నకిలీ హామీలు ప్రకటించమని.. ప్రియాంక గాంధీని కమల్‌నాథ్‌ ఒత్తిడి చేశారు : శివరాజ్ సింగ్

నకిలీ హామీలు ప్రకటించమని..   ప్రియాంక గాంధీని కమల్‌నాథ్‌ ఒత్తిడి చేశారు : శివరాజ్ సింగ్

మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ రిలీజ్ కావడంతో ప్రధాన పార్టీలు  ప్రచారంలో హోరాహోరీగా తలపడుతున్నాయి . ఈక్రమంలో  గురువారం మండల కేంద్రంలో జరిగిన బహిరంగ సభలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ పెద్ద ఎత్తున ప్రకటనలు చేయడమే కాకుండా శివరాజ్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ప్రియాంక కామెంట్లపై  సీఎం శివరాజ్ సింగ్  స్పందించారు.  

ప్రియాంక గాంధీని నకిలీ హామీలు ప్రకటించమని మధ్యప్రదేశ్‌ పీసీసీ అధ్యక్షుడు కమల్‌నాథ్‌ ఒత్తిడి చేశారని ఆరోపించారు.  ఇప్పటివరకూ గాంధీ కుటుంబం అందరినీ మోసం చేసిందని, కానీ  ఇప్పుడు కమల్‌నాథ్‌ గాంధీ కుటుంబాన్ని మోసం చేస్తున్నారని ఆరోపించారు. ప్రియాంక గాంధీని ప్రకటన చేయమని ఆయన కోరుతున్న వీడియో తాను చూశానన్నారు.  

మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే ప్రాథమిక విద్య నుంచి ఇంటర్‌ వరకు ఉచిత విద్య అమలు చేస్తామని ప్రియాంక ప్రకటించిన సందర్భంలో కమల్‌నాథ్‌ ఆమె వద్దకు వెళ్లి ఇందులో కొన్ని మార్పులు చేయమని సూచించారని చౌహాన్‌ అన్నారు. ఆ సందర్భంలో ‘ప్రియాంక మీరే మాట్లాడమని చెప్పింది. కమల్‌నాథ్‌ ఆమెనే మాట్లాడమని పట్టుబట్టారు. అప్పుడు ప్రతి ఏటా 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు చదివే విద్యార్థులకు రూ.500, 8వ తరగతి నుంచి 10వ తరగతి వరకు రూ.1000, 10వ తరగతి నుంచి 12వ తరగతి వరకు రూ. 1500 ఇస్తామని’ ఆమె చెప్పారని సీఎం చౌహాన్‌ వివరించారు.  

గతంలోనూ అధికారంలోకి వచ్చిన 10 రోజుల్లోగా రుణమాఫీ చేయలేకపోతే 11వ రోజున   ముఖ్యమంత్రిని మారుస్తామని అప్పటి కాంగ్రెస్‌ జాతీయాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రకటించారని ఈ సందర్భంగా  చౌహాన్‌ గుర్తు చేశారు. ప్రజలను గందరగోళానికి గురి చేసి ఓట్లు అడగడం కాంగ్రెస్‌ విధానమని దుయ్యబట్టారు. 

ALSO READ : కోతి విశ్వాసం.. యజమాని అంత్యక్రియల కోసం 40 కి.మీ ప్రయాణం