Shubman Gill: హాస్పిటల్‌లో గిల్.. తొలి టెస్టుకు టీమిండియా కెప్టెన్ దూరం

Shubman Gill: హాస్పిటల్‌లో గిల్.. తొలి టెస్టుకు టీమిండియా కెప్టెన్ దూరం

టీమిండియా కెప్టెన్ శుభమాన్ గిల్ సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టుకు దూరమయ్యాడు. కోల్‌కతాలో ఈడెన్ గార్డెన్స్‌ వేదికగా జరుగుతున్న ఈ టెస్టు తొలి ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు మెడ పట్టేయడంతో గిల్ బ్యాటింగ్ చేయలేక గ్రౌండ్ వదిలి వెళ్ళిపోయాడు. రిటైర్డ్ హర్ట్ గా వెనుదిరిగిన గిల్.. ఆ తర్వాత తొలి ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ కు రాలేదు. గిల్ ప్రస్తుతం కోల్‌కతాలోని ఆసుపత్రిలో చేరాడు. గిల్ వైద్య బృందం పర్యవేక్షణలో ఉంటాడని BCCI ఆదివారం (నవంబర్ 16) ధృవీకరించింది. దీంతో రెండో ఇన్నింగ్స్ లో టీమిండియా గిల్ సేవలను కోల్పోనుంది.  

"కోల్‌కతాలో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్‌లో రెండో రోజు కెప్టెన్ శుభ్‌మాన్ గిల్ మెడకు గాయమైంది. రోజు ఆట ముగిసిన తర్వాత అతన్ని పరీక్ష కోసం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం గిల్ ఆసుపత్రిలో పరిశీలనలో ఉన్నాడు. మిగిలిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో ఆడడు.  బీసీసీఐ వైద్య బృందం పర్యవేక్షణలో ఉంటాడు".అని బీసీసీఐ ట్వీట్ ద్వారా గిల్ గాయంపై అప్ డేట్ ఇచ్చింది. గిల్ లేకపోవడంతో ఈ మ్యాచ్ లో టీమిండియా 10 మందితోనే బ్యాటింగ్ చేయాల్సి ఉంది. ఈ టీమిండియా కెప్టెన్ స్థానంలో బ్యాటింగ్ చేయడానికి వేరొకరికి అవకాశం లేదు.    

అసలేం జరిగిందంటే..?

శనివారం (నవంబర్ 15) రెండో రోజు ఆటలో భాగంగా గిల్ కు గాయమైంది. వాషింగ్ టన్ సుందర్ కు ఔటైన తర్వాత నాలుగో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన గిల్.. మూడో బంతికే ఫోర్ కొట్టి పరుగుల ఖాతా తెలిచాడు. బ్యాక్ వర్డ్ స్క్వేర్ లెగ్ దిశగా స్వీప్ షాట్ ఆడడంతో గిల్ మెడ నొప్పితో ఇబ్బందిగా కనిపించాడు. రాహుల్ తో కాసేపు చర్చించిన ఈ టీమిండియా కెప్టెన్ గ్రౌండ్ వదిలి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. 4 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద గిల్ రిటైర్డ్ హర్ట్ గా వెనుదిరాగాల్సి వచ్చింది. గిల్ రిటైర్డ్ హర్ట్ గా పెవిలియన్ కు చేరడంతో అతని స్థానంలో పంత్ బ్యాటింగ్ కు వచ్చాడు.

ఈ మ్యాచ్ విషయానికి వస్తే  రెండో రోజు ఆట ముగిసే సమయానికి సఫారీ జట్టు రెండో ఇన్నింగ్స్‌‌‌‌లో 93/7తో పీకల్లోతు కష్టాల్లో పడింది. ప్రస్తుతం ఆ టీమ్  63 రన్స్  ఆధిక్యంలో ఉంది. కెప్టెన్ టెంబా బవూమ (29 బ్యాటింగ్) ఒంటరి పోరాటం చేస్తున్నాడు. చేతిలో మరో మూడు వికెట్లు ఉండటంతో ఆదివారమే మ్యాచ్ ముగియడం దాదాపు ఖాయమైంది.  ఓవర్‌‌‌‌‌‌‌‌నైట్ స్కోరు 37/1తో ఆట కొనసాగించిన ఇండియా తొలి ఇన్నింగ్స్‌‌‌‌లో 189 రన్స్‌‌‌‌కు ఆలౌటైంది. సౌతాఫ్రికా తమ తొలి ఇన్నింగ్స్ లో 159 పరుగులకు ఆలౌటైంది.