
ఘట్కేసర్, వెలుగు: ఓ వ్యక్తి సెల్‌ఫోన్ చోరీ చేయడంతో ఆయనను ఇద్దరు వ్యక్తులు చావుదెబ్బలు కొట్టి హత్య చేశారు. సీఐ రాజువర్మ తెలిపిన వివరాల ప్రకారం.. భద్రాద్రి -కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండల కేంద్రానికి చెందిన చిట్టగాని వెంకన్న(48) పోచారం మున్సిపాలిటీ, ఓల్డ్ పోచారం విలేజీలో ఉంటూ ఘట్కేసర్లో ఓ బ్రిక్స్ కంపెనీలో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. తాను ఉంటున్న కాలనీలోనే మహబూబాబాద్‌కు చెందిన వివేక్(24) అద్దె ఇంట్లో ఉంటున్నాడు. ఈయన సెల్‌ఫోన్‌ను మూడు రోజుల క్రితం వెంకన్న కొట్టేశాడు.
ఈ విషయం తెలియడంతో వివేక్ తన స్నేహితుడైన మల్లేశ్‌ను తీసుకుని బుధవారం మధ్యాహ్నం జోడిమెట్లకు వెళ్లి వెంకన్నను ఆటోలో ఎక్కించుకున్నారు. ఓ దుకాణంలో ఫోన్ కుదువ పెట్టినట్లు వెంకన్న చెప్పగా అక్కడికి వెళ్లి ఫోన్ తీసుకున్నారు.
ఆ తరువాత వెంకన్నను పోచారం ఓల్డ్ విలేజ్‌లోని నిర్మానుష్య ప్రదేశంలోకి తీసుకెళ్లి సాయంత్రం వరకు విచక్షణా రహితంగా దాడి చేసి ఇంటి వద్ద వదిలేశారు. పరిస్థితి విషమంగా మారడంతో కుటుంబ సభ్యులు ఘట్కేసర్లోని ప్రభుత్వ దవాఖానకు తీసుకెళ్లారు. అప్పటికే వెంకన్న మృతిచెందినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు. పోలీసులు మల్లేశ్, వివేక్‌పై హత్య కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.