ఉమ్మడి మెదక్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి మెదక్ జిల్లా సంక్షిప్త వార్తలు

కాళేశ్వరం నీళ్లు వస్తుంటే రాలేదనడమేంటి?

సిద్దిపేట రూరల్, వెలుగు : కాళేశ్వరం నీళ్లు వచ్చాయో? లేదో తెలియాలంటే బీజేపీ, కాంగ్రెస్ నాయకులను రాజగోపాల్ పేట చెరువులో ముంచాలని మంత్రి హరీశ్ రావు అన్నారు. బరువు మోసేటోళ్లకు  తెలుస్తుంది కానీ, ఢిల్లీలో,  గాంధీ భవన్ లో కూర్చొని మాట్లాడేవాళ్లకు ఏం తెలుస్తుందన్నారు. బుధవారం నంగునూరు మండలం రాజగోపాల్ పేట గ్రామంలో గంగమ్మ గుడిలో ప్రత్యేక పూజలు చేశారు. సమీకృత మత్స్య అభివృద్ధి పథకం ద్వారా 100 శాతం సబ్సిడీపై గ్రామ పరిధిలోని పెద్ద చెరువులో చేప పిల్లలను వదిలారు. సిద్ధన్నపేట గ్రామంలో 1,117 మంది లబ్ధిదారులకు కొత్తగా మంజూరైన ఆసరా పింఛన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా  ఆయన మాట్లాడుతూ యాసంగిలో బోర్లు వెళ్లబోశాయని, ఇప్పుడు అసలు బోరు బండ్లే కనిపిస్తలేవని, ఇది కాళేశ్వరం ప్రాజెక్టు పుణ్యమే అన్నారు. దేశంలో 16 చోట్ల డబుల్ ఇంజన్ అంటూ బీజేపీ గొప్పలు చెప్పుకుంటోందని, ఎక్కడైనా రూ.2వేల పింఛన్, 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తోందా అని ప్రశ్నించారు. అనంతరం జిల్లా కేంద్రంలోని క్యాంపు ఆఫీస్ లో సిద్దిపేట అర్బన్ మండలంలోని 137 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను అందజేశారు. అంతకుముందు పట్టణంలోని పద్మానాయక గార్డెన్ లో సిద్దిపేట అర్బన్, రూరల్ మండల పరిధిలోని ఆయా గ్రామాల లబ్ధిదారులకు ఆసరా పింఛన్ కార్డులను పంపిణీ చేశారు. ఆయన వెంట అడిషనల్​ కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్, సుడా చైర్మన్ రవీందర్ రెడ్డి, రూరల్ మండల ఎంపీపీ గన్నమనేని శ్రీదేవి చందర్ రావు ఉన్నారు. 

బీజేపీని చూసి భయపడుతున్న కేసీఆర్

కోహెడ(బెజ్జంకి), వెలుగు : తెలంగాణలో బీజేపీకి ప్రజల ఆదరణ పెరుగుతుండటం చూసి సీఎం కేసీఆర్​ భయపడుతున్నారని బీజేపీ నేత, మాజీ మంత్రి బాబు మోహన్ ​అన్నారు. బుధవారం బీజేపీ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో బెజ్జంకి మండలంలో పలు గ్రామాల్లో ప్రజాగోస -బీజేపీ భరోసా యాత్ర కొనసాగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్​కు ప్రజల్లో ఉన్న వ్యతిరేకత స్పష్టంగా అర్థమైందన్నారు. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలను గాలికొదిలేసి స్వార్థ రాజకీయాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. సిద్దిపేట జిల్లాలో బెజ్జంకి మండలాన్ని కలిపి ఏం అభివృద్ధి చేశారని నిలదీశారు. తోటపల్లి  ప్రాజెక్టు భూనిర్వాసితుల సమస్య గోడు టీఆర్ఎస్ ప్రభుత్వానికి కనబడడం లేదా అని ప్రశ్నించారు. ఈ  ప్రాంత అభివృద్ధిపై మంత్రి హరీశ్​రావు, ఎమ్మెల్యే రసమయి బాలకృష్ణకు చిత్తశుద్ధి ఉంటే వెంటనే అభివృద్ధి పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో లీడర్లు శ్రీనివాస్ గౌడ్, మహిపాల్ రెడ్డి, మండల అధ్యక్షుడు దోనె అశోక్, నాయకులు పాల్గొన్నారు.

కేసీఆర్ కుటుంబానికి త్వరలోనే జైలు!

కొండాపూర్, వెలుగు : లక్షల కోట్ల అవినీతికి పాల్పడిన కేసీఆర్ కుటుంబానికి సంకెళ్లు పడేకాలం దగ్గరలో ఉందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎండల లక్ష్మీనారాయణ అన్నారు. బుధవారం మండల పరిధిలోని మల్కాపూర్ నుంచి ప్రజా గోస బీజేపీ భరోసా యాత్ర పార్టీ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు నరేందర్ రెడ్డి, నియోజకవర్గ ఇన్​చార్జి రాజేశ్వరరావు దేశ్​పాండే ఆధ్వర్యంలో కొనసాగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాణ త్యాగాల మీద ఏర్పడిన రాష్ట్రంలో ప్రజలను మోసగించడమే లక్ష్యంగా సాగిన కేసీఆర్ పాలన కు చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు. హుజూరాబాద్ ఈటల రాజేందర్ రాజీనామాతో దళిత బంధుకు శ్రీకారం చుడితే, మునుగోడు లో రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో 57ఏళ్ల వారికి పింఛన్ల పేరుతో పది లక్షల మందికి కార్డులు పంపిణీ చేశారని ఆరోపించారు. అబద్ధాల కోరు ప్రభుత్వాన్ని ప్రజలు పాతాళానికి తొక్కడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్ నర్సారెడ్డి, నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి, జగన్, నెమలికొండ వేణుమాధవ్, సురేందర్ పాల్గొన్నారు. 

పేషెంట్లకు బెటర్​ ట్రీట్మెంట్​ అందించాలి

నారాయణ్ ఖేడ్, వెలుగు : హాస్పిటల్​లోని పేషెంట్లకు బెటర్ ​ట్రీట్మెంట్​ అందించాలని వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్ కుమార్ సంబంధిత ఆఫీసర్లను ఆదేశించారు. ఖేడ్ ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిని బుధవారం ఆయన తనిఖీ చేశారు. సిబ్బంది పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ల్యాబ్, ఆపరేషన్ థియేటర్, ఐసీటీసీ సెంటర్ తదితర విభాగాలను పరిశీలించారు. రోగులతో మాట్లాడారు. డెలివరీల సంఖ్య పెంచాలని గైనకాలజీ డాక్టర్లను ఆదేశించారు. ఖేడ్ సోషల్ వెల్ఫేర్ స్కూల్ స్టూడెంట్స్ 20 మంది వైరల్ ఫీవర్ తో హాస్పిటల్ లో జాయిన్ కాగా, వారిని పరామర్శించి బెటర్​ ట్రీట్మెంట్​ అందించాలన్నారు. ప్రభుత్వ హాస్పిటల్ లో పనిచేస్తున్న డాక్టర్లు ప్రైవేట్ హాస్పిటల్ లోనూ పనిచేస్తున్నారని తమ దృష్టికి వచ్చిందని, దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన్నారు. 

జోగిపేట ఏరియా ఆసుపత్రి సందర్శన

జోగిపేట, వెలుగు : జోగిపేటలోని ఏరియా ఆసుపత్రిని అజయ్ కుమార్ సందర్శించారు. రోగులకు అందుతున్న సేవలను, సౌకర్యాలపై ఆరా తీశారు. సిబ్బంది సమయపాలన పాటించే విధంగా ఆసుపత్రుల్లో బయోమెట్రిక్‌‌‌‌ విధానాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. హాస్పిటల్​లో మినరల్‌‌‌‌ వాటర్‌‌‌‌ ప్లాంట్‌‌‌‌కు ప్రతిపాదనలు ఇవ్వాలని, ఇంకా ఏమైనా సమస్య ఉంటే నివేదిక ద్వారా అందించాలని సూపరింటెండెంట్‌‌‌‌ డాక్టర్‌‌‌‌ రమేశ్​ను ఆదేశించారు. రోగులకు ఇబ్బంది కలుగకుండా వైద్య సేవలందించాలని, విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. 

కేసుల్లో పక్కాగా ఇన్వెస్టిగేషన్ ఉండాలి

సిద్దిపేట రూరల్, వెలుగు : కేసుల్లో శిక్షల శాతం పెంచాలని, ప్రతి కేసులో పక్కాగా ఇన్వెస్టిగేషన్ ఉండాలని సిద్దిపేట సీపీ ఎన్. శ్వేత సంబంధిత అధికారులకు సూచించారు. బుధవారం సిద్దిపేట సీపీ ఆఫీస్ లో గజ్వేల్, హుస్నాబాద్ డివిజన్ల పోలీస్ ఆఫీసర్లతో పెండింగ్ కేసులపై సమీక్ష నిర్వహించారు. పెండింగ్ ఉన్న కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. పోక్సో, ఎస్సీ ఎస్టీ కేసులను స్పీడ్​గా ఇన్వెస్టిగేషన్ చేసి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేయాలన్నారు. గంజాయి, గుట్కా, పేకాటపై స్పెషల్​ ఫోకస్​ పెట్టి పూర్తిగా నిర్మూలించాలని చెప్పారు.  క్రైమ్ వర్టికల్, టెక్ టీమ్, స్టేషన్ రైటర్, కోర్టు డ్యూటీ ఆఫీసర్ తదితర వర్టికల్ విధులు నిర్వహించే సిబ్బందికి తరచూ శిక్షణ తరగతులు నిర్వహించి వారి పనితనాన్ని  మెరుగుపర్చాలని సూచించారు. సమావేశంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ మహేందర్, ఏసీపీలు రమేశ్, సతీశ్, ట్రాఫిక్ ఏసీపీ ఫణిందర్, సీఐలు వీరాప్రసాద్, కమలాకర్, శ్రీనివాసులు, కిరణ్, సీసీఆర్బీ సీఐ సైదా నాయక్, మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్​పెక్టర్ దుర్గ, ఎస్బీ ఇన్స్​పెక్టర్ రఘుపతి రెడ్డి పాల్గొన్నారు.

అభివృద్ధికి కేరాఫ్ తెలంగాణ

జగదేవపూర్(కొమురవెల్లి), వెలుగు : అభివృద్ధి కేరాఫ్ తెలంగాణ రాష్ట్రమని, టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతోందని ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. బుధవారం జగదేవపూర్ మండల కేంద్రంలోని ఎస్వీ ఫంక్షన్ హాల్ లో కొత్తగా మంజూరైన 1065 ఆసరా పింఛన్​ పత్రాలను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతినెలా  పింఛన్లు అందించడంతో వృద్ధులకు, వికలాంగులకు, ఒంటరి మహిళలకు ఎంతో భరోసా కలుగుతోందని తెలిపారు. కాళేశ్వరం కాల్వతో సాగునీరు అందుతుండటంతో రైతులకు నీటి తిప్పలు తప్పిందన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ యాదవరెడ్డి, డీసీసీబీ చైర్మన్ దేవేందర్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, గజ్వేల్ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్, ఎంపీపీ బాలేశం గౌడ్, జడ్పీటీసీ సుధాకర్ రెడ్డి, పీఏసీఏస్ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ రంగారెడ్డి, నాయకులు పాల్గొన్నారు. 

అక్రమంగా తరలిస్తున్న బియ్యం పట్టివేత

జహీరాబాద్/నారాయణ్ ఖేడ్/కోహెడ(హుస్నా బాద్), వెలుగు :  సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాలో మూడుచోట్ల అక్రమంగా తరలిస్తున్న రేషన్ ​బియ్యాన్ని ఆఫీసర్లు పట్టుకున్నారు.  జహీరాబాద్​ పరిధిలో ఏడు లారీలలో గుజరాత్ కు తరలిస్తున్న 120  టన్నుల రేషన్ బియ్యాన్ని పోలీసులు, సివిల్ సప్లై అధికారులు సీజ్ చేశారు.  బుధవారం జహీరాబాద్ సీఐ తోట భూపతి ఆధ్వర్యంలో చిరాక్ పల్లి, కోహిర్​ఎస్సైలు కాశీనాథ్, సురేశ్, సివిల్ సప్లై అధికారులు రెండు బృందాలుగా విడిపోయి నేషనల్ హైవే  కోహిర్ చౌరస్తా, జహీరాబాద్ మండలం సత్వార్ గ్రామ శివారు లోని కోహినూర్ దాబా వద్ద వాహనాలను తనిఖీ చేశారు. ఈ క్రమంలో కోహిర్ చౌరస్తా వద్ద నాలుగు లారీల బియ్యం, కోహినూర్ దాబా వద్ద మూడు లారీల రేషన్ బియ్యం పట్టుబడ్డాయి. ఏడు లారీలలో సుమారు 120 టన్నుల రేషన్ బియ్యాన్ని సీజ చేసి, లారీ డ్రైవర్లు, యజమానులపై కేసు నమోదు చేశారు. 

రెండు వాహనాలలో.. 

నారాయణఖేడ్ పరిధిలోని జూకల్ శివారులో నిలిచి  ఉన్న డీసీఎంను మంగళవారం రాత్రి బొలెరో వాహనం ఢీకొట్టింది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వాహనాలను పరిశీలించగా అందులో అక్రమంగా తరలిస్తున్న బియ్యం ఉన్నాయి. డీసీఎంలో 120 క్వింటాళ్లు, బొలెరోలో 40 క్వింటాళ్లను స్థానిక ఎమ్మార్వో  దశరథ్ సింగ్, ఎస్సై వెంకటరెడ్డి  స్వాధీనం చేసుకున్నారు. సివిల్ సప్లై డీటీ సాయి రవి వారిపై బుధవారం కేసు నమోదు చేశారు. 

హుస్నాబాద్​లో.. 

కోహెడ(హుస్నాబాద్​), వెలుగు: అక్రమంగా తరలిస్తున్న 130 క్వింటాళ్ల పీడీఎస్​ రైస్​ను పట్టుకున్నట్లు ఎస్సై శ్రీధర్​ తెలిపారు. ముల్కనూర్​ నుంచి హైదరాబాద్​కు డీసీఎం వ్యాన్​లో తరలిస్తున్నారనే పక్కా సమాచారంతో హుస్నాబాద్​లో పట్టుకున్నట్లు చెప్పారు. ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేసి దర్యప్తు చేస్తున్నామని తెలిపారు. 

డిగ్రీ నుంచే భవిష్యత్ ​లక్ష్యాలు నిర్ణయించుకోవాలి 

రామచంద్రాపురం (పటాన్​చెరు), వెలుగు:  డిగ్రీ సెకండ్​ ఇయర్​ నుంచే స్టూడెంట్స్ భవిష్యత్​ లక్ష్యాలను నిర్ణయించుకోవాలని, ప్రపంచ వ్యాప్తంగా ఉన్నతస్థాయి ఉద్యోగ అవకాశాలు ఎన్నో ఉన్నాయని లీడింగ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్​ కన్సల్టెన్సీ ఐఎంఎఫ్ఎస్ సీఈవో కేపీ సింగ్ అన్నారు. పటాన్​చెరు పరిధిలోని గీతం డీమ్డ్​ యూనివర్శిటీ బీటెక్, బీబీఏ, బీఎస్సీ, భీఫార్మసీ స్టూడెంట్స్​తో బుధవారం జరిగిన ఫేస్​టు ఫేస్ ఇంటరాక్షన్ మీటింగ్​లో ఆయన మాట్లాడారు. డిసెంబర్​ 2021 నాటికి అమెరికాలో 11 మిలియన్లకు పైగా, ఆస్ర్టేలియా, న్యూజిలాండ్​లో 5 లక్షలు, ఐరోపాలో మిలియన్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, విదేశీ విద్యనభ్యసించి ఉద్యోగం సంపాదించడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయని తెలిపారు. కార్యక్రమంలో గీతం రెసిడెంట్ డైరెక్టర్​ డీవీవీఎస్ఆర్​ శర్మ, జీసీబీసీ డైరెక్టర్ డాక్టర్ వేణుకుమార్ నాతి, ఫార్మసీ ప్రిన్సిపల్​ప్రొఫెసర్​జీఎస్ కుమార్, అర్కిటెక్చర్​ డైరెక్టర్​ సునీల్​ కుమార్, ఐఎంఎఫ్ఎస్ డైరెక్టర్​అజయ్​ కుమార్​ వేములపల్లి, గీతం లెర్నింగ్ అండ్ డెవలప్​మెంట్ ఆఫీసర్​ వేణుగోపాల్, లెర్నింగ్ అధికారి బీ.సంతోష్​ కుమార్​ పాల్గొన్నారు. 

గర్భిణులు బ్యాలెన్స్ డైట్​ తీసుకోవాలి

నారాయణ్ ఖేడ్, వెలుగు : గర్భిణులు బ్యాలెన్స్ డైట్ తీసుకుని, డాక్టర్లు చెప్పే సలహాలు సూచనలు పాటించాలని ఎమ్మెల్యే భూపాల్​రెడ్డి సూచించారు. బుధవారం నారాయణఖేడ్ పట్టణంలోని ఎంపీడీవో ఆఫీస్​ ఆవరణలో సీడీపీవో ఆధ్వర్యంలో  గర్భిణులకు ప్రోటీన్స్ ను అందజేశారు. నియోజకవర్గంలోని అన్ని సెక్టార్లలోని అంగన్ వాడీ ప్రాంతాల్లోని గర్భిణులకు పౌస్టిక ఆహారం, శుభ్రత విషయంపై ఏర్పాటు చేసిన అవేర్నెస్ ప్రోగ్రామ్​లో ఎమ్మెల్యే పాల్గొని పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ రాథోడ్ లక్ష్మీబాయి, నాయకులు రవీందర్ నాయక్, రమేశ్ చౌహాన్, అంగన్ వాడీ పీడీ, సీడీపీవో పాల్గొన్నారు.  

నంగునూరు ఎమ్మార్వో ఆఫీస్ ను తనిఖీ చేసిన కలెక్టర్

సిద్దిపేట రూరల్, వెలుగు : నంగునూరు ఎమ్మార్వో ఆఫీస్ ను బుధవారం సిద్దిపేట కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిబ్బందితో మాట్లాడి రికార్డు, వీడియో కాన్ఫరెన్స్, రిజిస్ట్రేషన్ గదులను పరిశీలించారు. రికార్డులను జాగ్రత్తగా భద్రపర్చాలని, రిజిస్ట్రేషన్ ప్రక్రియ సక్రమంగా జరపాలని సిబ్బందికి సూచించారు. ఆఫీస్ పాతదైనందున ఇప్పటికే పనులు ప్రారంభించిన కొత్త భవనాన్ని త్వరగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్ ను ఫోన్ లో ఆదేశించారు. 

భవిష్యత్​కు బాటలు వేస్తున్న గురుకులాలు 

మెదక్ (కౌడిపల్లి), వెలుగు: గురుకులాలు విద్యార్థుల భవిష్యత్​కు బాటలు వేస్తున్నాయని నర్సాపూర్​ఎమ్మెల్యే మదన్ రెడ్డి అన్నారు. కౌడిపల్లి మండలం తునికిలోని మహాత్మా జ్యోతిభాపూలే గురుకుల పాఠశాల ఉమ్మడి జిల్లా స్థాయి స్పోర్ట్స్​మీట్​ను బుధవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో గురుకులాలు ఏర్పాటు చేసి మెరుగైన విద్య అందిస్తున్నారన్నారు. చదువుతోపాటు క్రమశిక్షణ, యోగ, క్రీడలు నేర్పిస్తున్నట్టు తెలిపారు. తునికి గురుకులం వద్ద మూడెకరాల్లో స్టేడియం ఏర్పాటు చేయిస్తానని, నీటి సమస్య తీర్చడానికి పైప్ లైన్ కోసం రూ.2లక్షలు, బోర్ వేయించడానికి రూ.5 లక్షలు మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు. స్పోర్ట్స్​మీట్​కు 12 గురుకులాల నుంచి 425 మంది హాజరయ్యారు.  కార్యక్రమంలో ఎకనామిక్ గైడెన్స్ ఆఫీసర్ కరుణాకర్, ఎంపీపీ రాజు నాయక్, గ్రంథాలయాల చైర్మన్ చంద్ర గౌడ్, ఆత్మ కమిటీ చైర్మన్ వెంకటరెడ్డి, జడ్పీటీసీ కవితా, సర్పంచ్ సాయిలు, ఎంపీటీసీ సాజిదాబేగం, ప్రిన్సిపల్ శివప్రసాద్ పాల్గొన్నారు.

బైక్​లను ఢీకొట్టిన కారు.. 

దుబ్బాక, వెలుగు: అతి వేగంతో వచ్చిన కారు రెండు బైక్​లను ఢీకొట్టింది. నలుగురికి గాయాలయ్యాయి. ఈ ఘటన దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని దుంపలపల్లి సమీపంలో బుధవారం జరిగింది. పట్టణ14వ వార్డుకు చెందిన టీఆర్​ఎస్​ కౌన్సిలర్ ఆస యాదగిరి తన కారులో అతి వేగంగా సిద్దిపేటకు వెళ్తున్నాడు. పెద్దగుండవెళ్లి గ్రామం నుంచి రెండు బైక్​లపై దుబ్బాకకు వస్తున్న ​బీపాషా(60), అమీనొద్దిన్​(45), భాను, సాయిని అతడు ఢీకొట్టాడు. దీంతో బైక్​లపై ఉన్న నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని సిద్దిపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలాన్ని ఎస్సై మహేందర్​ పరిశీలించారు. 

తోటపల్లి గీత కార్మికుల పాదయాత్ర

కోహెడ(హుస్నాబాద్), వెలుగు : తాటి చెట్లు తొలిగించిన వారిపై చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని డిమాండ్​ చేస్తూ హుస్నాబాద్​ మండలం తోటపల్లి గీత కార్మికులు బుధవారం పట్టణంలోని ఆర్డీవో ఆఫీస్​ వరకు పాదయాత్ర చేపట్టి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భూ యజమాని దుర్గాప్రసాద్ రావు తప్పుడు అనుమతి పత్రాలతో కల్లుపారే తాటి చెట్లను రాత్రికి రాత్రే నరికి వేశాడని ఆరోపించారు. ఆ తాటి చెట్లపై ఆధారపడి జీవనం కొనసాగిస్తున్న40 కుటుంబాలు రోడ్డున పడ్డాయని వాపోయారు. తమకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేకపోతే  సంబంధిత అధికారులపై కోర్టులో కేసు వేసి, హరిత ట్రిబ్యునల్ వరకు వెళ్లేందుకు తాము సిద్ధమని హెచ్చరించారు.