- సన్‌రైజర్స్‌కు షాక్ 82 రన్స్ తేడాతో గుజరాత్ చేతిలో ఓటమి..
- టైటాన్స్‌కు వరుసగా ఐదో విజయం
- రాణించిన సుదర్శన్, సుందర్, రబాడ, హోల్డర్
- ఎస్‌ఆర్‌హెచ్ బ్యాటర్లు అట్టర్ ఫ్లాఫ్
అహ్మదాబాద్: ఐపీఎల్–19లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఊహించని షాక్. బౌలర్లు మెరిసినా.. బ్యాటర్ల వైఫల్యంతో కీలక మ్యాచ్‌లో చేతులెత్తేసింది. కగిసో రబాడ (3/28), జేసన్ హోల్డర్ (3/20) బౌలింగ్ ధాటిని తట్టుకోలేక సన్ బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టడంతో.. మంగళవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్ 82 రన్స్ తేడాతో గుజరాత్ టైటాన్స్ చేతిలో ఓడింది.
టాస్ ఓడిన గుజరాత్ 20 ఓవర్లలో 168/5 స్కోరు చేసింది. సాయి సుదర్శన్ (44 బాల్స్‌లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 61), వాషింగ్టన్ సుందర్ (33 బాల్స్‌లో 7 ఫోర్లు, 1 సిక్స్‌తో 50) రాణించారు. తర్వాత హైదరాబాద్ 14.5 ఓవర్లలో 86 రన్స్‌కే ఆలౌటైంది. ఎస్‌ఆర్‌హెచ్ చరిత్రలో ఇదే అత్యల్ప స్కోరు. కమిన్స్ (19) టాప్ స్కోరర్. ఇక మెగా లీగ్‌లో వరుసగా ఐదు విజయాలు నమోదు చేయడం జీటీకి ఇది రెండోసారి. రబాడాకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.
బౌలర్లు అదుర్స్..
గుజరాత్‌ను కట్టడి చేయడంలో హైదరాబాద్ బౌలర్లు సక్సెస్ అయ్యారు. తొలి ఓవర్‌లో ఐదు రన్స్ రాగా, రెండో ఓవర్‌లో గిల్ (5), సుదర్శన్ చెరో ఫోర్‌తో టచ్‌లోకి వచ్చారు. కానీ ప్రఫుల్ హింగే (2/17) తన వరుస ఓవర్లలో గిల్, బట్లర్ (7)ను ఔట్ చేసి షాకిచ్చాడు. ఆరో ఓవర్‌లో నిశాంత్ సింధు (22) రెండు ఫోర్లు కొట్టడంతో పవర్‌ప్లేలో గుజరాత్ 34/2 స్కోరు చేసింది. ఏడో ఓవర్‌లోనూ నిశాంత్ 4, 6తో బ్యాట్ ఝుళిపించాడు. అవతలి వైపు సుదర్శన్ కూడా రెండు బౌండ్రీలు రాబట్టడంతో స్కోరు బోర్డు నెమ్మదిగా కదిలింది.
అయితే 9వ ఓవర్‌లో కమిన్స్ (1/20).. నిశాంత్‌ను ఔట్ చేసి మూడో వికెట్‌కు 38 రన్స్ పార్ట్‌నర్‌షిప్‌ను బ్రేక్ చేశాడు. 68/3 స్కోరుతో తొలి పది ఓవర్లు ముగించిన జీటీని ఆదుకునే బాధ్యతను సుదర్శన్, సుందర్ తీసుకున్నారు. ఈషాన్ మలింగ బౌలింగ్‌లో సిక్స్‌తో జోరు పెంచిన సుదర్శన్.. షకీబ్ హుస్సేన్ (1/30)ను కూడా టార్గెట్ చేశాడు. ఈ క్రమంలో 38 బాల్స్‌లో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. అప్పటి వరకు సింగిల్స్‌తో స్ట్రయిక్ రొటేట్ చేసిన సుందర్ రెండు ఫోర్లతో దూకుడు చూపెట్టాడు.
దాంతో 15 ఓవర్లలో స్కోరు 114/3కి పెరిగింది. ఇక ఫర్వాలేదనుకుంటున్న టైమ్‌లో షకీబ్.. సుదర్శన్‌ను ఔట్ చేసి స్కోరుకు కళ్లెం వేశాడు. నాలుగో వికెట్‌కు 60 రన్స్ భాగస్వామ్యం ముగిసింది. చివర్లో సుందర్‌తో జత కట్టిన హోల్డర్ (11 నాటౌట్) వేగంగా ఆడారు. 19వ ఓవర్ తొలి బాల్‌కు హోల్డర్ ఇచ్చిన క్యాచ్‌ను మలింగ వదిలేయగా.. సుందర్ 4, 4, 6తో 18 రన్స్ రాబట్టాడు. 32 బాల్స్‌లో ఫిఫ్టీ కొట్టిన సుందర్‌ను చివరి ఓవర్‌లో షకీబ్ ఔట్ చేయడంతో ఐదో వికెట్‌కు 40 రన్స్ జతయ్యాయి. చివరి బాల్‌కు రాహుల్ తెవాటియా (4 నాటౌట్) ఫోర్ కొట్టడంతో జీటీ గౌరవప్రదమైన స్కోరు చేసింది.
పెవిలియన్‌కు క్యూ..
ఛేజింగ్‌లో హైదరాబాద్ బ్యాటర్లను జీటీ బౌలర్లు ముప్పు తిప్పులు పెట్టారు. ఇన్నింగ్స్ నాలుగో బాల్‌కే ట్రావిస్ హెడ్ (0)ను డకౌట్ చేసి సిరాజ్ (1/11) ఇచ్చిన శుభారంభాన్ని రబాడ అద్భుతంగా ముందుకు తీసుకెళ్లాడు. తన వరుస మూడు ఓవర్లలో అభిషేక్ శర్మ (6), ఇషాన్ కిషన్ (11), రవిచంద్రన్ స్మారన్ (9)ను ఔట్ చేసి ఊహించని షాకిచ్చాడు. 32/4తో పీకల్లోతు కష్టాల్లో పడిన హైదరాబాద్ 34/4తో పవర్‌ప్లేను ముగించింది. ఈ దశలో క్లాసెన్ (14), సలీల్ అరోరా (16) ఇన్నింగ్స్‌ను నిలబెట్టే ప్రయత్నం చేసినా సక్సెస్ కాలేదు.
రెండు వైపుల నుంచి హోల్డర్, ప్రసిధ్ కృష్ణ (2/23) లైన్ అండ్ లెంగ్త్‌తో రన్స్‌ను కట్టడి చేశారు. దీంతో 10వ ఓవర్‌లో సలీల్ వికెట్ ఇచ్చుకోగా.. 11వ ఓవర్‌లో హోల్డర్ డబుల్ స్ట్రోక్ ఇచ్చాడు. నాలుగు బాల్స్ తేడాలో క్లాసెన్, నితీశ్ కుమార్ (2)ను పెవిలియన్‌కు పంపాడు. ఫలితంగా 60/7తో హైదరాబాద్ ఎదురీత మొదలుపెట్టింది. కమిన్స్ నిలకడగా ఆడినా.. 13వ ఓవర్‌లో హోల్డర్.. శివాంగ్ కుమార్(4)ను ఔట్ చేయడంతో స్కోరు 72/8గా మారింది. చివర్లో ప్రసిధ్... కమిన్స్‌ను దెబ్బకొడితే, రషీద్.. ప్రఫుల్ హింగే (3)ను ఔట్ చేసి విజయాన్ని అందించాడు.
సంక్షిప్త స్కోర్లు
గుజరాత్: 20 ఓవర్లలో 168/5 (సుదర్శన్ 61, సుందర్ 50, హింగే 2/17).
హైదరాబాద్: 14.5 ఓవర్లలో 86 ఆలౌట్ (కమిన్స్ 19, రబాడ 3/28, హోల్డర్ 3/20).
