
నవంబర్ నాటికి కరోనా వైరస్ వ్యాక్సిన్ అందుబాటులో వచ్చే అవకాశంలేదని, కనీసం నాలుగు సంవత్సరాల సమయం పడుతున్నట్లు హిందుస్థాన్ టైమ్స్ ఓ కథనాన్ని ప్రముఖంగా ప్రచురించింది.
ప్రపంచ దేశాల ప్రజలు కరోనా వ్యాక్సిన్ ఎప్పుడు వినియోగంలోకి వస్తుందా అని వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఓ వైపు సైంటిస్ట్ లు సైతం అక్టోబర్ నాటికి వ్యాక్సిన్ ను అందుబాటులోకి తెస్తామని హామీ ఇస్తున్నారు. కానీ వ్యాక్సిన్ అందుబాటులోకి రావడానికి సుమారు నాలుగు సంవత్సరాల సమయం పడుతుందని బయోకాన్ ఎగ్జిక్యూటీవ్ చైర్ పర్సన్ కిరణ్ మజుందార్ షా తెలిపారు.
క్రాప్ గిని సంస్థ నిర్వహించిన బిజినెస్ మోడల్ పాస్ట్ కోవిడ్ -19 వెబినార్ లో ప్రసంగించారు. వెబినార్ లో కరణ్ మజుందార్ షా మాట్లాడుతూ సురక్షితమైన వ్యాక్సిన్ తయారు చేయడం అంత ఈజీ కాదని, ఏడాది లోపే టీకాను అభివృద్ధి చేయడం అసాధ్యమంటూ అభిప్రాయం వ్యక్తం చేశారు. వ్యాక్సిన్‌కు భద్రత, తగినంత సామర్థ్యం ఉండాలంటే పలు ప్రక్రియలు అవసరమని ఆమె పేర్కొన్నారు. కాబట్టి సురక్షితమైన వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చేంత వరకు చాలా జాగ్రత్తగా ఉండాలని అన్నారు.
ఇందులో భాగంగా ప్రజలు కరోనా వైరస్ ను ఎలా ఎదుర్కొవాలో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. దీనికి తోడు కేంద్ర రాష్ట్రప్రభుత్వాలు హెల్త్ కేర్ రంగం పై దృష్టిసారించడం వల్ల దేశాన్ని సురక్షితంగా కాపాడుకోవచ్చని బయోకాన్ ఎగ్జిక్యూటీవ్ చైర్ పర్సన్ కిరణ్ మజుందార్ షా చెప్పారు.