Zomato: జొమాటో హెల్తిఫైతో న్యూట్రిషన్ గుట్టు రట్టు.. అడ్డమైన తిండ్లకు బ్రేక్!

Zomato: జొమాటో హెల్తిఫైతో న్యూట్రిషన్ గుట్టు రట్టు.. అడ్డమైన తిండ్లకు బ్రేక్!

Zomato Healthy Mode: ఆహారం అనగానే మనకి గుర్తొచ్చేది ముందుగా దాని రుచి, వాసన, ఫుడ్ డెలివరీ సౌకర్యమే. కానీ ఆహారంలో నిజంగా ఎంత పోషక విలువ ఉందో తెలుసుకోవడం అంత ఈజీ కాదు. ఆ లోటును భర్తీ చేయడానికి ఫుడ్ డెలివరీ దిగ్గజం జొమాటో పెద్ద అడుగు వేసింది. కంపెనీ సీఈవో దీపేందర్ గోయల్ తాజాగా ప్రకటించిన Healthy Mode ఫుడ్ లవర్స్ కి వారి ఆహారం గురించి వివరాలు అందించనుంది.

జొమాటోను ప్రారంభించినప్పటి నుంచి ఒక గిల్ట్ తనను వెంటాడుతోందని సీఈవో గోయల్ వెల్లడించారు. జొమాటో ద్వారా తాము బయట తినడం, ఆన్‌లైన్‌లో ఆర్డర్ ఇవ్వడం చాలా సులభం చేసామని.. కానీ ప్రజలు నిజంగా శరీరానికి ఉపయోగపడే ఆహారంను తినేలా సహాయం చేయలేకపోయాని తన ట్విట్టర్ పోస్టులో చెప్పారు గోయల్. ప్రజలకు మంచి ఆహారం అందించాలనే తమ లక్ష్యాన్ని ప్రస్తుతం Healthy Mode లాంచ్ ద్వారా చేరుకుంటున్నట్లు చెప్పారు. ఈ మోడ్ కింద ఇకపై జొమాటో ప్రతి వంటానికి అందులో ఉండే పోషకాల ప్రకారం హెల్త్ స్కోర్ ఇస్తుంది. ఇది లో నుంచి సూపర్ వరకు రేటింగ్ కలిగి ఉంటుంది. 

ALSO READ : 95-59 Hypercar: గణేశుడి లోగోతో బ్రిటీష్ కారు..

జొమాటో ఆహారాల హెల్త్ స్కోర్ కేవలం అందులోని కేలరీలను మాత్రమే పరిగణలోకి తీసుకుని ఇవ్వటం కాకుండా..  ప్రోటీన్, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్, ఫైబర్, మైక్రోన్యూట్రియెంట్స్ వంటి ఇతర కాంపొనెంట్లను కూడా పరిగణలోకి తీసుకుంటుందని సీఈవో చెప్పారు. ఇందుకోసం కంపెనీ ఏఐ సాంకేతికతను వినిగించటం గమనార్హం. పైగా ఈ కొత్త ఫీచర్ యూజర్లకు అర్థమయ్యేలా ఒక వంటకం ఎందుకు ఆరోగ్యకరమో, దానిలో ఏవేవి మంచిదో స్పష్టమైన వివరణను అందించనుంది. 

కొత్త ఫీచర్ కేవలం సాధారణ యూజర్లకు మాత్రమే కాదని ప్రొఫెషనల్ అథ్లెట్లు కూడా ఆధారపడగల స్థాయి ప్రమాణాలతో డిజైన్ చేసినట్లు గోయల్ చెప్పారు. “జొమాటో వల్ల ప్రజలు తమకిష్టమైన వంటకం తేలికగా తిన్నారు. కానీ బాడీకి కావలసిన అవసరమైన పోషక ఆహారం అందించడంలో మేము వెనకబడిపోయాం అనే గిల్ట్ నాకు ఉండేది. Healthy Mode ఆ లోటును తగ్గించే మొదటి నిజమైన ప్రయత్నం” అని గోయల్ పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం తొలుత ఈ ఫీచర్ గురుగ్రామ్ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉండనుంది. దశలవారీగా మిగిలిన నగరాల్లో కూడా దీనిని అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు జొమాటో చెప్పింది.