
ఆయిల్ నుంచి టెలికాం వరకు అనేక వ్యాపారాల్లోకి విస్తరించిన ముఖేష్ అంబానీ గడచిన కొన్నాళ్లుగా బెవరేజెస్ వ్యాపారాన్ని రిలయన్స్ కొత్త గ్రోత్ ఇంజన్ గా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో 2023లో క్యాంపాను ఫ్యూర్ డ్రింక్స్ గ్రూప్ నుంచి కొన్నాక 14 శాతం మార్కెట్ వాటాను కొల్లగొట్టింది. ఇదే క్రమంలో అంబానీ ఇండిపెండెన్స్ పేరుతో వాటర్ బాటిలింగ్ బ్రాండ్ స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. జియో, క్యాంపా కోలాలో మాదిరిగానే తక్కువ రేట్ల ప్లాన్ తో మార్కెట్ నంబర్ వన్ అయ్యేందుకు ట్రై చేస్తున్నారు ముఖేష్.
2030 నాటికి రిలయన్స్ డబుల్ డిజిట్ గ్రోత్ కోసం ఈ వాటర్ బిజినెస్ ఉపయోగపడుతుందని అంబానీ భావిస్తున్నారు. అందుకే మార్కెట్లో లీటరు వాటర్ బాటిల్ రేటును రూ.15గా పెట్టింది రిలయన్స్ ఇండిపెండెన్స్ బ్రాండ్ కింద. కానీ బిస్లెరీ, ఆక్వాఫినా, కిన్లీ వంటి ఇతర బ్రాండ్స్ రూ.20కి అమ్ముతున్నాయి. అలాగే లీటరున్నర బాటిల్ రేటును జస్ట్ రూ.20గా, రెండు లీటర్ల వాటర్ బాటిల్ రేటు రూ.25గా ఫిక్స్ చేశారు. గడచిన 5 ఏళ్లలో దేశంలో బాటిల్ వాటర్ బిజినెస్ 45 శాతం వరకు పెరిగిన నేపథ్యంలో అంబానీ ఫోకస్ నీళ్ల వ్యాపారంపై పడిందని తెలుస్తోంది.
ALSO READ : జొమాటో హెల్తిఫైతో న్యూట్రిషన్ గుట్టు రట్టు..
భారతీయ బాటిల్ వాటర్ మార్కెట్‌లో బిస్లెరీ అగ్రగామిగా 36% వాటాను హోల్డ్ చేస్తోంది. ఇక కోకా-కోలా కిన్లీ, పెప్సీకి చెందిన ఆక్వాఫినా, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ హిమాలయన్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. బిస్లెరీ దేశవ్యాప్తంగా 122 ప్లాంట్లు, 4,500 డిస్ట్రిబ్యూటర్లు, 5,000 ట్రక్కుల నెట్వర్క్‌తో విస్తారమైన పంపిణీ వ్యవస్థను ఏర్పరుచుకుంది. ఇదే సమయంలో.. ఆక్వాఫినా పంపిణీ వరున్ బెవరేజెస్ చూసుకుంటోంది. వరుణ్ బెవరేజెస్ దగ్గర 130 కంటే ఎక్కువ డిపోలు, 2,600 వాహనాలు, 2,800 ప్రైమరీ డిస్ట్రిబ్యూటర్లతో శక్తివంతమైన సరఫరా వ్యవస్థ ఉంది.
కొత్తగా వాటర్ వ్యాపారంలోకి రిలయన్స్ రంగప్రవేశం వల్ల ప్రభావం వెంటనే కాకుండా మధ్య, దీర్ఘకాలంలో కనిపిస్తుందని ఎలారా క్యాపిటల్ వైస్ ప్రెసిడెంట్ అమిత్ పురోహిత్ చెప్పారు. ఇందుకోసం ముందుగా రిలయన్స్ కి పంపిణీ ఖర్చులు, పలు ప్రాంతాల్లో తయారీ యూనిట్ల అవసరం, అలాగే హోటళ్లు, రెస్టారెంట్లు, కేఫేలు, కేటరింగ్ విభాగంలో స్థానం సంపాదించడం ప్రధాన సవాళ్లుగా ఉంటాయని ఆయన అభిప్రాయపడ్డారు.