
టీమిండియాపై లార్డ్స్ టెస్టులో విజయం సాధించిన ఇంగ్లాండ్ కు బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు ఆఫ్ స్పిన్నర్ షోయబ్ బషీర్ గాయంతో టెస్ట్ సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. టీమిండియాతో జరిగిన మూడో టెస్టులో భాగంగా మూడో రోజు బషీర్ ఎడమ చేతి చిటికెన వేలికి గాయం అయింది. స్కాన్ చేస్తే పగుళ్లు ఉండడంతో సర్జరీ అవసరమని డాక్టర్లు సూచించారు. దీంతో నాలుగు, ఐదు టెస్టులకు ఈ ఇంగ్లాండ్ ప్రధాన స్పిన్న దూరమయ్యాడు. ఇండియా, ఇంగ్లాండ్ మధ్య నాలుగో టెస్ట్ మాంచెస్టర్ లో జూలై 23 నుంచి జరుగుతుంది.
టీమిండియా తొలి ఇన్నింగ్స్ 78వ ఓవర్‌లో బషీర్ వేసిన బంతిని జడేజా బలంగా బాదాడు. బంతిని ఆపే క్రమంలో బషీర్ చేతికి బలంగా తగిలింది. దీంతో బౌలింగ్ చేయలేక ఓవర్ మధ్యలోనే బషీర్ గ్రౌండ్ వదిలి వెళ్ళిపోయాడు. మిగిలిన ఓవర్ రూట్ పూర్తి చేశాడు. విరిగిన వేలు తోనే బషీర్ నాలుగో రోజు బ్యాటింగ్ కు వచ్చాడు. ఐదో రోజు కూడా జట్టు కోసం గాయంతోనే బౌలింగ్ చేశాడు. ఐదో రోజు తీవ్ర ఉత్కంఠ సమయంలో సిరాజ్ వికెట్ తీసి బషీర్ ఇంగ్లాండ్ కు చివరి వికెట్ అందించాడు. దీంతో ఇంగ్లాండ్ థ్రిల్లింగ్ విక్టరీ కొట్టింది.
బషీర్ ఈ సిరీస్ లో తొలి మూడు టెస్ట్ మ్యాచ్ లు ఆడాడు. 6 ఇన్నింగ్స్ ల్లో 140.4 ఓవర్లు (844 బంతులు) బౌలింగ్ చేశాడు. ఈ సిరీస్ లో ఇప్పటివరకు అత్యధిక ఓవర్లు వేసిన బౌలర్ గా ఈ ఇంగ్లాండ్ స్పిన్నర్ నిలిచాడు. 54 యావరేజ్ తో 541 పరుగులిచ్చి 10 వికెట్లు పడగొట్టాడు. స్పిన్ విభాగంలో బషీర్ స్థానంలో ఇంకా ఎవరినీ ప్రకటించలేదు. ఇదిలా ఉంటే ఈ మ్యాచ్ లో బషీర్ పై స్టోక్స్ ప్రశంసల వర్షం కురిపించాడు. గాయంలోనూ జట్టుకు అండగా నిలబడ్డాడని అతని వ్యక్తిత్వాన్ని కొనియాడాడు.