
ప్రంపంచం ప్రమాదంలో ఉంది.. భూగోలానికి ముప్పు ఏర్పడుతోంది.. పర్యావరణాన్ని కాపాడుకుందాం.. అంటూ ఐక్యరాజ్య సమితి ప్రతీఏటా పిలుపునిస్తుంటుంది. అప్పుడు ఈ అంశంపై ప్రపంచ దేశాలు చర్చలు, సమావేశాలు జరుపుతూ ఉంటాయి. కచ్చితంగా పాటించాలంటూ కొన్ని కఠిన నిర్ణయాలతో డిక్లరేషన్ విడుదల చేస్తుంటారు. పాటిస్తామంటూ దాదాపు అన్ని దేశాలు సంతకాలు చేస్తాయి.. కానీ కార్పోరేట్ శక్తులు ప్రభుత్వాలను శాసించే ఈ రోజుల్లో ఆ డిక్లరేషన్లు ఆచరణకు నోచుకోవు. ప్రపంచ దేశాల నిర్లక్ష్యం వలన మానవాళికి ఎంత ప్రమాదం జరుగుతోందో ఈ ఒక్క ఘటన చాలు. ఒక దేశం దేశమే వలస వెళ్లే పరిస్థితి వచ్చిందంటే భవిష్యత్తు ఎలా ఉంటుందో ఊహించుకుంటేనే భయంకరంగా కనిపిస్తోంది.
తువాళు అనే ఒక దేశం వలస వెళ్తోంది. ఇన్నాళ్లుగా రాసుకున్న చరిత్ర, తరతరాల నాగరికతను సముద్రంలో కలిపేసి.. కన్నీళ్లను అలలపై వదిలేస్తూ మరో దేశానికి.. మరో ఖండానికి వలస వెళ్లేందుకు సిద్ధమైంది. ప్రపంచంలోనే ముందస్తు ప్రణాళికతో వలస వెళ్తున్న తొలి దేశం తువాళు. దేశం మొత్తం వలస వెనుక కారణం.. సముద్ర మట్టం అంతకంతకూ పెరిగిపోతుండటం. మరో 25 ఏళ్లలో తువాళు దేశం సముద్ర గర్భంలో కలిసిపోనుందని గమనించి.. వలసకు ప్లాన్ చేస్తున్నారు పాపం ఆ దేశస్తులు.
తువాళు చిన్న ఐలాండ్ దేశం. తొమ్మిది ఐలండ్స్ తో కూడిన దేశం అది. అక్కడ 11 వేల మంది నివసిస్తుంటారు. సముద్ర మట్టానికి కేవలం రెండు మీటర్ల ఎత్తులో ఆ దేశం ఉంటుంది. పర్యావరణ మార్పుల కారణంగా మున్ముందు ఆ దేశంలో వరదలు, భారీ వర్షాలు, సముద్రమట్టం నేలను ముంచేసే ప్రమాదం ఉంది. రానున్న 80 ఏళ్లలో ఈ ఐలండ్స్ కనుమరుగవుతాయని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే రెండు దీవులు మునిగిపోయినట్లు చెబుతున్నారు.
నాసా విడుదల చేసిన లేటెస్ట్ రిపోర్టు ప్రకారం.. తువాళులో సుముద్ర మట్టం 2023లో ఉన్నదానికంటే 15 సెంటీమీటర్లు పైకి వచ్చింది. ఈ లెక్కన 2050 వరకు ఈ ద్వీపం మునిగిపోనుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ఆస్ట్రేలియాతో మైగ్రేషన్ ఒప్పందం:
తువాళు దేశం త్వరలో మునిగిపోనుందనే హెచ్చరికలతో ఆ దేశం ఆస్ట్రేలియాతో ఒప్పందం చేసుకుంది. 2023లో ఫలెపిలి ట్రీటీ (Falepili Union Treaty in 2023) ప్రకారం దేశం అంతా ఆస్ట్రేలియాకు వసల వెళ్లేందుకు ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం ప్రతీఏటా 280 మంది తువాలియన్స్ కు ఆస్ట్రేలియా శాస్వత పౌరసత్వాన్ని కల్పిస్తుంది. హెల్త్, ఎడ్యుకేషన్, ఇళ్లు, ఉద్యోగాలు కల్పిస్తూ వారికి పౌరసత్వం కల్పిస్తోంది ఆస్ట్రేలియా.
మొదటి దశ వలస కార్యక్రమం 2025 జూన్ 16 నుంచి జులై18 వరకు చేపట్టారు. దీనికి భారీ రెస్పాన్స్ వచ్చినట్లు తువాళులో ఉన్న ఆస్ట్రేలియన్ హై కమిషన్ పేర్కొంది. శాస్వత పౌరసత్వం కోసం 8 వేల750 రిజిస్ట్రేషన్లు వచ్చినట్లు పేర్కొన్నారు. ఈ ఏడాదిలో ఆస్ట్రేలియా, న్యూజీలాండ్ దేశాలకు 4 శాతం జనాభా వలస వెళ్లనుందట. ఈ పదేళ్లలో 40 శాతం జనాభా తువాళును ఖాలీ చేయనుంది.
పర్యావరణ ప్రభావంతో ఒక దేశమే.. (చిన్న దేశమైనా) వలస వెల్లడం ఆలోచించాల్సిన విషయం. విపరీతమైన కర్బన ఉద్గారాలు, పెరిగిపోతున్న జనాభా, పెట్రోల్ డీజిల్, బొగ్గు, రబ్బర్, ప్లాస్టిక్ తదితర ఉత్పత్తులతో విడుదలవుతున్న కర్బన రసాయన ఉద్గారాలు, ఓజోన్ పొర చిల్లు పడటం.. ఫలితంగా మంచు కొండలు కరుగుతుండటంతో సముద్రమట్టం పెరుగుతూ పోతోంది. ఇది ఇలాగే కొనసాగితే.. ఇవాళ తువాళు అనే చిన్న దేశం.. కానీ భవిష్యత్తులో పెద్ద పెద్ద దేశాలకు కూడా ఈ పరిస్థితి రావచ్చు. కానీ ఈ పరిస్థితిని అధిగమించేందుకు ప్రపంచ దేశాలు ఏం చేస్తాయనేదే ఆలోచించాల్సిన విషయం.