PBKS vs DC: ఐపీఎల్ 2026లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న కీలక పోరులో పంజాబ్ కింగ్స్ బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. యువ సంచలనం ప్రియాంష్ ఆర్య సిక్సర్ల సునామీకి తోడు, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ క్లాస్ ఇన్నింగ్స్ తోడవ్వడంతో పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది.
తొలి ఓవర్ నుంచే ఊచకోత:
టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న పంజాబ్ కు ఓపెనర్లు అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. ఇన్నింగ్స్ మొదటి ఓవర్ లోనే రెండు సిక్సర్లు, ఒక ఫోర్, 5 వైడ్లతో కలిపి ఏకంగా 22 పరుగులు రాబట్టారు. ముఖ్యంగా ప్రియాంష్ ఆర్య ఢిల్లీ బౌలర్లను ఒక ఆటాడుకున్నాడు. ఈ క్రమంలోనే పంజాబ్ కింగ్స్ కేవలం 2.4 ఓవర్లలోనే 50 పరుగుల మైలురాయిని అందుకుని టీ20ల్లో అత్యంత వేగవంతమైన స్కోరింగ్‌లో ఒకటిగా రికార్డు సృష్టించింది.
ప్రియాంష్ మెరుపు హాఫ్ సెంచరీ:
క్రీజులోకి వచ్చిన క్షణం నుంచే బాదుడు మొదలు పెట్టిన ప్రియాంష్ ఆర్య, కేవలం 24 బంతుల్లోనే 50 పరుగులు పూర్తి చేశాడు. మొత్తంగా 33 బంతుల్లో 2 ఫోర్లు, 6 భారీ సిక్సర్లతో 56 పరుగులు చేసి మాధవ్ తివారీ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. మరో ఓపెనర్ ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (18) ముకేష్ కుమార్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు.
అయ్యర్, కొన్నోలీ భాగస్వామ్యం:
ఓపెనర్లు అవుట్ అయిన తర్వాత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, కూపర్ కొన్నోలీ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపారు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 83 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని జోడించారు. కొన్నోలీ (38) అవుట్ అయిన వెంటనే, మిచెల్ స్టార్క్ రంగంలోకి దిగి మార్కస్ స్టోయినిస్, శశాంక్ సింగ్‌లను వరుస బంతుల్లో అవుట్ చేసి పంజాబ్‌కు షాక్ ఇచ్చాడు.
చివర్లో సూర్యాంశ్ షెడ్జ్ మెరుపులు:
ఒకవైపు వికెట్లు పడుతున్నా శ్రేయస్ అయ్యర్ నిలకడగా ఆడి 'కిరాక్' హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. చివర్లో సూర్యాంశ్ షెడ్జ్ భారీ షాట్లతో విరుచుకుపడటంతో పంజాబ్ స్కోరు 210కి చేరుకుంది. ఢిల్లీ ముందు ఇప్పుడు 211 పరుగుల భారీ లక్ష్యం ఉంది. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో మిచెల్ స్టార్క్, మాధవ్ తివారీ తలో రెండు వికెట్లు తీసుకోగా, ముకేష్ కుమార్ ఒక వికెట్ పడగొట్టాడు.
