ఆగస్టులో ఎస్సై, కానిస్టేబుల్ ప్రిలిమినరీ ఎగ్జామ్

ఆగస్టులో ఎస్సై, కానిస్టేబుల్ ప్రిలిమినరీ ఎగ్జామ్

ఎస్సై, కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్ష తేదీలను పోలీసు నియామక బోర్డు ఖరారు చేసింది. ఆగస్టులో పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఆగస్టు 7 ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఎస్ఐ (సివిల్) అభ్యర్థుల నియామక పరీక్ష నిర్వహించనున్నారు. ఇందుకోసం హైదరాబాద్ తో పాటు రాష్ట్రంలోని 20 పట్టణాల్లో ఎగ్జామ్ సెంటర్లు ఏర్పాటు చేయనున్నారు. ఎస్సై అభ్యర్థులు జులై 30 నుంచి హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఎస్ఐ పోస్టులకు 2,45,000 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.

సివిల్ తో పాటు ట్రాన్స్ పోర్ట్, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి ఆగస్టు 21 ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ప్రిలిమినరీ ఎగ్జామ్ నిర్వహించనున్నారు. హైదరాబాద్ తో పాటు 40 ప్రాంతాల్లో కానిస్టేబుల్ రాత పరీక్ష నిర్వహించనున్నారు. ఆగస్టు 10 నుంచి కానిస్టేబుల్ అభ్యర్థులు హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకునే అవకాశం కల్పించారు. కానిస్టేబుల్ పోస్టుల కోసం రాష్ట్రవ్యాప్తంగా 6,50,000 మంది అప్లై చేసుకున్నారు.

తొలుత జూన్ ఆఖరులో లేదా జులై మొదటి వారంలో పరీక్ష నిర్వహించాలని భావించినా, వయోపరిమితిలో రెండేళ్ల సడలింపు ఇవ్వడంతో.. దరఖాస్తు గడువును పొడిగించారు. ఈ నేపథ్యంలో రెండు వారాలు ఆలస్యంగా రాత పరీక్ష నిర్వహించాలని బోర్డు అధికారులు నిర్ణయించారు. ప్రిలిమినరీ రాత పరీక్ష తరువాత అర్హులైన వారికి ఈవెంట్స్ నిర్వహించనున్నారు. ఇందులో క్వాలిపై అయిన వారికే మెయిన్స్ రాసేందుకు వీలవుతుంది. మెయిన్స్ ఫలితాలు వెలువడిన అనంతరం మెరిట్ ఆధారంగా తుది జాబితా రూపొందిస్తారు. ఈ ఏడాది ఏప్రిల్ లో ఎస్సై, కానిస్టేబుల్ నియామక నోటిఫికేషన్ వెలువడగా.. దీని ద్వారా 554  ఎస్సై, 15.644 సివిల్ కానిస్టేబుల్, 63 ట్రాన్స్ పోర్ట్ కానిస్టేబుల్, 614 ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేయనున్నారు.