
రాయపర్తి, వెలుగు: ఓ మహిళకు పోలీసులు ఫోన్‌చేసి యాక్సిడెంట్లో భర్త చనిపోయాడని సమాచారం అందించారు. వెంటనే ఆమె ఎంజీఎం మార్చురీకి వెళ్లి డెడ్‌బాడీని అంబులెన్స్‌లో సొంతూరు తీసుకెళ్లింది. భర్త మృతి వార్తను ఆమె బంధువులకు తెలిపింది. తీరా అంత్యక్రియలు చేసేందుకు డెడ్ బాడీని బయటకు తీసి చూసి తన భర్తది కాదని అవాక్కైంది. డెడ్ బాడీని తిరిగి అంబులెన్స్‌లో ఎంజీఎంకు పంపించారు. వివరాల్లోకి వెళ్తే.. వరంగల్ జిల్లా రాయపర్తి మండలం మైలారం గ్రామానికి చెందిన గోక కుమారస్వామి(55), ఇరవై ఏండ్ల కింద మతిస్థిమితం సరిగా లేక ఇంట్లోంచి బయటకు వెళ్లిపోయాడు.
మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో భిక్షాటన చేస్తూ అక్కడే ఉంటుండేవాడు. అప్పడప్పుడు అతడిని బంధువులు చూస్తుండేవారు. కాగా.. రెండు రోజుల కింద తొర్రూరులో జరిగిన యాక్సిడెంట్లో అతడు చనిపోయాడు. స్థానికుల నుంచి వివరాలు సేకరించి మృతుడి భార్య గోక రమకు పోలీసులు సమాచారం అందించారు. ఆమె అక్కడికి వెళ్లగా డెడ్ బాడీని గుడ్డలో చుట్టి ఇవ్వగా అంబులెన్స్‌లో సొంతూరుకు తీసుకెళ్లారు.
శుక్రవారం సాయంత్రం అంత్యక్రియలు చేసేందుకు డెడ్ బాడీపై చుట్టిన గుడ్డను విప్పి చూశారు. అది తన భర్త డెడ్ బాడీ కాదని భార్య, తండ్రి కాదని కుమార్తె అనడంతో బంధువులు, గ్రామస్తులు విస్తుపోయారు. పోలీసులు తమకు ఒకటి చూపించి మరో డెడ్‌బాడీని ఇచ్చారని బంధువులు అంటుండగా.. కుమారస్వామిని భార్య చాలా ఏండ్లుగా చూడకపోవడంతోనే గుర్తుపట్టలేకపోయిందని మరికొందరు పేర్కొంటున్నారు. ఘటనా స్థలానికి పోలీసులు వెళ్లి విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.