
- సోమవారం మధ్యాహ్నం ఐఎస్ఎస్తో స్పేస్ క్రాఫ్ట్ అన్ డాకింగ్
- మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు భూమి మీదకు..
- కాలిఫోర్నియా పసిఫిక్ సముద్ర తీరంలో ల్యాండింగ్
- ఐఎస్ఎస్ నుంచి 22 గంటల ప్రయాణం
న్యూఢిల్లీ: యాక్సియం-4 మిషన్‌లో భాగంగా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ (ఐఎస్‌ఎస్)కు వెళ్లిన ఇండియన్ ఆస్ట్రొనాట్ శుభాంశు శుక్లా, మరో ముగ్గురు వ్యోమగాములు మరికొన్ని గంటల్లో భూమి మీదకు ల్యాండ్ కానున్నారు. ముందుగా ఆస్ట్రొనాట్లు శుభాంశు శుక్లా, పెగ్గీ విట్సన్, స్లావోస్జ్ ఉజ్నాన్స్‌కీ-విస్నియొస్కీ, టిబర్ కపులకు ఐఎస్ఎస్లో వైద్య పరీక్షలు నిర్వహించారు. తర్వాత స్పేస్ సూట్ వేసుకుని డ్రాగన్ గ్రేస్ స్పేస్ క్రాఫ్ట్‌లోకి ఎంటర్ అయ్యారు. సోమవారం మధ్యాహ్నం 2.37 గంటలకు ఐఎస్ఎస్తో స్పేస్ క్రాఫ్ట్ అన్ డాకింగ్ విజయవంతమైంది.
మంగళవారం మధ్యాహ్నం సుమారు 3 గంటల సమయంలో కాలిఫోర్నియా పసిఫిక్ సముద్రంలోని తీర ప్రాంతంలో వీరి స్పేస్ క్రాఫ్ట్ ల్యాండ్ అవుతుంది. అంతరిక్ష కేంద్రం నుంచి భూమికి చేరుకోవడానికి మొత్తం 22 గంటల సమయం పడుతుంది. శుభాంశు బృందం దాదాపు 18 రోజుల పాటు ఐఎస్ఎస్లో పలు ప్రయోగాలు చేసింది. కాగా, శుభాంశు శుక్లా రాక కోసం అతని తల్లిదండ్రులు లక్నోలో ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. సేఫ్‌గా భూమికి చేరుకోవాలని దేవుణ్ని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. దేశం తరఫున తన కొడుకు ఐఎస్ఎస్ కు వెళ్లినందుకు ఎంతో గర్వంగా ఉందని చెప్పారు. అంతరిక్షం నుంచి శుభాంశు పంపిన ఫొటోలు చూసి ఎంతో ఆనందం వేసిందన్నారు. దేశ ప్రజలు, ప్రధాని నరేంద్ర మోదీ ఆశీర్వాదాలతోనే తన కొడుకు అంతరిక్షానికి వెళ్లాడని, ఈ సందర్భంగా అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు చెప్పారు.