పండుగ పూట రాష్ట్రంలో గ్యాస్ సిలిండర్ల కొరత

పండుగ పూట రాష్ట్రంలో గ్యాస్ సిలిండర్ల కొరత
  • బుక్​ చేసి 10–15 రోజులవుతున్నా అందట్లె
  • పల్లెల్లో నే ప్రభావం ఎక్కు వ..జనాలకు అవస్థలు
  • సౌదీ అరేబియా, ముంబై ఘటనల వల్లే కొరత

బతుకమ్మ, దసరా పండుగ వేళ ప్రతి ఇంటికీ గ్యాస్​ సిలిండర్ల పరేషాన్​ పట్టుకుంది. బుక్​ చేసి పది, పదిహేను రోజులైనా గ్యాస్​ సిలిండర్​ దొరకట్లేదు. పండుగ సీజన్​ కావడంతో గ్యాస్​ఎప్పుడైపోతుందో.. బండ ఎప్పుడొస్తుందో తెలియక జనం టెన్షన్​ పడుతున్నారు. సౌదీ అరేబియాలోని అరామ్కో ఆయిల్​ రిఫైనరీపై దాడి, ముంబైలోని పెట్రోలియం కంపెనీలో అగ్ని ప్రమాదం వంటివి గ్యాస్​ సరఫరాపై ప్రభావం చూపిస్తున్నాయని చెబుతున్నారు. పండుగ టైమ్​లో గ్యాస్​ సిలిండర్ల కొరత ఏర్పడడంతో డిస్ట్రిబ్యూటర్లూ తల పట్టుకుంటున్నారు.

ఏం జరిగిందంటే..

గత నెల14న సౌదీ అరేబియాలోని అరామ్కో ఆయిల్​​రిఫైనరీపై డ్రోన్​ దాడులు జరిగాయి. అప్పటి నుంచి అక్కడ చమురు ఉత్పత్తి ఆగిపోయింది. దాని ప్రభావం మన దేశంతోపాటు ఇతర దేశాలపై పడింది. మనం సౌదీ నుంచే ఎక్కువగా ముడి చమురును దిగుమతి చేసుకుంటున్నాం. అరామ్కోపై దాడి ప్రభావంతో దేశానికి ముడిచమురు దిగుమతులు ఆగిపోయాయి. ఈ నెల 3న ముంబైలోని యురాన్​ ఆయిల్​ ప్రాసెసింగ్​ యూనిట్​లో భారీ ఆగ్ని ప్రమాదం జరిగింది. దీంతో అక్కడా ఆయిల్​ ప్రాసెసింగ్​ నిలిచిపోయింది. ఆ రెండింటి ప్రభావం తెలంగాణతోపాటు చాలా రాష్ట్రాలపై పడింది. పండుగ పూట జనం ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం, గ్యాస్​ కంపెనీలు చర్యలు తీసుకుంటున్నాయి. అందుబాటులో ఉన్న మొత్తం స్టాక్​ను సరఫరా చేశారు. కానీ డిమాండ్​ ఎక్కువగా ఉండడంతో ఆ స్టాక్​ సరిపోదని డిస్ట్రిబ్యూటర్లు చెబుతున్నారు. స్టాక్​ మొత్తాన్ని ఒకేసారి సరఫరా చేసి పండుగ టైంలో కొరత నుంచి బయటపడినా పండుగల తర్వాత మళ్లీ గ్యాస్​కు ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉందని అంటున్నారు.