170 ప్రైవేటు ఆస్పత్రులకు షోకాజ్ నోటీసులు

170 ప్రైవేటు ఆస్పత్రులకు షోకాజ్ నోటీసులు
  • హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు
     

హైదరాబాద్: కరోనా చికిత్స విషయంలో రోగులను మోసం లేదా ఇబ్బందులకు గురిచేసినట్లు 170 ప్రైవేటు ఆస్పత్రులపై ఫిర్యాదులు రావడంతో షోకాజ్ నోటీసులు ఇచ్చామని హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు వెల్లడించారు. మొత్తం 350 ఫిర్యాదులు వచ్చాయని, ఫిర్యాదులపై జవాబు చెప్పాలంటూ హాస్పిటల్స్ కు షోకాజ్ నోటీసులు ఇచ్చామని, వాటి జవాబు ఆధారంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన చెప్పారు. 
రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయని, ఈరోజు లక్షకు పైగా టెస్ట్ లు చేస్తే కేవలం 1511 పాజిటివ్ కేసులు వచ్చాయని, 12 మంది చనిపోయారని ఆయన తెలిపారు. తాజా లెక్కల ప్రకారం తెలంగాణలో పాజిటివిటి రేట్ 1.36 శాతం  నమోదు అయిందని, లాక్ డౌన్ కు ముందు 6.74% పాజిటివిటి రేట్ ఉంటే ఇప్పుడు... అతి తక్కువగా 1.36 శాతం నమోదు అయిందన్నారు. పడకల ఆక్యుపెన్సీ విషయానికి వస్తే లాక్ డౌన్ కి ముందు  52 శాతం ఉంటే ఇప్పుడు 16 శాతం ఉందన్నారు. ప్రస్తుతం 55 వేలకు బెడ్స్ ఉన్నాయని, వ్యాక్సినేషన్  గురించి ప్రస్తావిస్తూ గత నెల 25వ తేదీ నుంచి.. నిన్నటి వరకు  16 లక్షలకు పైగా వ్యాక్సిన్లు వేశామన్నారు. 13 లక్షల కు పైగా హై రిస్క్ గ్రూపులకు వ్యాక్సిన్లు వేశామన్నారు. ఒక్క గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే రిస్క్ టెకర్స్ కు 5 లక్షలకు పైగా వేశామన్నారు.

గత రెండు రోజులుగా 2 లక్షల మందికి వ్యాక్సిన్ వేస్తున్నామని, ఇప్పటి వరకు 80 లక్షల మందికి వ్యాక్సిన్ వేశామన్నారు. త్వరలోనే కోటికి చెరబోతున్నామని ఆయన వివరించారు. రాష్ట్రంలో 9 లక్షల 20 వేల స్టాక్ ఉందన్నారు. వర్షాకాలంలో చాలా ఇబ్బందులు మొదలవుతున్నాయని, మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్య వంటి రోగాలు వస్తాయి కాబట్టి సీజనల్ వ్యాధుల మీద సమీక్ష చేశామన్నారు. వ్యాధులు ప్రబలకుండా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకుని సిద్ధంగా ఉన్నామని, గత 4 సవత్సరాలుగా మలేరియా మరణాలు ఒక్కటి కూడా లేవన్నారు. ప్రస్తుతం కేసులు తగ్గినా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని హెల్తె డైరెక్టర్ శ్రీనివాసరావు సూచించారు.