
అల్బానీ/అట్లాంటా: న్యూయార్క్ సిటీలోని ప్రముఖ పర్యాటక ప్రదేశాల్లో ఒకటైన టైమ్స్ స్క్వేర్ వద్ద ఓ యువకుడు(17) కాల్పులకు తెగబడ్డాడు. శనివారం తెల్లవారుజామున 1:20 గంటలకు జరిగిన ఈ ఘటనలో.. ముగ్గురికి గాయాలయ్యాయని అధికారులు వెల్లడించారు. గాయపడినవారిలో ఓ యువతి, యువకుడు, వృద్ధుడు ఉన్నాడని తెలిపారు. యువతికి మెడ భాగంలో గాయం కాగా.. యువకుడికి పాదంలో, 65 ఏండ్ల వృద్ధుడి కాలుకు బుల్లెట్ గాయాలైనట్లు వివరించారు. ముగ్గురు బాధితులను బెల్లెవ్యూ ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు.
ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కాగా, అట్లాంటాలోని యుఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) హెడ్ ఆఫీస్ బయట కూడా శుక్రవారం ఓ వ్యక్తి కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఓ పోలీస్ ఆఫీసర్ చనిపోయాడని అధికారులు వెల్లడించారు. ఈ ఘటనలో నిందితుడు కూడా చనిపోయాడని వివరించారు.