ప్రభుత్వ ఆస్పత్రుల్లో డాక్టర్ల కొరత

ప్రభుత్వ ఆస్పత్రుల్లో డాక్టర్ల కొరత
  • నాడి పట్టే నాథుడేడి?
  • రాష్ట్రంలో ప్రతి 8 వేల మందికి ఒక్కరే
  • 37 వేల మంది ఉండాల్సిన చోట 4,622 మందే
  • నలుగురి పని ఒక్కరితోనే చేయిస్తున్న ప్రభుత్వం

హైదరాబాద్‌‌, వెలుగు:

వరల్డ్‌‌ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రమాణాల ప్రకారం ప్రతి వెయ్యి మంది జనాభాకు ఒక ప్రభుత్వ డాక్టర్‌‌‌‌ ఉండాలి. కానీ మన రాష్ర్టంలో ప్రతి 8 వేల మందికి ఒకరే ఉన్నారు. 37 వేల మంది డాక్టర్లు ఉండాల్సిన చోట కేవలం 4,622 మందే ఉన్నారు. ప్రభుత్వ దవాఖాన్లలో డాక్టర్ల దుస్థితి ఇదీ. నలుగురు చేయాల్సిన పని ఒక్కరే చేస్తున్నారు. దీంతో సాధారణ సమయాల్లోనే డాక్టర్లపై పని భారం ఎక్కువగా ఉంటోంది. ప్రస్తుతం వైరల్​ ఫీవర్ ​విజృంభిస్తుండటం, రోగులు ఆస్పత్రులకు పోటెత్తుతుండటంతో డాక్టర్లు, నర్సులు మానసికంగా తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. దీంతో వైద్య వలపైనా ప్రభావం పడుతోంది.

రోజుకు 1.4 లక్షల ఓపీ కేసులు

పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా దవాఖాన్లను పెంచని ప్రభుత్వం, ఉన్న దవాఖాన్లలో ఫ్యాకల్టీని భర్తీ చేయడంలోనూ నిర్లక్ష్యం చేస్తోంది. ప్రస్తుతం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి టీచింగ్ హాస్పిటళ్ల వరకూ ప్రభుత్వం మంజూరు చేసిన డాక్టర్‌‌‌‌ పోస్టులు 7,029 ఉంటే, ఇందులో 2,407 పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. అత్యంత కీలకమైన వైద్య విద్య విభాగంలోనే 1,359 పోస్టులు ఖాళీలు ఉన్నాయి. మరోవైపు ప్రభుత్వ దవాఖాన్లకు వచ్చే రోగుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. సగటున రోజుకు 1.4 లక్షల ఓపీ కేసులు నమోదవుతున్నాయి.

నర్సుల గోస అంతా ఇంతా కాదు

ఇక సర్కారు దవాఖాన్లలో పని చేస్తున్న నర్సులు ఎదుర్కొంటున్న ఒత్తిడి అంతా ఇంతా కాదు. ఐదారుగురు చేయాల్సిన పనిని ఒక్కరితోనే చేయిస్తున్నారు. ఇండియన్ నర్సింగ్‌‌ కౌన్సిల్ ప్రమాణాల ప్రకారం జనరల్‌‌ వార్డులో ప్రతి ఆరుగురు పేషెంట్లకు ఒక నర్సు, ఇంటెన్సివ్‌‌ కేర్‌‌‌‌లో ఇద్దరు పేషెంట్లకు ఒకరు, క్రిటికల్ కేర్‌‌‌‌లో ఒక పేషెంట్‌‌కు ఒక నర్సు చొప్పున ఉండాలి. కానీ ఏ ఒక్క దవాఖానలోనూ ఈ మేరకు స్టాఫ్ నర్సులు లేరు. రాష్ర్టంలోని ప్రభుత్వ దవాఖాన్లలో అన్ని రకాల బెడ్లు కలిపి 25,135 ఉన్నాయి. అవసరాన్ని బట్టి కొన్ని ఆస్పత్రుల్లో బెడ్ల సంఖ్యను పెంచారు. అవి కూడా కలిపితే ఈ సంఖ్య 30 వేలు దాటుతుంది. ఈ లెక్కన కనీసం 18 నుంచి 20 వేల మంది నర్సులు ఉండాలి. కానీ ప్రస్తుతం ప్రభుత్వ దవాఖాన్లలో కేవలం 4,473 మంది మాత్రమే ఉన్నారు. ప్రభుత్వం మంజూరు చేసిన మొత్తం పోస్టులు నింపినా, నర్సులపై ఒత్తిడి తగ్గదు. గాంధీ దవాఖానలో అన్ని రకాల బెడ్లు కలిపి 2,000 వరకు ఉన్నాయి. ఈ లెక్కన సుమారు 1,000 నుంచి 1,200 మంది నర్సులు ఉండాలి. కానీ అక్కడ 350 మంది మాత్రమే పని చేస్తున్నారు. దీంతో ఇక్కడ నలుగురు చేయాల్సిన పని ఒక్కరిపైనే పడుతోంది. క్రిటికల్ కేర్‌‌‌‌, ఇంటెన్సివ్ కేర్ వార్డుల్లోనూ ఏడెనిమిది బెడ్లకు ఒక్కరే నర్సు ఉంటున్నారు.

ఐదేండ్లలో 6 పారామెడికల్ పోస్టులే భర్తీ

గడిచిన ఐదేండ్లలో ప్రభుత్వం కేవలం 6 పారామెడికల్ పోస్టులను మాత్రమే భర్తీ చేసింది. తెలంగాణ వచ్చాక మంజూరు చేసిన 2,196 పోస్టులతోపాటు, అంతకుముందే ఉన్న ఖాళీలతో కలిపి మొత్తం పారామెడికల్‌‌ ఖాళీల సంఖ్య 7,647కు చేరింది. ఇందులో స్టాఫ్ నర్స్‌‌, ల్యాబ్‌‌ టెక్నీషియన్, ఫార్మసిస్ట్‌‌ పోస్టులున్నాయి. కొన్ని చోట్ల ల్యాబ్ టెక్నీషియన్లు లేక పెద్ద పెద్ద యంత్రాలు ఖాళీగా ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కాంట్రాక్ట్‌‌, ఔట్ సోర్సింగ్ నియామకాల వైపు మొగ్గు చూపుతోంది. తాత్కాలిక ప్రతిపాదికన ఖాళీల భర్తీకి డీఎంహెచ్‌‌వోలకు అధికారం ఇచ్చినట్టు ఇటీవల అసెంబ్లీలో ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌‌‌‌ వెల్లడించారు.

ఒత్తిడి పెరిగింది

తెలంగాణ వచ్చిన తర్వాత 2,500 డాక్టర్ పోస్టులను ప్రభుత్వం భర్తీ చేసింది. అయినా మంజూరైన పోస్టుల్లో మరో 25% పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. ఇప్పుడు రోగుల సంఖ్య పెరిగింది. దీంతో ఒక్కో డాక్టర్‌‌‌‌ రోజూ 150 నుంచి 200 మంది ఓపీ పేషెంట్లను చూడాల్సి వస్తోంది. పని ఒత్తిడి పెరిగినా పేదల పరిస్థితిని దృష్ట్యా పని చేస్తున్నాం. నర్సులు, పారామెడికల్ స్టాఫ్‌‌ కొరత కూడా ఎక్కువగా ఉంది. ఓపీ, ఐపీ పేషెంట్ల సంఖ్య పెరగడంతో ఉన్నవాళ్లపై ఒత్తిడి పెరిగింది. ‑ డాక్టర్‌‌‌‌ లాలూ ప్రసాద్‌‌, ప్రెసిడెంట్‌‌, ప్రభుత్వ వైద్యుల సంఘం

ఐదేండ్లుగా ఒక్క పోస్టూ..

దవాఖాన్లలో బెడ్లను పెంచుతూ పోతున్నారు తప్ప, ఫ్యాకల్టీని పెంచడం లేదు. ఐదేండ్లుగా ఒక్క నర్సు పోస్టు కూడా భర్తీ చేయలేదు. దీం తో ఓ వైపు ప్రస్తుతమున్న నర్సులపై ఒత్తిడి పెరుగుతోంది. మరోవైపు నర్సింగ్ కోర్సులు చేసిన వాళ్లకు ప్రభుత్వ ఉద్యోగాలు లభించ డం లేదు. తప్పనిసరిగా ప్రైవేటులో తక్కువగా వేతనాలకు పని చేయాల్సి వస్తోంది. పెంచిన బెడ్లకు అనుగుణంగా పోస్టులు మంజూరు చేస్తే, ఖాళీల సంఖ్య ఇప్పుడు ఉన్నదానికి రెట్టింపు అవుతుంది.‑ కె.గోవర్ధన్‌‌, ప్రెసిడెంట్,  తెలంగాణ నర్సింగ్ సమితి

Shortage of doctors in government hospitals in Telangana