సౌదీ ప్రమాదంలో బయటపడి ఇంటికి తిరిగొచ్చిన ఒకేఒక్కడు

సౌదీ ప్రమాదంలో బయటపడి ఇంటికి తిరిగొచ్చిన ఒకేఒక్కడు
  •     అదో పీడకల అని కన్నీళ్లు పెట్టుకున్న షోయబ్
  •     కండ్ల ముందే 45 మంది సజీవ దహనమయ్యారు
  •     ఆ హాహాకారాలు ఇంకా చెవుల్లో వినిపిస్తున్నాయని ఆవేదన

మెహిదీపట్నం, వెలుగు: సౌదీ బస్సు ప్రమాదంలో బయపడ్డ హైదరాబాద్ కు చెందిన షోయబ్​మంగళవారం మధ్యాహ్నం నగరానికి చేరుకున్నాడు. సౌదీ అరేబియాలో నవంబర్ 17న మదీనా నుంచి ఉమ్రాకు వెళ్తున్న బస్సును ఆయిల్ ట్యాంకర్ ఢీకొనగా, 45మంది సజీవ దహనం అయ్యారు. ఈ ఘటనలో కార్వాన్​లోని నటరాజ్ నగర్ ప్రాంతానికి చెందిన మహ్మద్ అబ్దుల్ షోయబ్ ఒక్కడే గాయాలతో బతికి బయటపడ్డాడు. అక్కడి దవాఖానలో చికిత్స పొందిన అతడు మంగళవారం మధ్యాహ్నం ఇంటికి చేరుకున్నాడు. 

తల్లి, తండ్రితో వెళ్లి.. ఒక్కడుగా వచ్చి

అబ్దుల్ షోయబ్ తన తల్లిదండ్రులతో కలిసి ఉమ్రా యాత్రకు వెళ్లారు. ఈ ప్రమాదంలో తండ్రి, తల్లి చనిపోగా, షోయబ్​ఒక్కడే ప్రాణాలతో మిగిలాడు. ఆ సంఘటన గురించి షోయబ్​మాట్లాడుతూ.. ‘గత నెల 17న బస్సులో 45 మంది ఉమ్రాకు వెళ్తున్నాం. మధ్యలో ఆగి ఉన్న బస్సును వెనుక నుంచి వేగంగా దూసుకు వచ్చి ఆయిల్ టాంకర్ ఢీకొట్టింది.

 ఈ ఘటనలో నా కళ్ల ముందే అందరూ సజీవదహనమయ్యారు. ఎవరికీ బయటకు వచ్చే అవకాశం కూడా లేకుండా పోయింది. నేను ఒక్కడినే అద్దం బద్దలు కొట్టుకుని బయటకు దూకి ప్రాణాలను కాపాడుకున్నా. అందరూ ఐదు నిమిషాల్లోనూ ప్రాణాలు కోల్పోయారు. వారి హాహాకారాలు ఇంకా నా చెవుల్లో మార్మోగుతూనే ఉన్నాయి. అదో పీడకల.. ఇంకా వెంటాడుతూనే ఉంది’ అని కన్నీళ్లు పెట్టుకున్నాడు. 

‘తల్లి, తండ్రితో వెళ్లి ఒక్కడినే తిరిగిరావడం నా మనసుకు వేదనను కలిగిస్తోంది. నాకు అక్కడ చికిత్స అందించడానికి, తర్వాత ఇక్కడకు రావడానికి సహకరించిన సీఎం రేవంత్​రెడ్డి, మంత్రి అజారుద్దీన్, ఎంపీ అసదుద్దీన్, ఎమ్మెల్యే మాజీద్ హుస్సేన్ లకు ధన్యవాదాలు’ అని చెప్పాడు.