సర్కారు దవాఖాన్లల్ల గోలీల్లేవ్.. సూదుల్లేవ్!

సర్కారు దవాఖాన్లల్ల  గోలీల్లేవ్.. సూదుల్లేవ్!

(వెలుగు, నెట్​వర్క్): రాష్ట్రంలోని చాలా సర్కారు దవాఖాన్లలో సరిపడా మందుల్లేవు. ఇండెంట్​ ప్రకారం నార్మల్​ మెడిసిన్​ రాక,  ఎమెర్జెన్సీ మెడిసిన్​ కొనేందుకు డబ్బులు లేక డాక్టర్లు తలలు పట్టుకుంటున్నారు.  ఆర్థికంగా భారమైనా తప్పనిసరి పరిస్థితుల్లో పేషెంట్లు ప్రైవేటు మెడికల్​ షాపుల్లో కొంటున్నారు. పలు హాస్పిటల్స్​లోనైతే.. వాడి పడేసే డిస్పోజబుల్​ సిరంజీలు, మెడికల్​ స్టాఫ్​ చేతులకు వేసుకునే గ్లోవ్స్​కు కూడా దిక్కు లేదు. చివరికి రిమ్స్​ వంటి హాస్పిట్​లో కూడా  సిరంజీలు లేవు. మందుల కొనుగోలుకు రాష్ట్ర ప్రభుత్వం సరిగా నిధులు కేటాయించకపోవడంతోనే ఈ పరిస్థితి నెలకొందని మెడికల్​ స్టాఫ్​ అంటున్నారు.

ఇండెంట్లలో కోత

సాధారణంగా తెలంగాణ స్టేట్​ మెడికల్​ సర్వీసెస్​ అండ్​ ఇన్​ఫ్రాస్ట్రక్చర్​ డెవలప్​మెంట్​ కార్పొరేషన్ (టీఎస్​ఎంఎస్​ఐడీసీ​) ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ దవాఖానలకు అవసరమైన మెడిసిన్స్​ కొని జిల్లాల్లోని డ్రగ్​స్టోర్స్​కు పంపిస్తారు. అక్కడి నుంచి అన్ని రకాల ప్రభుత్వ హాస్పిటల్స్​కు సప్లయ్​ చేస్తారు. ఇందుకోసం ఆయా హాస్పిటల్స్​ సూపరింటెండెంట్లు నెల నెలా ఇండెంట్​ పెడుతారు. ఇవి కాకుండా రేర్​ కేసుల్లో అవసరమైన మెడిసిన్స్​​ను బయట ప్రైవేట్​ మెడికల్​ షాపుల్లో  కొనుగోలుకు సూపరింటెండెంట్లకు అనుమతిస్తారు. హాస్పిటల్​ స్థాయిని బట్టి ఈ లిమిట్​ఆధారపడి ఉంటుంది. కాగా,  నార్మల్​ మెడిసిన్స్​​ కోటాలో కోత పెడుతుండడంతో సూపరింటెండెంట్లు కొద్ది నెలలుగా అత్యవసర మందులతోపాటు సాధారణ మందులనూ ప్రైవేట్​ మెడికల్​ షాపుల్లో ఉద్దెరకు తెస్తున్నరు.  అనేక హాస్పిటళ్లలో ఈ లిమిట్​ కాస్త మించి క్రెడిట్​పై ఇచ్చేందుకు ఎవరూ ముందుకురావడం లేదు.

నిధులు లేకే..

మెడిసిన్​ కొనుగోలు బడ్జెట్​కు రాష్ట్రప్రభుత్వం రెండేండ్లుగా కోత పెడుతోంది. 2018‌‌‌‌‌‌‌‌–19 బడ్జెట్​లో రూ. 332 కోట్లు కేటాయిస్తే.. 2019–20 బడ్జెట్​లో కేవలం రూ.226 కోట్లు కేటాయించింది. ఇందులో 20శాతం మొత్తాన్ని ఎప్పట్లాగే ఆయా హాస్పిటల్స్​కు ఇవ్వాల్సి ఉంటుంది. మిగిలిన 80 శాతం నిధుల్లోంచే టీఎస్​ఎంఎస్​ఐడీసీ మందులు కొని, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న డ్రగ్​స్టోర్స్​కు పంపిస్తుంది. ఈ మెడిసిన్​ కాకుండా రేర్​ కేసుల్లో అవసరమైన ఇతర మెడిసిన్​ కొనేందుకు హాస్పిటల్స్​కు కేటాయించిన 20శాతం నిధులను ఆయా సూపరింటెండెంట్లు వాడుకోవచ్చు. గత ఫైనాన్సియల్​ ఇయర్​తో పోల్చినప్పుడు ఏకంగా రూ. 106 కోట్లు తగ్గడంతో ఆమేరకు టీఎస్​ఎంఎస్​ఐడీసీ సరిపడా మందులు కొనుగోలుచేయలేకపోయింది. ప్రస్తుత కొరతకు ఇదే ప్రధాన కారణంగా తెలుస్తోంది.

రిమ్స్ లో సిరంజీలు కూడా లేవు

ఉమ్మడి ఆదిలాబాద్​ జిల్లాలోని నిరుపేద రోగులకు పెద్దిదిక్కుగా ఉన్న రాజీవ్​గాంధీ ఇనిస్టిట్యూట్​ ఆఫ్​  మెడికల్​ సైన్సెస్​ (రిమ్స్​) హాస్పిటల్​లో పీహెచ్​సీ స్థాయి ట్రీట్​మెంట్​ కూడా అందడం లేదు. ఇక్కడి ఏజెన్సీ ప్రాంతంలో మహిళలు రక్తహీనతతో బాధపడుతుంటారు. కానీ కనీసం పేషెంట్లకు సెలైన్​ పెట్టేందుకు, ఇంజెక్షన్లు ఇచ్చేందుకు అవసరమైన ఐవీ క్యాన్యులా 20, 22 లు  కూడా అందుబాటులో లేవు. ఎవరైనా రక్తదానం చేసేందుకు ముందుకు వస్తే కనీసం రక్తం తీసుకునేందుకు సిరంజీలు కూడా గతిలేని పరిస్థితి. ఇక న్యూట్రోఫిల్, సిటికోలిన్​, హెపారిన్​, ఎంవీఐ,  35 డెక్సాటైన్​, డోపామైన్​, రాటడేల్​లాంటి అత్యవసరమై మెడిసిన్​ కూడా లేదు. వీటిని కొనుగోలు చేయాలని రిమ్స్​  మెడిసిన్​ డిపార్ట్​మెంట్​ ఉద్యోగులు సూపరింటిండెంట్​కు ఇండెంట్​ పెట్టారు. కానీ సూపరింటెండెంట్​ పోస్టు ఖాళీగా ఉండటంతో నెల రోజులుగా ఎలాంటి మెడిసిన్​ కొనుగోలు చేయడం లేదు. ఫలితంగా డాక్టర్లు బయట మందులు కొనుక్కోవాలని రోగులకు రాసిస్తున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో భారమైనప్పటికీ రోగులు కొనుగోలు ప్రైవేటు మెడికల్​ షాపులను ఆశ్రయిస్తున్నారు.

ఎక్కడ చూసినా నో స్టాక్​!

మెదక్​లోని జిల్లా కేంద్ర ఆసుపత్రి, నర్సాపూర్ ఏరియాఆస్పత్రి, తూప్రాన్ ఏరియా ఆస్పత్రికి రెండు, మూడు నెలలుగా మందులు, ఆపరేషన్ థియేటర్ మెటీరియల్ సరఫరా కావడం లేదు. ఐవీ ఫ్లూయిడ్స్​, సిరంజీలు, మందులు ప్రైవేట్ మెడికల్ షాప్ ల నుంచి ఉద్దెర తెస్తున్నారు. చిన్న పిల్లలకు సంబంధించిన మందుల స్టాక్​ లేదు. మెదక్​లోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో  మూడు నెలలుగా ఎక్స్​రే ఫిల్మ్​ కొరత  నెలకొంది. అవసరమైన వారికి డిజిటల్​ ఎక్స్​ రే మిషిన్​తో ఎక్స్​రే తీసి, స్మార్ట్​ ఫోన్​తో ఫొటో తీసి సంబంధిత డాక్టర్​కు వాట్సప్​ చేస్తున్నారు. దాన్ని చూసి డాక్టర్లు  ట్రీట్​మెంట్​ చేస్తున్నారు.

జనగామ  జిల్లా ఆస్పత్రిలో గత నెల 27 నుంచి  సిరంజీల కొరత వెంటాడుతున్నది. వరంగల్  సెంట్రల్ డ్రగ్ స్టోర్ నుంచి  సప్లయ్​ లేకపోవడంతో ఇప్పటివరకు ఆస్పత్రి ఎమర్జెన్సీ ఫండ్  నుంచి పదివేల రూపాయలతో  సిరంజీలను కొన్నారు.

కరీంనగర్ సివిల్ హాస్పిటల్​లో ఫిట్స్ కంట్రోల్​ మెడిసిన్​ లేదు. చిన్నపిల్లలకు మోషన్స్ తగ్గడానికి  ఇచ్చే  సిరప్స్, స్పోర్​లాక్, యాంటి బయాటిక్స్  అందుబాటులో లేవు. బలానికి వాడే జింకోవిట్ సిరప్, అస్తమా రోగులకు సంబంధించిన ఫోరోకార్ట్, రోటో క్యాప్ కూడా స్టాక్​ లేదు.

నాగర్​కర్నూల్​ జిల్లా దవాఖానకు రెండు నెలలనుంచి మందులు సరఫరా కావడంలేదు.  ఇటీవల ఆర్ఎల్ గ్లూకోజ్​లో ఫంగస్​ను గుర్తించిన డాక్టర్లు స్టాక్​ను తిప్పిపంపించారు. అప్పటి నుంచి మళ్లీ స్టాక్‌‌‌‌ రాలేదు. గ్లౌస్, ఐరన్ టాబ్లెట్స్​, కాల్షియం టాబ్లెట్స్, డిస్పోజబుల్‌‌‌‌ సిరంజీలు కూడా అందుబాటులో లేవు. అత్యవసర మందుల కొనుగోలు కోసం 4 నెలలనుంచి నిధులు ఇవ్వడం లేదు. ఆపరేషన్ల కోసం రూ. 16 లక్షల విలువైన మందులను బయటి నుంచి కొన్నామని, ప్రైవేట్​ మెడికల్​ షాపుల్లో రూ. 10లక్షల దాకా ఉద్దెర పెట్టామని డాక్టర్లు చెబుతున్నారు.

భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ కమ్యూనిటీ హెల్త్​ సెంటర్​లో 2 ఎంఎల్, 5 ఎంఎల్ సిరంజీలు రెండు నెలలుగా లేవు. ఆర్ ఎల్ బాటిల్స్ కొరత ఉన్నది. గర్భిణులకు ఇవ్వాల్సిన క్యాల్షియం టాబ్లెట్లు లేవు. సీబీపీ టెస్టులకు సంబంధించి రూ. 70 వేల విలువైన కెమికల్స్​ ఉద్దెరకు తీసుకున్నట్లు డాక్టర్లు చెప్పారు.

నిర్మల్​ సర్కారు దవాఖానను కుక్కకాటు, పాము కాటు ఇంజెక్షన్ల కొరత వేధిస్తోంది. అత్యవసర పరిస్థితుల్లో ప్రైవేట్​ మెడికల్​షాపుల్లో కొని రోగులకు వేస్తున్నట్లు డాక్టర్లు తెలిపారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం, అశ్వారావుపేట, మణుగూరు, పాల్వంచ, భద్రాచలం దవాఖానల్లో  సిరంజీలు రెండు నెలలుగా అందుబాటులో లేవు.  ఫ్లూయిడ్స్  20 శాతం మాత్రమే సరఫరా చేస్తున్నారు. యాంటీ బయాటిక్స్, యాంటీ రేబిస్ మందుకు కొరత ఉంది. కొత్తగూడెం హాస్పిటల్​లోనే నెలకు 170 నుంచి 200 వరకు యాంటీ రేబిస్ వాక్సిన్లు అవసరం కాగా, 40 వ్యాక్సిన్లనే సరఫరా చేస్తున్నారు.

వనపర్తి జిల్లా సర్కారు దవాఖానలో సాధారణ మందుల కొరత లేదు. కానీ  15 రోజులుగా సెలైన్​ బాటిళ్ల సరఫరా లేదు.  దీంతో రేవల్లి సీహెచ్ సీలో ఉన్న స్టాక్ ను వనపర్తికి తరలించారు. అత్యవసర మందులను కొని రోగులకు అందిస్తున్నట్టు, బిల్లులను వైద్య విధాన పరిషత్​కు పంపుతున్నట్టు ఇక్కడి డాక్టర్లు తెలిపారు.

గద్వాల జిల్లా హాస్పిటల్​లో సిరింజీల కొరత నెలకొంది. సర్జరీ సమయంలో వాడే కిటమిన్, పెంటకోఫిన్, ల్యాబొటమిల్, సుటిప్యాక్ లాంటి డ్రగ్స్​ సరఫరా చేయడం లేదు. రూ. 1.50 లక్షలు పెట్టి మందులు బయట నుంచి కొనుగోలు చేశారు.

జగిత్యాల ఆస్పత్రిలో 14 రకాల మందుల్లేవు.మంచిర్యాల జిల్లా హాస్పిటల్ లో హాస్పిటల్​ ఫండ్​ నుంచే యాంటీబయాటిక్స్ కొంటున్నారు.  సిరంజీలు, గ్లౌవ్స్​, ఐవీ క్యాన్ల సరిపడా సప్లయ్​ లేకపోవడంతో బయట నుంచి తెప్పిస్తున్నారు.

నిజామాబాద్ జిల్లా బోధన్ గవర్నమెంట్ హాస్పిటల్ లో  పెయిన్​ కిల్లర్లు,  కుక్క కాటు మందులు లేవు.

పెద్దపల్లి హాస్పిటల్​లో కుక్కకాటుకు ఇచ్చే ఇంజక్షన్​తోపాటు 35రకాల మందులు  లేవు.

మిర్యాలగూడ ఏరియా హాస్పిటల్లో గర్భిణులకు   ఐరన్,  ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్లు అందుబాటు లేవు. చిన్నపిల్లలకు ఇచ్చే డొమెస్టయిల్ సిరప్ లేదు. యాంటీ రెబీస్ వ్యాక్సిన్​కు కొరత ఉంది.

కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా ఆస్పత్రుల్లో  ఎపిడోస్,  విటమిన్ – కె, లాసెక్సి, మెగ్నీషియం, ట్యాగ్ జన్ ఇంజక్షన్లు,  జేలోకేన్ క్యాపుల్స్ అందుబాటులో లేవు.