అవసరమైతే మా కార్యకర్తలు రోడ్లపైకి వస్తారు

అవసరమైతే మా కార్యకర్తలు రోడ్లపైకి వస్తారు

మహారాష్ట్ర రాజకీయాలు పూటకో  మలుపు.. గంటకో ట్విస్టుతో ఆసక్తికరంగా మారాయి. శివసేన తిరుగుబాటు నేత ఏక్ నాథ్ షిండే శిబిరంలో 50 మంది ఎమ్మెల్యేలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే  షిండేను శాసనసభాపక్ష నేతగా కూడా ఎన్నుకున్నారు.

మహావికాస్ అఘాడీ ప్రభుత్వాన్ని రక్షించేందుకు ఎన్సీపీ అధినేత శరద్ పవార్ శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో శరద్ పవార్ ను ఓ కేంద్రమంత్రి బెదిరించారని  శివసేన అధికార ప్రతినిధి సంజయ్ రౌత్ ఆరోపించారు. పవార్ ను నడిరోడ్డుపై అడ్డుకుంటామని..ఆయనను ఇంటికి వెళ్లనివ్వబోమని బెదిరించారన్నారు. శరద్ పవార్ ను   కేంద్రమంత్రి బెదిరించడం సరైంది కాదన్నారు. మంత్రి బెదిరింపులకు మోడీ, అమిత్ షా మద్దతిస్తారా? ఇదే మీ పార్టీ విధానమా? అని సంజయ్ రౌత్ ట్విట్టర్లో ప్రశ్నించారు.

‘12 మంది (ఏక్‌నాథ్ షిండే వర్గానికి చెందిన) ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించే ప్రక్రియ కొనసాగుతోంది, వారి సంఖ్య కేవలం కాగితాలపై మాత్రమే ఉంది. శివసేన ఒక పెద్ద సముద్రం. అలాంటి కెరటాలు వస్తుంటాయి...పోతుంటాయి. మాకు సవాలు విసురుతున్న ఏక్‌నాథ్ షిండే వర్గం శివసేన కార్యకర్తలు ఇంకా రోడ్లపైకి రాలేదని గ్రహించాలి. ఇటువంటి పోరాటాలు చట్టం ద్వారా లేదా రోడ్లపై జరుగుతాయి. అవసరమైతే మా కార్యకర్తలు రోడ్లపైకి వస్తారు’ అని సంజయ్ రౌత్ అన్నారు.