తెలుగు రాష్ట్రాల్లో పెండ్లి బాజాలు.. జూలై 25 నుంచి శ్రావణ మాసం పెండ్లిండ్లు షురూ

తెలుగు రాష్ట్రాల్లో పెండ్లి బాజాలు.. జూలై 25 నుంచి శ్రావణ మాసం పెండ్లిండ్లు షురూ
  • నేటి నుంచి శ్రావణ మాసం పెండ్లిండ్లు షురూ
  • వచ్చే నెల 21 వరకు ముహుర్తాలు
  • నెల పాటు ఫంక్షన్  హాల్స్ అన్నీ ఫుల్
  • సెప్టెంబరు 23 నుంచి ముహుర్తాలు మళ్లీ స్టార్ట్ 

హైదరాబాద్, వెలుగు: ఆషాడ మాసం ముగిసింది. శుక్రవారంతో నుంచి శ్రావణ మాసం ప్రారంభమైంది. దీంతో తెలుగు రాష్ర్టాల్లో పెళ్లి బాజాలు మోగనున్నాయి. గత నెల రోజుల పాటు ఆషాడంతో పాటు మంచి రోజులు లేకపోవడంతో ఆగిన పెళ్లిళ్లు, ఇతర శుభాకార్యాలు శుక్రవారం నుంచి షురూ అయ్యాయి. వేల జంటలు ఏకం కానున్నాయి. వచ్చే నెల 23 వరకు మంచి రోజులు ఉన్నాయని పురోహితులు చెబుతున్నారు. పెళ్లిళ్లు, గృహప్రవేశాలతో తెలుగు రాష్ట్రాల్లో ఇండ్లు సందడిగా మారనున్నాయి. 

ఈనెల 25 నుంచి వచ్చే నెల 23 వరకు శ్రావణ మాసం ఉండగా తరువాత భాద్రపదం రానుంది. సెప్టెంబరు 21 వరకు ఇది శూన్యమాసం కావడంతో  శుభ ముహుర్తాలు లేక వేడుకలకు బ్రేక్  పడనుంది. ఇక, ఈ నెలలో 26, 30, 31వ తేదీల్లో భారీగా పెళ్లిళ్లు జరగనున్నాయి. అలాగే వచ్చే నెలలో 1, 3, 5, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 17, 21వ తేదీన మంచి ముహుర్తాలు ఉన్నాయని పురోహితులు చెబుతున్నారు.  
మళ్లీ సెప్టెంబరు  23 నుంచి 24,  26, 27, 28వ తేదీలతో పాటు కార్తీక మాసం అయిన అక్టోబరు, నవంబరులో కూడా మంచి ముహుర్తాలు ఉన్నాయి. 

డిసెంబరు 8 నుంచి ఫిబ్రవరి 6 వరకు మంచి రోజులు లేవని పండితులు తెలిపారు. 

ఫుల్ వ్యాపారం

తెలుగు రాష్ర్టాల్లో ఇప్పటికే అన్ని ఫంక్షన్స్ హాల్స్ బుక్  అయ్యాయి. కొన్ని రోజులు అయితే రోజుకు రెండు లేదా మూడు ఫంక్షన్స్  జరగనున్నాయి. గత 15 రోజుల పాటు ఆషాడ మాసం ఆఫర్ల పేరుతో పెళ్లిళ్ల షాపింగ్ తో మాల్స్, గోల్డ్  షాపులు రద్దీగా మారాయి. కొత్త బట్టల కొనుగోలు, బంగారం, వజ్రాలు, పెళ్లికార్డులు, ప్రీ వెడ్డింగ్  షూట్స్, కెమెరా, వీడియో, బ్యాండ్ మేళం, ట్రావెల్స్, హోటల్స్, బాంకెట్  హాల్స్, ఈవెంట్  మేనేజింగ్  ఏజెన్సీలు, డెకరేషన్, క్యాటరింగ్ వంటి రంగాల్లో నెల రోజుల పాటు కోట్ల రెవెన్యూ జరగనుంది. దీంతో లక్షల మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి పొందనున్నారు.

మంచి ముహుర్తాలు ఉన్న రోజులు

  • జులై : 26, 30, 31 
  • ఆగస్టు : 1, 3, 5, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 17,21
  • సెప్టెంబర్ : 23, 24, 26, 27, 28
  • అక్టోబర్ : 1, 2, 3, 4, 8, 10, 11, 12,  22, 24, 29, 30, 31
  • నవంబర్ : 1, 2, 7, 8, 12, 13, 15, 22, 23, 26, 27, 29, 30