హైదరాబాద్ మెట్రో యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. మెట్రో కార్డుపై 10 శాతం రాయితీని ఎత్తివేస్తున్నట్టు ఉత్తర్వులు జారీ చేసింది. రూ.59 హాలిడే కార్డును పూర్తిగా రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. మార్చి 31తో ఈ ఆఫర్ ముగిసిందని అధికారులు తెలిపారు. ఈ కార్డుతో ప్రయాణికులకు ఎంతో మేలు కలిగేది. హాలిడే ఉన్నప్పుడు ఫ్యామిలీతో బయటకు వెళ్లేందుకు వీలుండేది.
ఇక గత కొన్ని రోజులుగా ఎండలు దంచికొడుతుండటంతో చాలా వరకు ప్రజలు మెట్రో బాటపట్టారు. తక్కువ సమయంలో తమ గమ్యస్థానాలకు హాయిగా ఏసీలో వెళ్లొచ్చు అని భావించారు. కానీ మెట్రో అధికారులు మాత్రం ప్రయాణికులకు షాక్ ఇచ్చారు. దీంతో మెట్రో యాజమాన్యం తీరుపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.