చర్లపల్లి రైల్వే స్టేషన్ దగ్గర ఒళ్లు ఝలదరించే ఘటన.. గోనె సంచిలో ఏముందో చూసి షాకైన స్థానికులు

చర్లపల్లి రైల్వే స్టేషన్ దగ్గర ఒళ్లు ఝలదరించే ఘటన.. గోనె సంచిలో ఏముందో చూసి షాకైన స్థానికులు

హైదరాబాద్: చర్లపల్లి రైల్వే స్టేషన్ దగ్గర గోనె సంచిలో మహిళ మృతదేహం కలకలం రేపింది. రైల్వే స్టేషన్ సమీపంలో అనుమానాస్పదంగా ఒక గోనె సంచి కనిపించింది.  స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు గోనె సంచి విప్పి చూడగా ఒక మహిళ మృతదేహం కనిపించింది. వయసు 30 నుంచి 40 మధ్య ఉండొచ్చని తెలిపిన పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చర్లపల్లి రైల్వే స్టేషన్ గోడ వద్ద మహిళ మృతదేహం పడేసి వెళ్ళిపోవడంతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. చర్లపల్లి పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ పరిశీలిస్తున్నారు.

కుషాయిగూడ ఏసీపీ వెంకట్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. చర్లపల్లి రైల్వే స్టేషన్లో మూటకట్టిన గోనె సంచిలో నుంచి దుర్వాసన వచ్చింది. మహిళ మృతదేహాన్ని సంచిలో తీసుకొచ్చి పడేసి  గుర్తు తెలియని దుండగులు అక్కడ నుంచి వెళ్ళిపోయారు. రెండు రోజుల క్రితం హత్య చేసిన ఆనవాళ్లు, కుళ్ళిపోయిన స్థితిలో మృతదేహం కనిపించింది. స్థానికుల సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. డాగ్ స్క్వాడ్ సహాయంతో చర్లపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో నిందితుల  కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు ఏసీపీ తెలిపారు.

ఇదిలా ఉండగా.. ఈ ఘటన తరహాలోనే రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ కిస్మత్ పూర్ పరిధిలో మరో ఘటన వెలుగుచూసింది. మహిళ డెడ్ బాడీ కలకలం రేపింది. మహిళను దుండగులు హత్య చేశారు. అత్యాచారం చేసి ఆపై హత్య చేసినట్లు అనుమానాలున్నాయి. మృత దేహంపై బట్టలు లేకపోవడంతో రేప్ అండ్ మర్డర్గా అనుమానం వ్యక్తమవుతోంది. క్లూస్ టీమ్ బృందాలు రంగంలోకి దిగి పలు కీలక ఆధారాలు సేకరించాయి. కిస్మత్ పూర్ బ్రిడ్జి కిందకి మహిళను తీసుకొని వెళ్ళి అత్యాచారం చేసి ఆపై హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.