారులను విమర్శిస్తూ సోషల్ మీడియాలో మెసేజ్​లు పెట్టేవారు. ఈ క్రమంలో పలుమార్లు జైలుకు కూడా వెళ్లారు. సూరి పేరు హిట్ లిస్టులో ఉండడంతో పోలీసులు ఆయనకు సెక్యూరిటీ కల్పించారు. సెక్యూరిటీ ఉన్నప్పటికీ ఆయనపై అటాక్ జరిగింది. ఇంతకుముందు సింగర్ సిద్ధూ మూసేవాలా కూడా ఇలాగే హత్యకు గురయ్యారు. దీంతో ఆమ్ ఆద్మీ సర్కార్​పై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అదుపు తప్పిందని బీజేపీ స్టేట్ చీఫ్ అశ్వనీ శర్మ మండిపడ్డారు. శివసేన లీడర్ హత్యను ఖండిస్తున్నామని కాంగ్రెస్ స్టేట్ చీఫ్ అమరీందర్ సింగ్ అన్నారు.