
లక్నో: బాలీవుడ్ నటి దిశా పటానీ ఇంటిపై కాల్పులు కలకలం రేపాయి. గురువారం (సెప్టెంబర్ 11) అర్ధరాత్రి ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ సివిల్ లైన్స్‌లోని దిశా ఇంటి ముందు గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారు. ఈ కాల్పులకు గోల్డీ బ్రార్ గ్యాంగ్ బాధ్యత వహించింది. దిశా పటానీ ఇంటిపై కాల్పులు తామే జరిపామని ఒప్పుకుంది.
దిశా పటానీ సోదరి ఖుష్బూ పటానీ హిందూ సాధువులు ప్రేమానంద్ మహారాజ్, అనిరుద్ధాచార్య మహారాజ్‌లను అవమానించారని.. అందుకే ఈ పని చేశామని గోల్డీ బ్రార్ గ్యాంగ్ స్పష్టం చేసింది. హిందు మతం, సనాతన ధర్మాన్ని ఎవరూ కించపర్చినా ఇదే పరిస్థితి ఎదురైతుందని హెచ్చరించారు.
పోలీసుల వివరాల ప్రకారం.. గురువారం (సెప్టెంబర్ 11) అర్థరాత్రి రాయ్‌బరేలీ సివిల్స్ లైన్స్‌లోని నటి దిశా పటానీ ఇంటి వెలుపల కాల్పులు జరిగాయని తెలిపారు. గుర్తు తెలియని దుండగులు మూడు నుంచి నాలుగు రౌండ్లు కాల్పులు చేశారని చెప్పారు.
ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని సమాచారం. దిశా ఇంటిపై కాల్పులు జరిపిన నిందితుల కోసం దర్యాప్తు మొదలుపెట్టినట్లు పోలీసులు తెలిపారు. నిందితులను పట్టుకోవడానికి ఐదు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని చెప్పారు పోలీసులు. దిశా పటానీ ఇంటి దగ్గర భద్రతను పెంచినట్లు వెల్లడించారు.