
GST on old gold jewellery: నవరాత్రి సమయంలో చాలా మంది బంగారం, వెండి వస్తువులు ఆభరణాలు షాపింగ్ చేసేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. ఈ క్రమంలో అనేక మంది తమ పాత బంగారాన్ని అమ్మేసి దానికి బదులుగా కొత్త బంగారం కొంటుంటారు. మరికొందరు గోల్డ్ షాపు వారికే ఎక్స్ఛేంజ్ ఆఫర్ కింద వాటిని ఇచ్చేసి కొత్తగా తీసుకునే బంగారంలో దానికి తగ్గింపులను అందుకుంటుంటారు. అయితే అసలు పాత బంగారు ఆభరణాలు అమ్మేసినప్పుడు దానిపై కూడా జీఎస్టీ చెల్లించాలా అనే అనుమానం చాలా మందిలో ఉంది.
ధరలు అధికంగా ఉన్న సమయంలో బంగారం కొనుగోలుపై 3 శాతం జీఎస్టీ రేటు అమలులో ఉన్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 22న కొత్త రేట్లు వచ్చినప్పటికీ దీనిపై ఎలాంటి మార్పులు ప్రకటించలేదు. బంగారం అమ్మే షాపు వాడికి సామాన్య ప్రజలు తమ పాత బంగారాన్ని అమ్మితే దానిపై ఎలాంటి జీఎస్టీ చెల్లించాల్సిన అవసరం లేదని చట్టం చెబుతోంది. అయితే బంగారం అమ్మే రిజిస్టర్ అయిన లేదా రిజిస్టర్ కాని వ్యాపారులు ఇలా చేస్తే మాత్రం జీఎస్టీ తప్పక కట్టాల్సిందే 3 శాతం చొప్పున.
వ్యక్తులు తమ పాత బంగారాన్ని విక్రయించటం వ్యాపార పురోగతి కిందకు వస్తుందని చెప్పలేమని.. కాబట్టి దానిని సరఫరాగా జీఎస్టీ కింద తీసుకోవటానికి కుదరదని అందువల్ల దానిని పన్ను పరిధిలోకి తీసుకురావటం కుదరదని ప్రభుత్వం అధికారిక వివరణలో వెల్లడించింది. కానీ బంగారు వ్యాపారులు లేదా ఆభరణాలు అమ్మే వ్యక్తులు ఇలాంటి బంగారాన్ని అమ్మితే అది సరఫరా కిందికి వస్తుందని అందువల్ల రివర్స్ ఛార్జ్ కింద GST వర్తిస్తుందని ప్రభుత్వం వెల్లడించింది. అంటే సాధారణ వ్యక్తులు అమ్మే పాత బంగారం జీఎస్టీ పరిధిలోకి రాదని గుర్తుంచుకోవాలి.