ముంబై: టీమిండియా టీ20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌ను తొలగించనున్నారా? అతని ప్లేస్‌లో శ్రేయస్ అయ్యర్‌కు పగ్గాలు అప్పగించనున్నారా? అంటే బీసీసీఐ నుంచి అవుననే సమాధానమే వస్తోంది. సూర్య బ్యాటింగ్ ఫామ్‌పై తీవ్ర అసంతృప్తితో ఉన్న బోర్డు.. ఐపీఎల్‌లో దుమ్మురేపుతున్న శ్రేయస్ వైపు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. మెగా లీగ్ తర్వాత సారథ్య బాధ్యతలు సాఫీగా చేతులు మారేలా బీసీసీఐ ఓ ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. 2024 వరల్డ్ కప్ తర్వాత రోహిత్ శర్మ నుంచి టీ20 కెప్టెన్సీ బాధ్యతలు తీసుకున్న సూర్యకుమార్ 2026లో మెగా కప్‌ను అందించాడు.
కానీ నాయకత్వ ఒత్తిడి వల్ల తన సహజ సిద్ధమైన ఆటను చూపెట్టలేకపోతున్నాడు. ఒకప్పుడు 170కి పైగా స్ట్రయిక్ రేట్‌తో ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడిన సూర్య గత కొంతకాలంగా పరుగుల వేటలో బాగా వెనకబడ్డాడు. అలాగే వయసు కూడా ప్రధాన అడ్డంకిగా మారనుంది. ఈ నేపథ్యంలో 2028 టీ20 వరల్డ్ కప్, లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్‌ను దృష్టిలో పెట్టుకుని ఇప్పట్నించే కొత్త కెప్టెన్‌ను నియమిస్తే బాగుంటుందని బోర్డు భావిస్తోంది. జట్టులో హార్దిక్ పాండ్యాలాంటి సీనియర్లు ఉన్నా.. శ్రేయస్‌కు పగ్గాలు అప్పగిస్తే దీర్ఘ కాలంలో మంచి ప్రయోజనాలు చేకూరుతాయని యోచిస్తోంది.
