
- స్వీట్లలో సింథటిక్ రంగులు
- స్వీట్ షాపులపై ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ల తనిఖీల్లో బట్టబయలు
- శాంపిల్స్ సేకరించి ల్యాబ్‌కు పంపిన అధికారులు
హైదరాబాద్, వెలుగు: దీపావళి పండుగను ఆసరాగా చేసుకొని ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న స్వీట్స్ తయారీ కేంద్రాలు, షాపులపై ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 95 స్వీట్ యూనిట్లలో తనిఖీలు చేపట్టారు. 77 ఎన్ ఫోర్స్‌మెంట్, 157 సర్వైలెన్స్ శాంపిల్స్‌ను సేకరించి ల్యాబ్‌కు పంపారు. కొన్ని చోట్ల ‘ఫుడ్ సేఫ్టీ ఆన్ వీల్స్’ వెహికల్స్ద్వారా స్పాట్ టెస్టింగ్‌లు కూడా నిర్వహించారు. జిలేబీ, లడ్డూ, కోవాలాంటి పదార్థాల్లో ప్రమాదకరమైన సింథటిక్ రంగులు వాడుతున్నట్లు గుర్తించారు.
స్వీట్లపై అలంకరణకు వాడే సిల్వర్ ఫాయిల్ కూడా నాన్-ఫుడ్ గ్రేడ్ నాణ్యతతో ఉందని, ఇది ఆరోగ్యానికి అత్యంత హానికరమని తేల్చారు. చాలా తయారీ కేంద్రాల్లో అపరిశుభ్ర వాతావరణంలో, కల్తీ నెయ్యి, ఒకటికి పదిసార్లు వాడిన నూనెతో స్వీట్లు తయారు చేస్తున్నట్లు వెల్లడైంది. ల్యాబ్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.