రెమ్డిసివిర్​ కోసం తిప్పలు

రెమ్డిసివిర్​ కోసం తిప్పలు
  • మెడికల్​ ఏజెన్సీలు, ఆఫీసర్ల చుట్టూ తిరుగుతున్న జనం
  • రూ. 3,500 ఇంజక్షన్​ బ్లాక్​లో 20 వేల నుంచి 40వేలు 
  • చిన్న హాస్పిటళ్లకు రెమ్డిసివిర్​ సరఫరాలో రాష్ట్ర సర్కారు నిర్లక్ష్యం
  • టొసిలిజుమాబ్ ఇంజక్షన్ల జాడే లేదు.. కమిటీ వేసినా నో యూజ్
  • ప్లాస్మా బ్యాంక్​ ముచ్చట్నే లేదు.. 
  • ప్లాస్మాను రూ. 25 వేలకు బ్లాక్​లో అమ్ముతున్న కేటుగాళ్లు

హైదరాబాద్‌, వెలుగు: కరోనా ట్రీట్‌మెంట్‌లో కీలకంగా మారిన రెమ్డిసివిర్​ ఇంజక్షన్ల కోసం జనం పడరాని పాట్లు పడుతున్నారు. వాటి కోసం మెడికల్ ఏజెన్సీలు, ఆఫీసర్ల చుట్టూ తిరుగుతున్నారు. కరోనా సెకండ్ వేవ్ ప్రారంభమైనప్పటి నుంచి పరిస్థితి ఇలాగే ఉంది. ప్రస్తుతం మన రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం రోజూ 6,600 రెమ్డిసివిర్​ ఇంజక్షన్లను కేటాయిస్తోంది. కానీ, హాస్పిటళ్లలో పేషెంట్ల సంఖ్య ఎక్కువగా ఉండడంతో ఇవి సరిపోవడం లేదు. మరోవైపు, వీటిని అన్ని హాస్పిటళ్లకూ అందేలా హెల్త్ ఆఫీసర్లు కూడా చర్యలు తీసుకోవడం లేదు. దీంతో చిన్న చిన్న హాస్పిటళ్లకు ఈ డ్రగ్ దొరకడం లేదు. ఇంజక్షన్లు మీరే తెచ్చుకోవాలంటూ ఆయా హాస్పిటళ్లు పేషెంట్ల కుటుంబ సభ్యులకు చెప్తున్నాయి.  దీంతో వాళ్లు డాక్టర్ రాసిచ్చిన చీటీ పట్టుకొని మెడికల్ షాపుల చుట్టూ తిరగాల్సి వస్తోంది. మన దగ్గర డాక్టర్‌‌ రెడ్డీస్‌, హెటిరో, సిప్లా, మైలాన్ తదితర కంపెనీలు రెమ్డిసివిర్​ ఉత్పత్తి చేస్తున్నాయి. ఈ కంపెనీలు ఉత్పత్తి చేసే ఇంజక్షన్లను కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు, వాటి అవసరాలకు అనుగుణంగా కేటాయింపులు చేస్తోంది. మైలాన్ నుంచి మన రాష్ట్ర కోటా ఇంజక్షన్లు అన్నీ ప్రభుత్వ దవాఖాన్లకు సరఫరా అవుతున్నాయి. హెటిరో నుంచి మన రాష్ట్రానికి కేటాయించిన ఇంజక్షన్లను ఆ సంస్థ నేరుగా ప్రైవేట్ హాస్పిటళ్లకు అమ్ముతోంది. అయితే, ఇందుకు రకరకాల కండీషన్లు పెడుతోంది. ఆ సంస్థతో ఇదివరకే ఒప్పందం ఉన్న హాస్పిటళ్లకు ప్రిఫరెన్స్ ఇస్తోంది. మరోవైపు, ఈ సంస్థలో పనిచేస్తున్న కొందరు ఉద్యోగులు ఇప్పటికే రెమ్డిసివిర్​ను బ్లాక్​లో అమ్ముతూ పోలీసులకు చిక్కారు. రూ. 3,500 విలువైన ఒక్కో ఇంజక్షన్​ను రూ.20 వేల నుంచి 40 వేలకు బ్లాకులో అమ్ముతున్నారు. చిన్న హాస్పిటళ్లకు కరోనా ట్రీట్‌మెంట్‌కు పర్మిషన్ ఇచ్చిన రాష్ట్ర సర్కార్.. ఆ హాస్పిటళ్లకు రెమ్డిసివిర్,  ఆక్సిజన్ అందేలా చర్యలు మాత్రం తీసుకోవడం లేదు. పది, ఇరవై రోజుల కిందట ఇండెంట్ పెట్టిన హాస్పిటళ్లకు కూడా ఇప్పటికీ రెమ్డిసివిర్​ ఇంజక్షన్లు సరఫరా చేయలేదు.

టొసిలిజుమాబ్ కథ వేరే
సీరియస్‌ స్టేజ్‌లో ఉన్న కరోనా పేషెంట్లకు టొసిలిజుమాబ్ అనే డ్రగ్‌ ఎక్కిస్తుంటారు. స్విట్జర్లాండ్‌కు చెందిన రోచ్‌ అనే కంపెనీ ఈ డ్రగ్‌ను ఉత్పత్తి చేస్తోంది. మన దగ్గరి సిప్లా కంపెనీ రోచ్‌తో ఒప్పందం కుదుర్చుకొని టొసిలిజుమాబ్‌ను ఇండియాలో మార్కెటింగ్‌ చేస్తోంది. అయితే, ప్రస్తుతం ఈ డ్రగ్‌కు ఉన్న డిమాండ్ దృష్ట్యా రోచ్ నుంచి వస్తున్న ఇంజక్షన్లను కేంద్రమే ఆయా రాష్ట్రాల అవసరాలకు తగ్గట్టు కేటాయిస్తోంది. మన రాష్ట్రానికి ఇప్పటివరకూ 210 టొసిలిజుమాబ్ ఇంజక్షన్లను కేటాయించింది.

 ఈ ఇంజక్షన్ల పంపిణీకి మన సర్కార్ త్రీమెన్ కమిటీ వేసింది. ప్రభుత్వ, ప్రైవేట్ హాస్పిటళ్లు తమ దగ్గర ట్రీట్‌మెంట్ తీసుకుంటున్న పేషెంట్లలో ఎవరికైనా టొసిలిజుమాబ్ అవసరమని భావిస్తే, ఆ పేషెంట్‌ హెల్త్‌ కండీషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలతో ఈ కమిటీకి మెయిల్‌ ద్వారా అప్లయ్​ చేయాలి. ఆ హాస్పిటల్‌లో పనిచేసే కనీసం ముగ్గురు స్పెషలిస్టులు ఆ పేషెంట్‌కు టొసిలిజుమాబ్ అవసరం అని రికమెండ్ చేయాలి. ఈ రికమండేషన్‌, పేషెంట్‌ కండీషన్‌ను కమిటీ పరిశీలించి, అవసరం అనుకుంటే ఆ డ్రగ్‌ను సప్లయ్​  చేస్తుంది. ఈ డ్రగ్‌ కోసం త్రీమెన్ కమిటీకి ఇప్పటికి వందల సంఖ్యలో అప్లికేషన్లు వచ్చాయి. దీంతో అప్లికేషన్ పరిశీలించే సమయం కూడా కమిటీకి చాలడం లేదు. ఇప్పటివరకూ 105 మందికి మాత్రమే కమిటీ అప్రూవల్ ఇచ్చింది. అయితే, ఇప్పటికీ చాలా హాస్పిటళ్లకు టొసిలిజుమాబ్‌ కేటాయింపునకు ఓ కమిటీ ఉందన్న విషయం తెలియక గందరగోళ పడుతున్నాయి.

ప్లాస్మా బ్యాంక్ ఏది సారూ?
కరోనా ట్రీట్‌మెంట్‌లో డాక్టర్లు ప్లాస్మాను విరివిగా ఉపయోగిస్తున్నారు. ఇప్పటికే కరోనా నుంచి కోలుకున్నవారి ప్లాస్మాను కరోనా ట్రీట్‌మెంట్ పొందుతున్నవారికి ఎక్కిస్తున్నారు. దీంతో యాంటిబాడీస్ డెవలప్‌ అయి పేషెంట్లు కోలుకుంటున్నారని డాక్టర్లు చెప్తున్నారు. గాంధీ హాస్పిటల్​లో ప్లాస్మా బ్యాంక్ పెడుతామని హామీ ఇచ్చిన రాష్ట్ర సర్కార్, ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదు. దీంతో పేషెంట్ల బంధువులు ప్లాస్మా కావాలంటూ తెలిసినవాళ్లందరినీ వేడుకుంటున్నారు. ప్లాస్మాను కొన్ని బ్లడ్ బ్యాంకులు, కొంత మంది ప్రైవేట్ వ్యక్తులు ఒక దందాగా మార్చేశారు. డోనర్ నుంచి ప్లాస్మా సేకరించి ఇవ్వడానికి రూ. 20 వేల నుంచి 25 వేలు వసూలు చేస్తున్నారు. ఇవేవీ హెల్త్ డిపార్ట్‌మెంట్ పెద్దగా పట్టించుకోవడం లేదు. చాలా రాష్ట్రాల్లో  కరోనా నుంచి కోలుకున్నవాళ్ల డేటాతో ఒక సెంటర్‌‌ను ఏర్పాటు చేశారు. ఎవరికైనా ప్లాస్మా కావాలంటే, అందులో ఉన్న వివరాల ఆధారంగా సదరు బ్లడ్ గ్రూప్‌ వ్యక్తులకు ఫోన్లు చేసి ప్లాస్మా అరెంజ్ చేస్తున్నారు. మన దగ్గర ప్రభుత్వం అలాంటి ఆలోచనే చేయడం లేదు.

ఒక్కొక్కరికి 6 డోసులు కావాలి
కరోనా ట్రీట్‌మెంట్​లో రెమ్డిసివర్​ ఇంజక్షన్​ కీలకంగా మారింది. ఆక్సిజన్‌ వరకూ వెళ్లిన కరోనా పేషెంట్లకు  కచ్చితంగా ఈ ఇంజక్షన్ ఇస్తున్నారు. ఇలాంటి వాళ్లకు ఒక్కొక్కరికి రోజుకు ఒకటి చొప్పున 6 ఇంజక్షన్లు ఇవ్వాల్సి ఉంటుంది. కొంత మందికి అవసరాన్ని బట్టి పది కూడా ఇవ్వొచ్చని ఎయిమ్స్‌ సూచించింది. చాలా దవాఖాన్లలో రెమ్డిసివిర్​ ఇంజక్షన్లు లేక మధ్యలోనే కోర్సు ఆపేస్తున్నారు. ఓ వైపు రెమ్డిసివిర్​కు  ఫుల్ డిమాండ్ ఉండగా, మరోవైపు అది లైఫ్ సేవింగ్ డ్రగ్‌ ఏమీ కాదన్న వాదనలూ వినిపిస్తున్నాయి. రెమ్డిసివిర్​‌తో కరోనా పేషెంట్లకు ప్రయోజనం చేకూరుతున్నట్టు క్లినికల్‌గా ఇప్పటివరకూ ప్రూవ్ కాలేదని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకటించింది. ఎయిమ్స్ ఇచ్చిన ట్రీట్‌మెంట్ గైడ్‌లైన్స్‌లో మాత్రం మోడరేట్, సీరియస్‌ డిసీజ్డ్​ పేషెంట్లకు రెమ్డిసివిర్​ ఇవ్వాలని పేర్కొంది.

ఒక్కో ఇంజక్షన్​కు 35 వేలు పెట్టినం
మా పెద్ద నాన్నకు కరోనా పాజిటివ్ వచ్చింది. హన్మకొండలోని ఒక హాస్పిటల్​లో అడ్మిట్ చేసినం. అర్జెంటుగా రెమ్డిసివిర్ ఇంజక్షన్ కావాలన్నరు. ఒక్కోదానికి రూ.35 వేల అమౌంట్ కడితే ఇంజక్షన్లు అరెంజ్ చేశారు. చివరికి అవి ఇచ్చినా ఫలితం దక్కలేదు. అప్పటికే ఆలస్యం అవడంతో పెద్దాయన చనిపోయారు.
‑ నాగరాజు, హన్మకొండ

రూ. 18 వేలకు ఒకటి కొన్న
మా మామకు కరోనా రావడం తో వారం కింద జగిత్యాలలోని ఓ ప్రైవేటు హాస్పిటల్​లో  జాయిన్​ చేసినం. ఆరు రెమ్డిసివిర్​ ఇంజక్షన్లు కావాలని చెప్పడంతో డ్రగ్ ఆఫీస్ కు వెళ్లిన. అక్కడ రెండే ఇచ్చిన్రు. మిగిలిన 4 ఇంజక్షన్లు బయట రూ. 18 వేలకు ఒకటి చెప్పున కొన్న. 
‑ సతీశ్​, జగిత్యాల