ఇసొంటి పాలకులు ఆనాడు ఉంటే..

ఇసొంటి పాలకులు ఆనాడు ఉంటే..

ముషీరాబాద్ (హైదరాబాద్), వెలుగు: తెలంగాణ సమాజాన్ని ప్రశ్నించే తత్వం నుంచి బానిసత్వంలోకి తెచ్చిన ఘనత సీఎం కేసీఆర్ దేనని బీజేపీ నేత, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మండిపడ్డారు. తెలంగాణ ప్రజలు ఆకలినైన భరిస్తారు.. కానీ ఆత్మగౌరవాన్ని కోల్పోరన్నారు. ఇసొంటి పాలకులు ఆనాడు ఉంటే.. తెలంగాణ ఉద్యమమే ఉండేది కాదన్నారు. తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఆదివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఈటల మాట్లాడారు. తెలంగాణ ఉద్యమానికి కీలకమైన ధర్నా చౌక్ నే ఎత్తేసిన పరిస్థితి టీఆర్ఎస్ పాలనలో చూశామన్నారు. ఆనాటి స్ఫూర్తి ఏమైంది?: కోదండరాం సమావేశంలో టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ.. ఉద్యమ స్ఫూర్తిని కాపాడాలని నాడు అంతా ఏకమయ్యామని, ఈనాడు ఆ స్ఫూర్తి ఏమైందని ప్రశ్నించారు.

ఎంపీ ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ.. తెలంగాణ ఆకాంక్షలు నెరవేరాలంటే మళ్లీ ఉద్యమం రావాలన్నారు. ఉద్యమకారుల సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని ఫోరం చైర్మన్ చీమ శ్రీనివాస్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నేత చెరుకు సుధాకర్, మాజీ ఎమ్మెల్సీలు రాములు నాయక్, దిలీప్ కుమార్, టీజేఏసీ చైర్మన్ కోలా జనార్దన్, డాక్టర్ కాచం సత్యనారాయణ గుప్తా, సీనియర్ జర్నలిస్ట్ పల్లె రవికుమార్ గౌడ్, ఫోరం ప్రధాన కార్యదర్శి సురేందర్ రెడ్డి పాల్గొన్నారు.