కొండాపూర్ ఏరియా ఆస్పత్రి గైనకాలజీ విభాగంలో డాక్టర్ల కొరత

కొండాపూర్ ఏరియా ఆస్పత్రి గైనకాలజీ విభాగంలో డాక్టర్ల కొరత
  • ఎక్కువ సేపు క్యూలైన్​లో నిల్చొలేక గర్భిణుల అవస్థలు
  • అదనంగా డాక్టర్లను నియమించాల్సి ఉన్నా పట్టించుకోని ప్రభుత్వం

మాదాపూర్​, వెలుగు: కొండాపూర్​ ఏరియా ఆస్పత్రిలో గైనకాలజిస్ట్​లు సరిపడా లేక గర్భిణులు ఇబ్బందులు పడుతున్నారు. డాక్టర్​ను కలవాలంటే గంటల పాటు వెయిట్ ​చేయాల్సిన పరిస్థితి. వందల సంఖ్యలో ఔట్​ పేషెంట్లు(ఓపీ) వస్తున్నా.. గైనకాలజిస్టుల సంఖ్య సింగిల్​ డిజిట్ ఉంది. డాక్టర్లు తక్కువగా ఉండటంతో చెకప్ ​కోసం వచ్చే గర్భిణులు గంటల తరబడి క్యూ లైన్​లో నిలుచోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి.  డాక్టర్లు, హెల్త్​ స్టాఫ్ తక్కువగా ఉండటంతో ​వారిపై ఒత్తిడి  పెరిగి ఒక్కోసారి​ సహనం కోల్పోయి పేషెంట్లపై చిరాకు పడుతున్నారు. క్యూ లైన్​లో నిల్చోలేక కొందరు గర్భిణులు ప్రైవేట్​ హాస్పిటల్స్​కు వెళుతున్నారు. 

రోజూ 450- 600 మంది 

రంగారెడ్డి జిల్లాలోనే కొండాపూర్ ఏరియా ఆస్పత్రి పెద్దది.  కూకట్​పల్లి, కేపీహెచ్​బీ కాలనీ, అల్విన్​కాలనీ, చందానగర్, మియాపూర్, లింగంపల్లి, మాదాపూర్, కొండాపూర్, గచ్చిబౌలి, తెల్లాపూర్, మణికొండ, రాయదుర్గం, వట్టినాగులపల్లి, గండిపేట నుంచి ఇక్కడికి ఎక్కువగా పేషెంట్లు వస్తుంటారు. రోజూ 450–600 మంది గర్భిణులు జనరల్ చెకప్​కు వస్తుంటారు. 20–30 వరకు డెలివరీలు జరుగుతాయి. వీరితో పాటు దాదాపు 400 మంది జనరల్, ఇతర విభాగాల్లో ఓపీ కోసం వస్తుంటారు. రోజూ  వందల సంఖ్యలో గర్భిణులు వస్తున్నప్పటికీ 8 మంది మాత్రమే గైనకాలజిస్ట్​లు ఉన్నారు. మొత్తం 9 మంది ఉండగా, వీరిలో ఒకరు డిప్యూటేషన్​మీద ఇబ్రహీంపట్నంకు వెళ్లారు. ఓపీ చెకప్​చేసేందుకు ముగ్గురు లేదా నలుగురు గైనకాలజిస్ట్​లు మాత్రమే అందుబాటులో ఉంటున్నారు. దీంతో చెకప్ చేసేందుకే చాలా టైమ్ పడుతోంది. డాక్టర్​ను కలిసేందుకు దాదాపు 3 గంటల వరకు వెయిట్​ చేయాల్సి వస్తోందని గర్భిణులు వాపోతున్నారు.

అదనపు డాక్టర్ల కేటాయింపులో నిర్లక్ష్యం

8 మంది గైనకాలజిస్టుల్లో​నలుగురు ప్రతి రోజు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఓపీ చెక్​చేస్తున్నారు. మిగిలిన వారు మెటర్నిటీ వార్డు, డెలివరీ సెక్షన్​లో ఉంటారు. వీరి సంఖ్యను మరింత పెంచాల్సిన అవసరం ఉన్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. పెద్ద సంఖ్యలో గర్భిణులు ఏరియా ఆసుపత్రికి వస్తున్నా అదనపు డాక్టర్లను నియమించడంలో ప్రభుత్వం విఫలమవుతోంది. ప్రస్తుతం ఉన్న డాక్టర్లపైనే ఎక్కువ ప్రెజర్​పడుతోంది. 

3 గంటల పాటు వెయిటింగ్..

ప్రతి నెలా హెల్త్​ చెకప్​ కోసం కొండాపూర్​లోని ​జిల్లా ఆస్పత్రికి వస్తాను. ఉదయం 8 గంటలకే వచ్చి ఓపీ తీసుకొని క్యూలైన్​లో వెయిట్​ చేస్తాను. అప్పటికే చాలామంది ఉంటారు. చెకప్ ​కోసం క్యూలైన్​లో దాదాపు 3 గంటల సేపు  వెయిట్ ​చేయాల్సి వస్తోంది. ఆ తర్వాత స్కానింగ్ ​ఇతర టెస్టుల కోసం మరో గంట టైం పడుతోంది. 

- హరిత, గర్భిణి, గండిపేట