హెల్త్ ఇన్సూరెన్స్ కొంటున్నారా..? అయితే నో క్లెయిమ్ బోనస్ గురించి తప్పక తెలుసుకోండి..

హెల్త్ ఇన్సూరెన్స్ కొంటున్నారా..? అయితే నో క్లెయిమ్ బోనస్ గురించి తప్పక తెలుసుకోండి..

నేటి కాలంలో హెల్త్ ఇన్సూరెన్స్ కంపల్సరీగా మారిపోయింది. హాస్పిటల్స్ చిన్న అనారోగ్యాలకు కూడా వేలకు వేలలు లక్షలు వసూలు చేస్తుండటంతో పెరిగిన ఆరోగ్య ద్రవ్యోల్బణం దేశంలో ప్రజలను అప్రమత్తం చేస్తోంది. రోగం వస్తే మధ్యతరగతి వ్యక్తి కూడా పేదవాడిగా మారిపోతున్న క్రమంలో కనీసం రూ.10 నుంచి రూ.20 లక్షలకు పాలసీ కొనాల్సిన పరిస్థితి తప్పనిసరిగా మారింది. అయితే ఇటీవల జీఎస్టీ పూర్తిగా ఇన్సూరెన్స్ ఉత్పత్తులపై ఎత్తేయటం, తక్కువ ఖర్చుకే ఎక్కువ కవరేజ్ వంటి ప్రోత్సాహకాలతో ప్రజలు కొత్త పాలసీలు ఎక్కువగా కొంటున్నారు. 

అయితే హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు కొనేటప్పుడు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన ఒక అంశం నో క్లెయిమ్ బోనస్. పింపుల్ గా చెప్పుకోవాలంటే.. ఎవరైనా పాలసీదారు ఏడాదిలో ఎలాంటి ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ తీసుకోకుంటే కంపెనీ వారిని రివార్డ్ చేస్తూ తర్వాత సంవత్సరానికి హెల్త్ కవరేజ్ పరిమితిని పెంచుతుంది. అంటే అదనంగా ప్రీమియం చెల్లించి కొనుక్కోకుండానే అదనంగా బేస్ కవరేజ్ పెంచబడుతుందన్నమాట. పైగా తర్వాతి సంవత్సరాల్లో పాలసీ రెన్యూవల్స్ అప్పుడు కట్టాల్సిన ప్రీమియంపై కూడా డిస్కౌంట్స్ ఇస్తుంటాయి కంపెనీలు. 

అసలు నో క్లెయిమ్ బోనస్ ఎలా పనిచేస్తుందో తెలుసుకుందా..?
ఉదాహరణకు పాలసీదారు ఏడాదికి రూ.5 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్ కొనుగోలు చేశాడనుకుందాం. ఆ ఏడాది పాలసీ కాలంలో ఎలాంటి క్లెయిమ్స్ చేయకపోతే.. ఇన్సూరెన్స్ కంపెనీ వారికి 10 శాతం నో క్లెయిమ్ బోనస్ తర్వాతి సంవత్సరం బేస్ సమ్ కి యాడ్ చేసి మెుత్తం కవరేజీని రెన్యూవల్ తర్వాత రూ.5లక్షల 50వేలకు పెంచుతుంది. అలా క్లెయిమ్స్ చేయని ప్రతి సంవత్సరానికి నో క్లెయిమ్ బోనస్ యాడ్ చేస్తూ గరిష్ఠ పరిమితి చేరుకునే వరకు ప్రయోజనం పెంచబడుతుంది. కొన్ని కంపెనీలు ప్రీమియం చెల్లింపుల్లో డిస్కౌంట్స్ కూడా అందిస్తుంటాయి. 

ప్రస్తుతం చాలా ఇన్సూరెన్స్ కంపెనీలు ఫ్యామిలీ ఫ్లోటర్ ప్లాన్స్ లో కూడా నో క్లెయిమ్ బోనస్ ఆఫర్ చేస్తున్నాయి. అయితే ఇక్కడ అందరు కుటుంబ సభ్యులు హెల్తీగా ఎలాంటి క్లెయిమ్ చేయకపోతేనే కంపెనీలు నో క్లెయిమ్ బోనస్ ఆఫర్ చేస్తుంటాయి. పాలసీ పోర్టింగ్ సమయంలో కూడా కొత్త ఇన్సూరెన్స్ కంపెనీకి మీ నో క్లెయిమ్ బోనస్ వివరాలు అందిచటం ద్వారా బెనిఫిట్స్ క్యారీ ఫార్వర్డ్ చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే ఈ నిర్ణయం సదరు కంపెనీ నిబంధనలకు అనుగుణంగా ఉంటాయి కాబట్టి ముందే కనుక్కోవటం మంచిది.