Asia Cup 2025 Final: ట్రోఫీ నిరాకరించడం మా నిర్ణయమే.. ACC టైటిల్ తీసుకొని పారిపోయింది: సూర్య కుమార్ యాదవ్

Asia Cup 2025 Final: ట్రోఫీ నిరాకరించడం మా నిర్ణయమే.. ACC టైటిల్ తీసుకొని పారిపోయింది: సూర్య కుమార్ యాదవ్

ఆసియా కప్ లో ఇండియా, పాకిస్థాన్ జట్ల మధ్య జరిగిన ఫైనల్ ముగిసిన తర్వాత గ్రౌండ్ లో చాలాసేపు హై డ్రామా నడించింది. ఆదివారం (సెప్టెంబర్ 28) దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ ను 5 వికెట్ల తేడాతో ఓడించింది. మ్యాచ్ తర్వాత ఆదివారం అర్ధరాత్రి సుమారు 90 నిమిషాల పాటు గ్రౌండ్‌‌‌‌లో హైడ్రామా నడిచింది. ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ)  ప్రెసిడెంట్, పాక్ మంత్రి అయిన మోహ్‌సిన్ నఖ్వీ చేతుల మీదుగా ఆసియా కప్ ట్రోఫీని తీసుకునేందుకు ఇండియా నిరాకరించింది. 

మరొకరి చేతుల మీదుగా ట్రోఫీని ఇప్పించడానికి అంగీకరించని నఖ్వీ  దానిని తనతో పాటే తీసుకుని వెళ్లడంతో పెను దుమారం రేగింది. ఇండియా నిరాకరణతో గంటకు పైగా క్లోజింగ్ సెర్మనీ నిలిచిపోయింది. నఖ్వీ కాకుండా స్టేజ్‌‌‌‌పై ఉన్న మరెవరి చేతుల మీదుగానైనా ట్రోఫీ తీసుకుంటామని ఇండియా సూచించినా అతను పక్కకు తప్పుకోలేదు. ఆసియా కప్ ట్రోఫీని అందుకోవడానికి భారత జట్టును గంటసేపు వేచి ఉండమని బలవంతం చేశారని భారత క్రికెట్ టీ 20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ వెల్లడించారు. స్వదేశానికి చేరుకున్న సూర్య ఆసియా కప్ ఫైనల్ తర్వాత ఏం జరిగిందో ముంబై చేరుకున్న తర్వాత వివరించాడు. 

సూర్య మాట్లాడుతూ.. "ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత నాకు చాలా సంతోషంగా ఉంది. ప్రజలని సంతోష పరిచే క్రికెట్ ఆడాము. ఇండియన్ ఫ్యాన్స్ ముఖాల్లో చిరు నవ్వుతో సంతోషంగా ఉన్నాం. ట్రోఫీ కోసం మేము గంటకు పైగా అక్కడ ఓపికతో ఎదురు చూశాం.  మేము డ్రెస్సింగ్ రూమ్ లోపలికి కూడా వెళ్ళలేదు. మా దగ్గర ట్రోఫీ లేకపోయినా పర్వాలేదు. మా ఆటగాళ్లు, సహాయక సిబ్బంది మా ట్రోఫీలు. భారత జట్టు ప్రజెంటేషన్ వేడుక కోసం ఎవరినీ వేచి ఉండమని కోరలేదు. ACC అధికారులు ట్రోఫీతో పారిపోయారు". అని సూర్య తెలిపాడు.   

నఖ్వీ నుండి ట్రోఫీని స్వీకరించవద్దని బీసీసీఐ లేదా కేంద్ర ప్రభుత్వం చెప్పలేదని సూర్య క్లారిటీ ఇచ్చాడు. " ముందుగా నేను ఒక విషయం స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాను. టోర్నమెంట్ అంతటా మేము మైదానంలో తీసుకున్న నిర్ణయాలు ప్రభుత్వం లేదా బీసీసీఐ మాకు చెప్పలేదు. ట్రోఫీ ఇస్తే తీసుకోకూదడదని మా అంతటా మేమే నిర్ణయించుకున్నాం. బీసీసీఐ లేదా ప్రభుత్వం ట్రోఫీ తీసుకోవద్దు అని మాకు చెప్పలేదు". అని సూర్య తెలిపాడు. టీమిండియా ట్రోఫీ అందుకోకుండా నఖ్వీ తనతో తీసుకెళ్లడంపై బీసీసీఐ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నఖ్వీ తీరుపై ఐసీసీతోనే తేల్చుకుంటామని బోర్డు సెక్రటరీ దేవజిత్ సైకియా పేర్కొన్నారు.