పంట నష్టం తక్కువ చూపుతున్రు!

పంట నష్టం తక్కువ చూపుతున్రు!
  • ఉమ్మడి నల్గొండ జిల్లాలో అంచనా 35, 829 ఎకరాలు.. రిపోర్టులో మాత్రం 13,182 ఎకరాలే... 

యాదాద్రి/సూర్యాపేట/నల్గొండ, వెలుగు: మార్చిలో అకాల వర్షంతో దెబ్బతిన్న పంటల లెక్కను అధికారులు తక్కువ చేసి చూపుతున్నారని పలువురు రైతులు ఆరోపిస్తున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో మొదట మొత్తం 35,829 ఎకరాల్లో నష్టం జరిగినట్లు అంచనా వేశారు. ఎకరానికి రూ.10 వేల చొప్పున నష్టపరిహారం ఇవ్వనున్నట్లు సీఎం కేసీఆర్​ ప్రకటించారు. దాంతో ప్రస్తుతం 13,182 ఎకరాల్లోనే పంట దెబ్బతిన్నట్లు లెక్క తక్కువ చేసి చూపుతున్నారని రైతులు అంటున్నారు. 


యాదాద్రిలో...


యాదాద్రిలో గతనెల 18, 19న కురిసిన వడగండ్ల వానకు 19,800 ఎకరాల్లో పంట నష్టం జరిగింది. అందులో19 వేల ఎకరాల్లో వరి, 800 ఎకరాల్లో  ఇతర పంటలు దెబ్బతిన్నట్లు లెక్కలు వేశారు. ఈ మేరకు ప్రాథమిక నివేదికను ప్రభుత్వానికి అందించారు. అనంతరం రివ్యూ నిర్వహించిన హయ్యర్​ ఆఫీసర్లు 33 శాతం పంట నష్టపోతేనే రికార్డ్​ చేయాలని ఆదేశించినట్టు తెలుస్తోంది. 


భారీగా తేడా


పై ఆఫీసర్ల సూచనల మేరకు అగ్రికల్చర్​ ఆఫీసర్లు పంట నష్టంపై మరోసారి లెక్కలు వేశారు. జిల్లాలో 7,400 ఎకరాల్లో 33 శాతం పంట నష్టపోయినట్టుగా తేల్చారు. పంట సాగు చేసిన 1.88 లక్షల మంది రైతుల్లో కేవలం 6,450 మంది రైతులు నష్టపోయారని నివేదికలో పేర్కొన్నారు. మొదట 19 ,800 ఎకరాల్లో పంట నష్టపోయినట్టుగా తేల్చారు. ఈ లెక్కన వేసిన అంచనాకు నివేదికకు  మధ్య 150 శాతానికి పైగా తేడా వచ్చినట్లయింది.

 
4న జరిగిన నష్టం ఊసేలేదు..


జిల్లాలో ఈ నెల 4న మరోసారి వడగండ్ల వాన కురిసింది. దీంతో జిల్లాలో మరో 10 వేల  ఎకరాల్లో పంట నష్టం జరిగింది. అయితే గత నెలలో వడగండ్ల వాన కారణంగా జరిగిన పంట నష్టం పూర్తి నివేదికనే ఇప్పటివరకు స్టేట్​ లెవల్​ ఆఫీసర్ల వద్దకు చేరలేదు. ఈ నెలలో కురిసిన వాన కారణంగా జరిగిన పంట నష్టం అంచనాలపై హయ్యర్​ ఆఫీసర్ల నుంచి ఎలాంటి సూచనలు రాలేదు. దీంతో పదిరోజులు గడిచినా పంట నష్టం గురించి అగ్రికల్చర్​ ఆఫీసర్లు సర్వే చేయడం లేదు. 


సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో.. 


సూర్యాపేట జిల్లాలో మార్చి 27న కురిసిన అకాల వర్షాలతో తుంగతుర్తి, తిరుమలగిరి మండలాల పరిధిలోని 12గ్రామాల్లో 14,429ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. వీటిలో 12,835ఎకరాల్లో వరి, 1300ఎకరాల్లో మామిడి, 250ఎకరాలలో మిర్చి, 44ఎకరాల్లో మొక్కజొన్న దెబ్బ తిన్నట్లు తెలిపారు.  అయితే మార్చి 30నుంచి గ్రామాల్లో పంట నష్టంపై వారం రోజుల పాటు సర్వే చేపట్టిన అధికారులు కేవలం 5,382 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు రిపోర్ట్ ఇచ్చారు. వీటిలో అత్యధికంగా వరి 4వేల ఎకరాలలో దెబ్బ తిన్నట్లు తేల్చారు. మిగిలిన 1,382 ఎకరాల్లో మామిడి, మిర్చి పంట నష్టపోయినట్లు రిపోర్ట్ ఇచ్చారు. నల్గొండ జిల్లాలో మొదట 1100 మంది రైతులకు సంబంధించి 1600 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు అంచనా వేశారు. ఆ తర్వాత మరోసారి సర్వే చేసి 400 ఎకరాల్లోనే పంట నష్టం జరిగిందని ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు.


 9 ఎకరాలకు 6 ఎకరాలే రాసుకున్రు.. 


నాకు రెండెకరాల పొలం ఉంది. దానికి తోడు మరో పదెకరాలు కౌలుకు తీసుకున్న. పన్నెండు ఎకరాల్లో వరి వేసిన. చేను బాగానే ఉన్నది. కానీ చెడగొట్టు వానతో చేసిన కష్టమం తా నేలపాలైంది. రెండుసార్లు పడ్డ వానకు తొమ్మిదెకరాల్లో పంట దెబ్బ తిన్నది. సర్కారు కొంత ఆదుకుంటదని తెలిసింది. సారోళ్లు వచ్చి పంటను పరిశీ లించిన్రు. కానీ ఆరు ఎకరాలే నష్టపోయినట్లు రాసుకున్రు. మిగతా మూడెకరాలకు కూడా పరిహారం ఇయ్యాలె. లేకపోతే నష్టపోతం. 


– బత్తిని శ్రీను, రైతు, 
పనకబండ, మోత్కూర్ మండలం తక్కువ చూపి

 
నష్టాలపాలు చేయొద్దు.. 


పంట నష్టంపై అధికారులు లెక్క తక్కువ చూపి తమను నష్టాలపాలు చేయొద్దని పలువురు రైతులు వేడుకుంటున్నారు. అధికారులు మొదట నష్టపోయిన పంటలన్నింటిని లెక్కించి తర్వాత అందులో సగానికి సగం తగ్గించి చెబుతున్నారని ఆరోపిస్తున్నారు. ఈ పరిస్థితితో చాలా మంది రైతులకు  అన్యాయం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తమ గోడును పట్టించుకొని సరైన పరిహారం ఇచ్చి ఆదుకోవాలని కోరుతున్నారు.