
ఒట్టోవా: లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్.. ఈ పేరు వినగానే చాలామందికి బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ గుర్తుకు వస్తారు. ఈ గ్యాంగ్‌కు సల్లూ భాయ్‌కు ఏం సంబంధం అనుకుంటున్నారు.. అవును ఈ గ్యాంగ్‌కు సల్మాన్ ఖాన్‌కు సంబంధం ఉంది. తాము పవిత్రంగా ఆరాధించే కృష్ణా జింకలను సల్మాన్ ఖాన్ వేటాడని.. అతడిని ఎప్పటికైనా చంపేస్తామని బహిరంగంగా ప్రకటించడంతో లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ పేరు తెరపైకి వచ్చింది.
పలుమార్లు సల్లూ భాయ్‌ను మర్డర్ చేయడానికి ప్లాన్ కూడా చేసింది బిష్ణోయ్ గ్యాంగ్. ఇలా.. ఇండియాలో పురుడు పోసుకున్న బిష్ణోయ్ గ్యాంగ్ నేర కార్యకలాపాలు ఇండియన్స్ ఎక్కువగా ఉండే దేశాల్లో ఒకటైన కెనడాకు విస్తరించాయి. బిష్ణోయ్ గ్యాంగ్ కెనడాలో విచ్చలవిడిగా మర్డర్స్, కాల్పులు, స్మగ్లింగ్, దోపిడి వంటి నేరపూరిత కార్యకలాపాలకు పాల్పడుతోంది. బిష్ణోయ్ గ్యాంగ్ ఆగడాలు రోజురోజుకు మితిమీరి పోతుండటంతో ఈ గ్యాంగ్‌ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించాలని కోరుతూ మార్క్ కార్నీ ప్రభుత్వానికి కన్జర్వేటివ్ పార్టీ ఇటీవల లేఖ రాసింది. ఈ క్రమంలో బిష్ణోయ్ గ్యాంగ్‌కు కెనడా బిగ్ షాక్ ఇచ్చింది.
లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌ను కెనడా ప్రభుత్వం అధికారికంగా ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది. ఈ విషయాన్ని కెనడా ప్రజా భద్రతా మంత్రి గ్యారీ ఆనందసంగరీ సోమవారం (సెప్టెంబర్ 29) ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తమ దేశంలో నేరపూరిత కార్యకలాపాలకు పాల్పడుతోన్న బిష్ణోయ్ గ్యాంగ్‌ను ఉగ్రవాద సంస్థగా గుర్తించామని తెలిపారు. కెనడాలో హింసా, ఉగ్రవాదానికి చోటు లేదని తేల్చి చెప్పారు.
కెనడాలోని ప్రతి వ్యక్తికి సమాజంలో సురక్షితంగా జీవించే హక్కు ఉందని.. పౌరుల భద్రతను కాపాడటం మా బాధ్యతని స్పష్టం చేశారు. బిష్ణోయ్ గ్యాంగ్‌ను ప్రభుత్వం అధికారికంగా ఉగ్రవాద సంస్థగా ప్రకటించడంతో కెనడాలో బిష్ణోయ్ గ్యాంగ్‌కు సంబంధించిన డబ్బు, వాహనాలు, ఆస్తితో సహా ఏవైనా ఆస్తులను సీజ్ చేయడం లేదా స్వాధీనం చేసుకోవడానికి ప్రభుత్వానికి అనుమతి లభిస్తుందని ఆయన తెలిపారు.