సూర్యకుమార్‌కు షాక్.. కొత్త టీ20 కెప్టెన్‌గా శ్రేయస్ పేరు ఫైనల్?.. టీమిండియాలోకి వైభవ్!

సూర్యకుమార్‌కు షాక్.. కొత్త టీ20 కెప్టెన్‌గా శ్రేయస్ పేరు ఫైనల్?.. టీమిండియాలోకి వైభవ్!

India T20 Captain: భారత క్రికెట్‌లో సంచలన మార్పులకి సెలక్షన్ కమిటీ తెరలేపబోతుంది. 2026 టీ20 వరల్డ్ కప్ చాంపియన్‌గా నిలిచిన టీమిండియా.. ఇప్పుడు తన తర్వాతి సిరీస్‌లకు సమాయత్తమవుతోంది. ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనలతో పాటు త్వరలో జరిగే ఆసియా క్రీడల్లో (Asian Games) తలపడే భారత జట్లను అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ఇవాళ (శనివారం, 2026, జూన్ 6) ప్రకటించనుంది.

సూర్యపై వేటు పక్కా: 
అయితే ఈ సెలక్షన్ మీటింగ్‌లో అందరినీ షాక్‌కు గురి చేసే ఒక పెద్ద నిర్ణయం తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది. అదేంటంటే.. టీ20 కెప్టెన్సీ నుంచి సూర్యకుమార్ యాదవ్‌ను తొలగించడం దాదాపు ఖాయమైపోయింది. అతడి సారథ్యంలోనే భారత్ మొన్ననే వరల్డ్ కప్ గెలిచింది, అయినా సరే సూర్యపై వేటు వేయనుండటంతో పాటు తుది జట్టులో అతడు అవకాశం కోల్పోయే ప్రమాదం నెలకొనడం ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. 

స్కైపై వేటుకు అసలు కారణం గిదే: 
వరల్డ్ కప్ నెగ్గినా కూడా సుదీర్ఘ కాలంగా సూర్యకుమార్ యాదవ్ ఫామ్ మస్తు ఘోరంగా ఉంది. వరల్డ్ కప్‌లో 9 ఇన్నింగ్స్‌ల్లో కలిపి ఆయన చేసింది కేవలం 242 పరుగులే. ఆ పేలవ ఫామ్‌ను ఐపీఎల్‌లో కూడా కొనసాగిస్తూ 13 ఇన్నింగ్స్‌ల్లో 270 రన్స్ మాత్రమే చేసిండు. రాబోయే 2028 టీ20 వరల్డ్ కప్, లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్‌ను దృష్టిలో పెట్టుకుని యంగ్ టీమ్‌ను బిల్డ్ చేయాలని చూస్తున్న సెలక్టర్లు.. సూర్య స్థానంలో శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer)కి కెప్టెన్సీ బాధ్యతలు ఇవ్వబోతున్నారని సమాచారం. శ్రేయస్ 2023 డిసెంబర్ తర్వాత ఇండియా తరఫున టీ20 ఆడకపోయినా.. ఐపీఎల్‌లో అతడి కెప్టెన్సీ రికార్డు సూపర్ గా ఉంది.

వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ లాంఛనమే?: 
బీసీసీఐ సెలక్షన్ మీటింగ్‌లో మరో సంచలనం నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ (Vaibhav Sooryavanshi) టీమ్‌లోకి రావడం.. తన అసాధారణమైన ఆటతో అందరి దృష్టిని తిప్పుకున్న వైభవ్‌ను జట్టులోకి తీసుకురావడానికి ఇదే కరెక్ట్ టైమ్ అని సెలక్టర్లు భావిస్తున్నారు. ఐపీఎల్‌లో ఏకంగా 237.30 స్ట్రైక్ రేట్‌తో అతడు 776 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచి దుమ్ములేపాడు.

ఫుల్ పటిష్టంగా టాప్ 3:  
అయితే ప్రస్తుత భారత టీ20 జట్టు టాప్-3 స్థానాలు అభిషేక్ శర్మ, సంజు శాంసన్, ఇషాన్ కిషన్లతో ఫుల్ పటిష్టంగా ఉంది. ఈ నేపథ్యంలో మెయిన్ టీమ్‌లో వైభవ్ ఆడటం కాస్త కష్టమే అయినా.. జపాన్‌లో జరిగే ఆసియా క్రీడల (Asian Games) టీమ్‌కు మాత్రం ఆయన ఎంపిక కావడం పక్కా అని టాక్ నడుస్తోంది. జూన్ 26న ప్రారంభమయ్యే ఈ టూర్‌లో భాగంగా ముందుగా ఐర్లాండ్‌తో 2 టీ20లు, ఆ తర్వాత ఇంగ్లాండ్‌తో 5 టీ20లు, 3 వన్డేలు టీమిండియా ఆడనుంది. మరి ఈ సిరీస్‌ల కోసం సెలక్టర్లు ఎలాంటి టీమ్‌ను ప్రకటిస్తారో అనేది వేచి చూడాలి.