
ఇస్లామాబాద్: పాకిస్తాన్లో భారీ బాంబు పేలుడు సంభవించింది. క్వెట్టా నగరం జర్ఘూన్ రోడ్డులోని ఫ్రాంటియర్ కార్ప్స్ ఆర్మీ బెటాలియన్ ముందు ఒక్కసారిగా బాంబ్ బ్లాస్ట్ జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందగా.. 20 మంది తీవ్రంగా గాయపడ్డట్లు అధికారులు వెల్లడించారు. బాంబు పేలుడు ధాటికి సమీపంలోని ఇళ్లు, వాహనాలు పూర్తిగా ధ్వంసం అయ్యాయి.
స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ బృందాలు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం దగ్గర్లోని ఆసుపత్రులకు తరలించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.
పేలుడు జరిగిన ప్రాంతాన్ని భద్రతా దళాలు పూర్తిగా అదుపులోకి తీసుకున్నాయి. ఆ ప్రాంతంలో ఎమర్జెన్సీ ప్రకటించాయి. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు మొదలుపెట్టారు. పేలుడుకు గల కారణాన్ని తెలుసుకోవడానికి ఆరా తీస్తున్నారు. మరోవైపు.. ఈ బాంబ్ బ్లాస్ట్ ఆత్మాహుతి దాడి అని పాక్ మీడియాలో కథనాలు వస్తున్నాయి.
బలూచిస్తాన్ ప్రావిన్స్ ఆరోగ్య మంత్రి బఖ్త్ ముహమ్మద్ కాకర్ నగరవ్యాప్తంగా అన్ని ఆసుపత్రుల్లో అత్యవసర వైద్య పరిస్థితిని ప్రకటించారు. కన్సల్టెంట్లు, వైద్యులు, ఫార్మసిస్ట్‌లు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది వెంటనే విధులకు హాజరు కావాలని ఆదేశించారు.