
హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ నేతలకు, వారి పైవాళ్లకు విశ్వాసం ఉంటే శాసనసభను రద్దు చేసి మళ్లీ ఎన్నికలకు వెళ్దామా? అని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్‌కు సవాల్ విసిరారు. బీజేపీ స్టేట్ ఆఫీసులో తనను కలిసిన మీడియా ప్రతినిధులతో ఆయన మాట్లాడారు. పీసీసీ చీఫ్ తన బాధ్యతను మరిచి మాట్లాడుతున్నారని, అధ్యక్షుడిగా ఏది పడితే అది మాట్లాడితే కుదరదని అన్నారు. ‘‘ఓటు చోరీ చేస్తే దేశంలో ఉన్న అన్ని పార్లమెంట్లలో చేస్తాం కదా. అలా చోరీ చేస్తే తెలంగాణలో 8 మందే ఎలా గెలుస్తారు? ఎంఐఎం నేత అసదుద్దీన్‌ను ఎందుకు గెలిపిస్తాం? పీసీసీ చీఫ్కు దమ్ముంటే కాంగ్రెస్‌పార్టీకి చెందిన 8 మంది ఎంపీలను రాజీనామా చేయించాలి. మేమూ 8 మంది ఎంపీలం రాజీనామా చేస్తాం.
కొత్త ఓటర్ లిస్టుతో మళ్లీ ఎన్నికలకు వెళ్దాం. అప్పుడు ఎవరి దమ్ము ఏంటో తేలిపోతుంది’’ అని సవాల్ విసిరారు. కామారెడ్డి డిక్లరేషన్ బీజేపీని అడిగి హామీ అమలు చేశారా? అని ప్రశ్నించారు. కుంటి సాకులు చెప్పకుండా బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై నిజాయతీగా కమిషన్ నివేదికను రాష్ట్ర ప్రజల ముందు ఉంచాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం మిస్ మేనేజ్‌మెంట్‌తో యూరియా కొరత ఏర్పడిందని, ఇతర రాష్ట్రాల్లో లేని యూరియా కొరత తెలంగాణలో ఎందుకు వచ్చిందని రఘునందన్‌రావు ప్రశ్నించారు.