మరి డాక్టర్లేరీ!: 9 జిల్లా ఆసుపత్రుల్లో కోవిడ్ యూనిట్లు రెడీ

మరి డాక్టర్లేరీ!: 9 జిల్లా ఆసుపత్రుల్లో కోవిడ్ యూనిట్లు రెడీ

వెలుగు, నెట్వర్క్:  రాష్ట్రవ్యాప్తంగా తొమ్మిది జిల్లా ఆసుపత్రుల్లో కరోనా ట్రీట్మెంట్ కోసం కోవిడ్ యూనిట్లు రెడీ అయ్యాయి. ఆయాచోట్ల గతంలో ఏర్పాటు చేసిన ఐసోలేషన్ వార్డులనే అప్గ్రేడ్చేసి, కరోనా పాజిటివ్ పేషెంట్లకు చికిత్స అందిస్తున్నారు. మొదట్లో కరోనా సోకిన ప్రతి ఒక్కరినీ హైదరాబాద్లోని గాంధీ ఆసుపత్రికి తరలించి, చికిత్స అందించారు. కానీ పేషెంట్ల సంఖ్య పెరుగుతుండడంతో గాంధీపై ఒత్తిడి ఎక్కువవుతోంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా తొమ్మిదిచోట్ల ఆదిలాబాద్ రిమ్స్, వరంగల్ఎంజీఎం, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, నల్గొండ, మహబూబ్నగర్, సిద్దిపేట, సూర్యాపేట జిల్లా ఆసుపత్రుల్లో కరోనా ట్రీట్మెంట్కు ప్రత్యేకంగా కోవిడ్ యూనిట్లు ఏర్పాటు చేశారు. వీటిలో సిద్దిపేట, సూర్యాపేట తప్ప మిగిలినవన్నీ పాత జిల్లాకేంద్రాలే. ఇందుకోసం ఆయా చోట్ల ఇప్పటికే ఉన్న ఐసోలేషన్ వార్డులకు తోడు ఐసీయూలు రెడీ చేశారు.

జిల్లాల్లో పరిస్థితి ఇదీ..

ఆదిలాబాద్ రిమ్స్ లో వంద బెడ్ల ఐసోలేషన్ విభాగంతోపాటు ఇరవై బెడ్స్తో ఐసీయూ ఏర్పాటు చేశారు. దీంట్లో ఆరుగురు డాక్టర్లు, ఒక నోడల్ ఆఫీసర్ మాత్రమే పని చేస్తున్నారు. కోవిడ్యూనిట్లో డాక్టర్లు, మెడికల్ సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. ఐదుగురు సీనియర్ మెడికల్ఆఫీసర్లు రిమ్స్లో రెగ్యులర్ డ్యూటీలు చేస్తూనే.. కోవిడ్ విభాగంలో అదనపు బాధ్యతలు చూస్తున్నారు. రిమ్స్ఐసోలేషన్ వార్డులో ప్రస్తుతం తొమ్మిది మంది కరోనా పాజిటివ్ బాధితులు ఉన్నారు. బాధితులు పెరిగితే ఇబ్బందవుతుందని, వంద పడకల ఐసోలేషన్ విభాగంలో 40 మంది డాక్టర్లు అవసరమని చెప్తున్నారు. ఇప్పటికే రిమ్స్లో డాక్టర్ల పోస్టులు 60 శాతం వరకు ఖాళీగా ఉన్నాయి. 21 మంది ప్రొఫెసర్లకు గాను ఏడుగురు, 50 మంది అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులకు గాను 19 మంది, 81 అసిస్టెంట్ ప్రొఫెసర్లకు గాను 29 మంది, 57 ట్యూటర్లకు గాను 38 మంది మాత్రమే పనిచేస్తున్నారు. కరోనా ట్రీట్మెంట్ కోసం ఖమ్మం జిల్లా ప్రధాన ప్రభుత్వ ఆస్పత్రిలో 120 బెడ్లతో కోవిడ్ యూనిట్ సిద్ధం చేశారు. 8 వెంటిలేటర్లు అందుబాటులో ఉంచారు. ఈ దవాఖానాలో 56 మందికి గాను 26 మంది డాక్టర్లు మాత్రమే పని చేస్తున్నారు. 30 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 75 మంది స్టాఫ్ నర్సులకు గాను 58 మంది పని చేస్తున్నారు. 17 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

నల్గొండ జనరల్ ఆస్పత్రిలో 25 పడకలతో ఐసోలేషన్ వార్డు, 10 పడకలతో ఐసీయూ ఏర్పాటు చేశారు. 10 మంది డాక్టర్లను మూడు షిప్టుల్లో నియమించారు. ఈ ఆస్పత్రిలో ఒక వెంటిలేటరే అందుబాటులో ఉంది. సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా పేషెంట్లకోసం 20 పడకలతో ఐసోలేషన్ వార్డును ఏర్పాటు చేశారు. 5 వెంటిలెటర్లను రెడీ చేశారు. జిల్లాకు గత ఏడాది మెడికల్ కాలేజీ మంజూరైనా సిబ్బందిని నియమించలేదు. జిల్లా ఆసుపత్రి సిబ్బందినే మెడికల్ కాలేజీకి కేటాయించారు. దీంతో ఆసుపత్రిలో 10 మంది డాక్టర్ల కొరత ఉంది. 50 మంది స్టాఫ్నర్సులుండగా సగం మందిని మెడికల్ కాలేజీకి బదిలీ చేశారు. జిల్లాలో 10 మెడికల్ ఆఫీసర్లు, 5 ఫార్మసిస్ట్, 7 ల్యాబ్ టెక్నీషియన్స్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ హాస్పిటల్లో పూర్తి స్థాయి కోవిడ్ యూనిట్ ఏర్పాటు చేస్తున్నారు. ట్రామా కేర్ సెంటర్లో ఉన్న 200 బెడ్స్తో పాటు కొత్తగా 200 బెడ్స్ను రెడీ చేస్తున్నారు. వెంటిలేటర్స్ కోసం ప్రపోజల్స్పంపారు. టీచింగ్ హాస్పిటల్కు ప్రొఫెసర్లు, అసోసియేట్, అసిస్టెంట్ప్రొఫెసర్ పోస్టులు 311 మంజూరుకాగా, 104 మంది రెగ్యులర్ డాక్టర్లు పనిచేస్తున్నారు. 83 మంది కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ డాక్టర్లను రిక్రూట్ చేశారు. 124 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

వరంగల్లోని ఎంజీఎంలో ఇప్పటికే కరోనా ట్రీట్మెంట్ కోసం 200 బెడ్స్ ఏర్పాటు చేశారు. 160 పడకలతో ఐసోలేషన్, ఒక్కో దాంట్లో 20 పడకలతో రెండు ఐసీయూ వార్డులు ఏర్పాటు చేశారు. 20 వెంటిలేటర్లు, నాలుగు వేలకు పైగా పీపీఈ కిట్లు అందుబాటులో ఉంచారు. ప్రస్తుతానికి 25 మంది జనరల్ ఫిజిషియన్లు ట్రీట్మెంట్ అందిస్తుండగా.. ముందస్తుగా 65 మంది స్టాఫ్ నర్సులను కాంట్రాక్టు పద్ధతిన తీసుకున్నారు. ఎంజీఎంలో ప్రొఫెసర్, అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్ లాంటి మెడికల్ ఆఫీసర్లు 1470 మంది ఉండాలి. కానీ 826 మంది డాక్టర్లే పని చేస్తున్నారు. ఇంకా 644 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

కరీంనగర్ జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి లో 100 పడకలను సిద్ధంగా ఉంచారు. 36 ఆక్సిజన్ పాయింట్లు, ఆరు వెంటిలేటర్లు ఏర్పాటు చేశారు. ప్రస్తుతానికి పీపీఈ కిట్లు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం ఒక పేషెంట్ ఇక్కడ చికిత్స పొందుతున్నాడు. 25 మంది డాక్టర్లు షిఫ్టులవారీగా పని చేస్తారని చెబుతున్నారు. కానీ కేసులు పెరిగితే ఇప్పుడున్న డాక్టర్లు, స్టాఫ్ సరిపోరని అంటున్నారు. ఇప్పటికే కరీంనగర్ ఆస్పత్రిలో 13 సివిల్ సర్జన్, 11 డిప్యూటీ సివిల్ సర్జన్ , 50 నర్సింగ్ స్టాఫ్‍ ఖాళీలు ఉన్నాయి.

మహబూబ్నగర్ప్రభుత్వ ఆస్పత్రిలో 30 బెడ్స్ తో ఐసోలేషన్ వార్డు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఇక్కడ ఇద్దరు కరోనా పేషెంట్లకు ట్రీట్మెంట్ఇస్తున్నారు. 12 వెంటిలేటర్లు అందుబాటులో ఉన్నాయి. ఆస్పత్రిలో 111 మంది డాక్టర్లకుగాను 26 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 160 మంది స్టాఫ్ నర్సులకు గాను 144 మంది ఉన్నారు.  సిద్దిపేట జనరల్ హాస్పిటల్ లో కరోనా పేషెంట్ల ట్రీట్మెంట్ కు సంబంధించి ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి ఉత్తర్వులు రాలేదని ఆసుపత్రి సూపరింటెండెంట్ చంద్రయ్య చెప్పారు. ఆసుపత్రిలోపని ఐసోలేషన్ వార్డులో నే పేషెంట్ లకు ట్రీట్మెంట్ ఇవ్వాలని ప్రాథమికంగా నిర్ణయించారు.

స్పెషలిస్టులు లేరు

జిల్లా ఆసుపత్రుల్లో కోవిడ్ యూనిట్లు రెడీగా ఉన్నప్పటికీ డాక్టర్ పోస్టులు ఖాళీగా ఉండడం కలవరపెడుతోంది. బీపీ, షుగర్, క్యాన్సర్, కిడ్నీ, లివర్, హార్ట్ తదితర ప్రాబ్లమ్స్ఉన్నవారు కరోనా బారిన పడినప్పుడే లెవల్–2, 3 పేషెంట్లుగా మారతారు. వారికి ఇక్కడ చికిత్స అందించాలంటే ఆయా స్పెషలిస్టు డాక్టర్లు ఉండాలి. కానీ చాలా జిల్లా హాస్పిటల్స్లో స్పెషలిస్టుల కొరత ఉంది. దీంతో డెయిలీ ఓపీ, సాధారణ పేషెంట్లను చూసే డాక్టర్లనే కరోనా సెంటర్లకు కేటాయిస్తున్నారు. కరోనా పాజిటివ్ పేషెంట్లను చూసే డాక్టర్లు సాధారణంగా వన్ వీక్ డ్యూటీలో, మరో వారం ఐసోలేషన్లో ఉండాల్సి ఉంటుంది. ఈ లెక్కన సాధారణ రోగులకు ఇబ్బందులు తప్పవు.

లెవల్3 సీరియస్ కేసులే గాంధీకి..

ఐసీఎంఆర్ గైడ్ లైన్స్ ప్రకారం కరోనా పాజిటివ్ ఉండి, ఎలాంటి సిమ్టమ్స్ లేనివారిని హోమ్ ఐసోలేషన్ లో ఉంచుతున్నారు. ఇక మైల్డ్ సిమ్టమ్స్ అంటే సాధారణ దగ్గు, జలుబు, జ్వరం ఉన్న కేసులను లెవల్–1గా పరిగణించి జిల్లాల్లో ఏర్పాటుచేసిన కోవిడ్ యూనిట్లలో అబ్జర్వేషన్లో పెడతారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉన్న మోడరేట్ కేసులను లెవల్–2గా పరిగణిస్తారు. ఇలాంటి కేసులకు ఆక్సిజన్, మెడికేషన్ అవసరమవుతాయి. ఇక సీరియస్ కేసులను లెవల్ –3గా పరిగణించి ఐసీయూలో వెంటిలేటర్పై ట్రీట్ మెంట్ అందిస్తారు. ఇలాంటివారిని అత్యవసరమైతే గాంధీకి తరలిస్తారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి

10 రోజుల్లో 82 మరణాలు..తెలంగాణలో పెరుగుతున్నకరోనా

సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌పై అసభ్యకర పోస్టింగ్స్ చేసిన‌ వ్యక్తి అరెస్టు