
- ముగ్గురు స్టూడెంట్లు మృతి..శిథిలాల కింద 65 మంది
- మూడో అంతస్తు నిర్మిస్తుండగా ఒక్కసారిగా ప్రమాదం
- కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్
జకార్తా: ఇండోనేసియాలోని ఈస్ట్ జావా ప్రావిన్స్‌లో మంగళవారం ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. సిడోఆర్జోలోని అల్ ఖోజిని ఇస్లామిక్ బోర్డింగ్ స్కూల్ భవనం ఒక్కసారిగా కుప్పకూలింది.
ఈ ప్రమాదంలో13 ఏండ్ల బాలుడు సహా ముగ్గురు స్టూడెంట్లు మరణించగా, 65 మంది శిథిలాల కింద చిక్కుకున్నారు. మరో 99 మంది విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, ఆర్మీ, ఇతర సహాయక బృందాలు అక్కడికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్ చేపట్టాయి. గాయపడిన వారిని ఆస్పత్రులకు తరలించి ట్రీట్మెంట్ అందిస్తున్నారు.
శిథిలాల కింద చిక్కుకున్నవారికి ఆక్సిజన్, నీరు అందిస్తూ.. వారు ప్రాణాలతో ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. గాయపడ్డ వారిలో కొందరు క్రిటికల్ కండిషన్‌లో ఉన్నారని చెప్పారు. బాధితులంతా 12- నుంచి17 ఏండ్ల బాలురేనని వివరించారు. మృతుల సంఖ్య పెరగొచ్చని అధికారులు పేర్కొన్నారు.
బిల్డింగ్ ఎందుకు కూలిందంటే..
అల్ ఖోజిని ఇస్లామిక్ బోర్డింగ్ స్కూల్ బిల్డింగ్ ఇప్పటికే రెండు అంతస్తులు ఉన్నప్పటికీ, అనుమతి లేకుండా మరో రెండు అంతస్తులు నిర్మిస్తున్నారు. మూడు, నాలుగు అంతస్తుల నిర్మాణానికి పాత బిల్డింగుపై భారీగా కాంక్రీటు వేశారు.
ఇలా కాంక్రీటు, ఇతర సామగ్రి బరువుకు పాత బిల్డింగ్ ఫౌండేషన్ పిల్లర్లు బలహీనపడి భవనం కూలిపోయి ఉంటుందని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.