
- 2027 ఐసీసీ వన్డే వరల్డ్ కప్ వరకు బాధ్యతలు
జొహనెస్‌బర్గ్: సౌతాఫ్రికా టెస్టు జట్టు కోచ్ షుక్రి కాన్రాడ్‌కు అన్ని ఫార్మాట్ల కోచింగ్ బాధ్యతలను అప్పగించారు. క్రికెట్ సౌతాఫ్రికా (సీఎస్‌ఏ) శుక్రవారం ఈ విషయాన్ని వెల్లడించింది. 2027 ఐసీసీ వన్డే వరల్డ్ కప్ వరకు అతను ఈ బాధ్యతల్లో కొనసాగుతారని తెలిపింది. 2023 చాంపియన్స్ ట్రోఫీ తర్వాత రాబ్ వాల్టెర్ స్థానంలో కాన్రాడ్ టెస్ట్ జట్టు కోచ్‌గా బాధ్యతలు స్వీకరించారు. అప్పట్నించి టెస్ట్‌లకే పరిమితమైన అతనికి జులైలో జింబాబ్వేతో జరిగే టీ20 సిరీస్ తొలి వైట్‌బాల్ అసైన్‌మెంట్ కానుంది. ‘టెస్ట్‌ల్లో కాన్రాడ్‌కు అద్భుతమైన ట్రాక్ రికార్డు ఉంది.
దాన్ని వైట్‌బాల్‌లోనూ కొనసాగిస్తాడని ఆశిస్తున్నాం. ఈ రెండు ఫార్మాట్లలోనూ టీమ్‌కు మంచి స్ట్రక్చర్ ఏర్పరుస్తాడని మేం ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాం’ అని సీఎస్‌ఏ హై పెర్ఫామెన్స్ డైరెక్టర్ ఎనోచ్ ఎన్కీ పేర్కొన్నారు. కాన్రాడ్ ఆధ్వర్యంలోనే సఫారీ జట్టు ఈసారి డబ్ల్యూటీసీ ఫైనల్స్‌కు చేరింది. వచ్చే నెలలో లార్డ్స్‌లో జరిగే ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా.. ఆస్ట్రేలియాతో తలపడనుంది. 58 ఏళ్ల కాన్రాడ్ సౌతాఫ్రికా తరఫున ఎలాంటి మ్యాచ్‌లు ఆడకపోయినా కోచింగ్‌లో మంచి అనుభవం ఉంది. డొమెస్టిక్‌లో వెస్ట్రన్ ప్రావిన్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు. మూడు ఫార్మాట్లలో నేషనల్ టీమ్‌ను నడిపించే బాధ్యతను అప్పగించడం తనకు నిజంగా గౌరవంగా ఉందని కాన్రాడ్ వ్యాఖ్యానించారు.