Deepika Padukone: సవాళ్లకు సిద్ధమే.. నేనేంటో నిరూపిస్తా.. సందీప్ రెడ్డి వంగాకు దీపికా కౌంటర్!

Deepika Padukone: సవాళ్లకు సిద్ధమే.. నేనేంటో నిరూపిస్తా.. సందీప్ రెడ్డి వంగాకు దీపికా కౌంటర్!

ఇండియన్ సినీ ఇండస్ట్రీలో నటి దీపికా పదుకొణె ఇటీవల హాట్ టాపిక్‌గా నిలిచారు. పారితోషికం, పని వేళల విషయంలో ఆమె తీసుకున్న నిర్ణయాలు టాలీవుడ్ నుంచి  బాలీవుడ్‌ వరకు సరికొత్త చర్చకు దారితీశాయి. ముఖ్యంగా, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న 'స్పిరిట్'  చిత్రం నుండి ఆమె తప్పుకోవడానికి ప్రధాన కారణం, రోజుకు కేవలం 8 గంటలు మాత్రమే పని చేస్తానని డిమాండ్ చేయడమేనని వార్తలు వచ్చాయి.

ఆ తర్వాత, 'కల్కి 2898 AD' సీక్వెల్ నుండి కూడా దీపికా వైదొలగడం ఈ చర్చను మరింత పెంచింది. ఈ విషయాన్ని ధృవీకరిస్తూ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. "మొదటి భాగం ప్రయాణం సుదీర్ఘంగా ఉన్నప్పటికీ, ఆమె నుంచి మాకు అవసరమైన భాగస్వామ్యం లభించలేకపోయింది. 'కల్కి 2898 AD' సీక్వెల్ వంటి సినిమాకు అత్యున్నత స్థాయి నిబద్ధత అవసరం. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం అని ఆ ప్రకటనలో పరోక్షంగా పేర్కొన్నారు.

దీపికా డిమాండ్లు ఇవేనా?

'కల్కి 2' నుంచి దీపికా వైదొలగడంపై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆమె మొదటి భాగానికి తీసుకున్న ఫీజు కంటే 25 శాతం ఎక్కువ పారితోషికం అడిగినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా, రోజుకు కేవలం 7 గంటల పాటు మాత్రమే షూటింగ్‌లో పాల్గొనాలని పట్టుబట్టారని టాక్. భారీ VFX పనులు అవసరమయ్యే 'కల్కి' వంటి ప్రాజెక్ట్‌కు ఇంత తక్కువ పని గంటలు కేటాయించడం, బడ్జెట్‌పై తీవ్ర ప్రభావం చూపుతుందని నిర్మాతలు భావించినట్లు సమాచారం. ఈ డిమాండ్లే ఆమె నిష్క్రమణకు దారి తీశాయని అంటున్నారు.

మరోవైపు, సందీప్ రెడ్డి వంగా కూడా దీపికాను ఉద్దేశిస్తూ పరోక్షంగా ట్విట్టర్‌లో ఒక ఘాటైన పోస్ట్ పెట్టారు. "నేను ఒక నటుడికి కథ చెప్పినప్పుడు, వారిపై 100% నమ్మకం ఉంచుతాను. మా మధ్య గోప్యతా ఒప్పందం ఉంటుంది. కానీ ఇలా చేయడం ద్వారా, మీరు మీ అసలు వ్యక్తిత్వాన్ని బయటపెట్టారు... ఒక చిన్న నటుడిని కించపరచడం, నా కథను బయటపెట్టడం.. మీ ఫెమినిజం దేని కోసం?" అంటూ తీవ్రంగా విమర్శించారు.

దీపికకు పెరుగుతున్న ప్రేక్షకాదరణ.

ఈ వివాదాల మధ్య, దీపికా పదుకొణె తన కెరీర్ గురించి ఆసక్తికరమైన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. లేటెస్ట్ గా IMDb విడుదల చేసిన '25 ఇయర్స్ ఆఫ్ ఇండియన్ సినిమా (2000-2025)' నివేదికలో 'అత్యంత ప్రేక్షకాదరణ పొందిన నటీనటులు' జాబితాలో ఆమె 4వ స్థానం దక్కించుకుంది. గత 25 ఏళ్లలో అత్యంత ప్రజాదరణ పొందిన 130 చిత్రాలను విశ్లేషించగా, అందులో 10 సినిమాలు దీపికావే కావడం  విశేషం. ఈ జాబితాలో షారుఖ్ ఖాన్ అగ్రస్థానంలో ఉండగా, ఆమిర్ ఖాన్, హృతిక్ రోషన్ తర్వాత దీపికా నిలిచారు. ఆమె అమితాబ్ బచ్చన్, రణబీర్ కపూర్, సల్మాన్ ఖాన్, ఐశ్వర్య రాయ్, అనుష్క శర్మ వంటి అగ్ర తారల కంటే ముందు ఉండటం విశేషం.

సవాళ్లకు బయపడేది లేదు..

ఈ జాబితాలో చోటు దక్కించుకోవడంపై దీపిక స్పందిస్తూ.. విజయవంతం కావడానికి మహిళలు తమ వృత్తిని ఎలా నడుపుకోవాలో తరచుగా చెప్పేవారని, అయితే తాను దానిని సవాలు చేయడానికి నిశ్చయించుకున్నానని నొక్కి చెప్పారు. నేను నా సినీ ప్రయాణాన్ని ప్రారంభించినప్పుడు, ఒక మహిళ విజయవంతం కావాలంటే తన కెరీర్‌ను ఎలా నడిపించాలి అనే విషయాలు నాకు తరచుగా చెప్పేవారు అయితే, మొదటి నుంచీ, నేను ప్రశ్నలు అడగడానికి, నిబంధనలను సవాలు చేయడానికి, ఇబ్బందికరమైన మార్గంలో నడవడానికి,  యథాతథ స్థితిని సవాలు చేయడానికి ఎప్పుడూ భయపడలేదు అని దీపికా అన్నారు.

నా కుటుంబం, అభిమానులు,  సహచరులు నాపై ఉంచిన నమ్మకం, నేను తీసుకున్న ఎంపికలు, నిర్ణయాలు చేయడానికి నాకు శక్తినిచ్చిందని దీపిక అన్నారు. ఇది నా తర్వాత వచ్చే వారికి దారిని మారుస్తుందని ఆశిస్తున్నాను. IMDb యొక్క 25 ఏళ్ల భారతీయ సినిమా నివేదిక, నిజాయితీ, ప్రామాణికత, పట్టుదలకు,  నమ్మకాలకు అనుగుణంగా స్థిరంగా ఉండటం ద్వారా మార్పు సాధ్యమని నా నమ్మకాన్ని మరింత ధృవీకరిస్తుంది, బలపరుస్తుందని చెప్పుకోచ్చారు. త్వరలో షారుఖ్ ఖాన్ సరసన 'కింగ్' చిత్రంలో నటించబోతున్నట్లు ప్రకటించారు.