
‘జమ్మిబెట్టి జెప్తున్నా.. ఈ సారి దసరా నిరుడు లెక్క ఉండదు బాంచెత్’.. ఇది నాని నటించిన దసరా సినిమాలోని డైలాగ్. ఈ డైలాగ్ ఈ దసరాకు నిజం కాబోతుంది. నిజంగానే ఈ దసరా గతేడాది లాగా ఉండదు. తెలంగాణ ప్రజలకు దసరా అతిపెద్ద పండుగ. దసరా అంటేనే ఒక కిక్కు.. ఏ పండగకి లేనంత జోష్ ఈ పండుగకు ఉంటుంది.
మరీ ముఖ్యంగా దసరా అంటే చుక్కా, ముక్కా ఉండాల్సిందే. పల్లె, పట్టణం అని తేడా లేకుండా దసరాకు రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతోంది. మద్యంతో పాటు మటన్, చికెన్, బోటీ, తలకాయ, పిష్, ఫ్రాన్స్ ఇలా రకరకాల నాన్ వెజ్ ఐటెమ్స్ నంజుకు తినాల్సిందే. కానీ ఈ దసరా మాత్రం అలా ఉండదు. ఎందుకంటే దసరా పండుగ రోజునే గాంధీ జయంతి కావడం.
ప్రతియేటా అక్టోబర్ 2వ తేదీన గాంధీ జయంతి నిర్వహిస్తారనే విషయం తెలిసిందే. గాంధీ జన్మించిన అక్టోబర్ 2వ తేదీని అహింస, సత్యం, సామాజిక న్యాయానికి నిదర్శనంగా దేశవ్యాప్తంగా గాంధీ జయంతి సెలబ్రేట్ చేస్తారు. ఇందులో భాగంగానే గాంధీ జయంతి రోజు మద్యపానం, జంతు వధపై నిషేధం ఉంటుంది.
మన బాషలో చెప్పాలంటే.. గాంధీ జయంతి రోజు ముక్కా, చుక్కా బంద్. ఈ సారి గాంధీ జయంతి (అక్టోబర్ 2) రోజునే దసరా పండుగ వచ్చింది. కాబట్టి ఈ దసరాకు ముక్కా.. చుక్కా లేనట్లే.. అందుకే చెప్పినా.. ఈ సారి దసరా నిరుడు లెక్క ఉండదని. గాంధీ జయంతి, దసరా ఒకేరోజు రావడంతో మద్యపాన, నాన్ వెజ్ ప్రియులు తీవ్రంగా బాధపడుతున్నారు.
మరికొందరు మాత్రం అడ్వాన్స్‌గా ఉన్నారు. దసరా రోజు మద్యం దుకాణాలు బంద్ ఉండనుండటంతో ముందుగానే స్టాక్ తెచ్చి పెట్టుకుంటున్నారు. అక్టోబర్ 2న దసరా రోజు మద్యం, మాంసం దుకాణాలు మూసివేయాలని ఇప్పటికే అధికారులు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.