మావోయిస్టులు ఆయుధాలను వీడాలి : డీజీపీ శివధర్ రెడ్డి

మావోయిస్టులు ఆయుధాలను వీడాలి : డీజీపీ శివధర్ రెడ్డి

మావోయిస్టులు స్వచ్ఛందంగా లొంగిపోవాలని నూతన డీజీపీ శివధర్ రెడ్డి అన్నారు. అక్టోబర్ 1న డీజీపీ కార్యాలయంలో పూజలు చేసి డీజీపీగా బాధ్యతలు స్వీకరించారు. ఉన్నతాధికారులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన  ఆయన.. మావోయిస్టులు ఆయుధాలు వీడితే సహకరిస్తామని అన్నారు.

 చైనా లాంటి దేశాల మాదిరి పరిస్థితులు మన దేశంలో లేవని పొలిట్ బ్యూరో సభ్యులు వేణు గోపాల్  లేఖ రాసినట్లు చెప్పారు డీజీపీ శివధర్ రెడ్డి.  మావోయిస్టులు ప్రజల్లోకి వచ్చి అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.  బేసిక్ పోలీస్ తో విధులు సక్రమంగా నిర్వహిస్తున్నామన్నారు.  ప్రజల రక్షణే ధ్యేయంగా పనిచేస్తామని తెలిపారు.  

మావోయిస్టుల విధానం సక్సెస్ కాలేదన్నారు డీజీపీ శివధర్ రెడ్డి.  టెక్నాలజీని మరింత సమర్థవంతంగా వినియోగించుకుంటామని తెలిపారు. సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు, వ్యక్తులను  అవమానించిన వారిపై చర్యలు ఉంటాయన్నారు.

లోకల్ బాడీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడమే తమ లక్ష్యమన్నారు డీజీపీ శివధర్ రెడ్డి.  స్థానిక ఎన్నికల కోసం పోలీసులు సన్నద్ధతతో ఉన్నారని చెప్పారు.  అన్ని వర్గాలనుంచి పోలీసులకు మద్దతు ఉండాలన్నారు.  రాష్ట్ర పోలీస్ శాఖలో 17 వేల ఖాళీలు ఉన్నట్లు గుర్తించామన్న డీజీపీ.. ఖాళీల భర్తీపై సీఎంకు ప్రపోజల్స్ పంపించామన్నారు.