మన్మోహన్ మాట వినండి.. కేంద్రానికి శివసేన సూచన

మన్మోహన్ మాట వినండి.. కేంద్రానికి శివసేన సూచన

మాజీ ప్రధానమంత్రి, ఆర్థిక నిపుణుడు అయిన మన్మోహన్ సింగ్ సింగ్ మాటను వినాలని.. ఆయన సూచనలు పరిగణలోకి తీసుకోవాలని కేంద్రప్రభుత్వాన్ని శివసేన కోరింది. తమ సొంత పత్రిక సామ్నాలో దీనిపై వ్యాసం ప్రచురించింది.

దేశ ఆర్థిక వ్యవస్థ చాలా ఆందోళన చెందాల్సిన పరిస్థితిలో ఉందని.. గత వారం మన్మోహన్ సింగ్ చెప్పడం అంతటా చర్చనీయాంశమైంది. ప్రధాని మోడీ నిర్వహణ సరిగా లేకపోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని విమర్శించారు. జూన్ క్వార్టర్ లో వృద్ధిరేటు 5 శాతమే నమోదు కావడం..  ఏడేళ్లలో దేశంలోనే అత్యంత కనిష్టం అని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఆర్థిక వ్యవస్థకు ఊతం ఇచ్చే చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఐతే.. మన్మోహన్ విమర్శలను కేంద్రం తప్పుపట్టింది.

ఈ పరిణామాల క్రమంలోనే.. బీజేపీ మిత్రపక్షమైన శివసేన… స్పందించింది. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కామెంట్స్ కు మద్దతు పలికింది. జాతీయ సమస్య కాబట్టి.. మన్మోహన్ సింగ్ సూచనలను కేంద్రం పట్టించుకోవాలని.. ఆయన విలువైన సలహాలు తీసుకోవాలని శివసేన సామ్నాలో కోరింది. “దేశ ఆర్థిక వ్యవస్థ పతనం, కశ్మీర్ ఇష్యూ ఈ రెండు వేర్వేరు విషయాలు. దేశ ఆర్థిక వ్యవస్థను బాగుచేసే విషయంలో రాజకీయాలకు అవకాశం ఉండకూడదు. ప్రముఖ ఆర్థిక నిపుణుడు అయిన మన్మోహన్ సింగ్ లాంటి వారి సూచనలు దేశానికి చాలా అవసరం. దేశం కూడా మోడీ ప్రభుత్వాన్ని అదే కోరుతోంది” అని సామ్నాలో శివసేన వ్యాఖ్యానించింది.